నేరుగా అయితే లేదట

కేంద్రంలోని బీజేపీతో వైసీపీ సంబంధాల మీద ఇపుడు ఏపీలో పెద్ద చర్చే సాగుతోంది. జగన్ నేరుగా వెళ్ళి ఎన్డీఏ కూటమిలో చేరుతారని, ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ [more]

Update: 2020-02-18 08:00 GMT

కేంద్రంలోని బీజేపీతో వైసీపీ సంబంధాల మీద ఇపుడు ఏపీలో పెద్ద చర్చే సాగుతోంది. జగన్ నేరుగా వెళ్ళి ఎన్డీఏ కూటమిలో చేరుతారని, ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ విస్తరణలో వైసీపీకి మూడు మంత్రి పదవులు ఖాయ‌మన్న ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతూంటే మరో వైపు అదేం లేదు, కేంద్రంలో సఖ్యతగానే వైసీపీ ఉంటుంది తప్ప ప్రభుత్వంలో చేరదని కూడా అంటున్నారు. వైసీపీకి ఉన్న బలమైన మైనారిటే ఓటు బ్యాంక్ కారణంగా ఈ విషయంలో హైకమాండ్ తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. మరో వైపు వైసీపీ కేంద్రంలో అధికారం పంచుకుంటే ఒకలా, బయటన ఉంటే మరోలా రాజకీయం చేయడానికి టీడీపీ తయారుగా ఉంది.

చేరితే తంటా…?

వైసీపీని కేంద్రంలో చేరమని మోడీ, షాలు గట్టిగానే కోరుతున్నట్లుగా ఢిల్లీ వార్తలు వస్తున్నాయి. వైసీపీ వంటి నమ్మకమైన పార్టీ తమతో ఉంటే పెద్దల సభలో మద్దతు కోసం హైరానా పడాల్సిన అవసరం లేదని, పైగా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఓ వైపు దూకుడు పెంచుతున్న క్రమంలో వైసీపీ వంటి పెద్ద పార్టీని చేర్చుకుని మేమే చాంపియన్స్ అని లోకానికి చూపించాలన్నది బీజేపీ ఎత్తుగడ. ఆ విధంగా దక్షిణాదిన తమ మిత్ర పక్షంతో అధికారంలో ఉన్నామని అనుకోవడంతో పాటు, ప్రాంతీయ కూటమి ఐక్యతకు దెబ్బ కొట్టాలన్నది బీజేపీ అసలైన స్ట్రాటజీ. అయితే ఈ విషయంలో బలవంతాలు, ఒత్తిడులు ఎంత ఉన్నా కూడా జగన్ మాత్రం తన పార్టీ రాజకీయానికి, ప్రజలకు ఏది మేలు అన్నదే ఆలోచన చేస్తున్నట్లుగా భోగట్టా.

వయా మీడియాగా…..

నిజానికి జగన్ పార్టీ ఇపుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో చేరితే మోడీక‌ది కొండంత ఊరటగా ఉంటుంది. దేశమంతా సీఏఏ మీద విరుచుకుపడుతున్న తరుణంలో పెద్ద దన్ను దొరుకుతుంది. రాజకీయంగా మళ్ళీ ఊపు వస్తుంది. అందుకే జగన్ ని ఢిల్లీ పిలిపించుకుని మరీ చెప్పాల్సినదంతా చెప్పారని భోగట్టా. అయితే జగన్ మొహమాటాలకు పోకుండా తన పార్టీ మైనారిటీ ఓటు పునాదిని నిలబెట్టుకుంటూనే కేంద్రానికి చెడ్డ కాకుండా వయా మీడియాగా వ్యవహరించాల‌నుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఓ విధంగా బయట నుంచి మద్దతు ఇస్తూ అంశాల వారీగా దన్నుగా నిలబడడం అన్న మాట.

అచ్చం బాబులా…..

చంద్రబాబుకి కూడా ఇదే రకమైన ఇబ్బంది 1999-2004 మధ్యలో ఏర్పడింది. అపుడు కేంద్రంలో వాజ్ పేయ్ సర్కార్ అధికారంలో ఉంది. ప్రభుత్వంలో చేరమని వాజ్ పేయ్ ఎన్నో సార్లు బాబుని ఆహ్వానించారు. అయితే బాబు ఉమ్మడి ఏపీ సీఎంగా, టీడీపీ అధినేతగా మైనారిటీ ఓట్ల గురించి ఆలోచించారు. దాంతో బయట నుంచి మద్దతు ఇస్తూ ఏపీకి భారీ ఆర్ధిక సాయం తెచ్చుకున్నారు. అలా చెడ్డకాకుండా కధ నడిపారు. ఇపుడు అదే ఫార్ములాను జగన్ కూడా అమలు చేయాలను కుంటున్నారుట. అవసరమైన సందర్భాల్లో మా మద్దతు ప్రభుత్వానికి ఉంటుంది. మేము బయట నుంచి సపోర్ట్ చేస్తాం, మా ఇబ్బందుకు మాకు ఉన్నాయి, అర్ధం చేసుకోండి అంటూ సున్నితంగానే జగన్ మోడీ, షాలతో చెప్పి కోఆర్డినేట్ చేసుకుంటారని వినిపిస్తోంది. మరి దీనికి బీజేపీ ఎంతవరకు అంగీకరిస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్.

Tags:    

Similar News