జగన్ ను వదలిపెట్టకూడదని…?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్య దాహం చాలా ఎక్కువగానే ఉంది. ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రజలు అధికారం ఇచ్చారు. దేశంలో [more]

Update: 2019-10-05 05:00 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్య దాహం చాలా ఎక్కువగానే ఉంది. ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రజలు అధికారం ఇచ్చారు. దేశంలో దాదాపుగా ఇరవై రాష్ట్రాలలో బీజేపీ పాలన సాగుతోంది. అయినా సరే సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఆ పార్టీకి తగ్గలేదు. ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల మీద గురి పెట్టింది. రాగద్వేషాలు రాజకీయాల్లో తావు లేదని అంటారు. అవకాశమే ఆయుధంగా చేసుకుని చొచ్చుకుపోవాలన్నది రాజకీయ నీతి. దాంతో ఇపుడు బీజేపీ కూడా అదే పని మీద ఉంది. బీజేపీ తెలంగాణాలో కేసీఆర్ మీద కన్ను వేసింది. ఇపుడు జగన్ ని కూడా విడవకూడదనుకుంటోంది.

ఎంత మంచిగా ఉన్నా…

నిజానికి ఏపీలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా మోడీని కానీ, అమిత్ షాని కానీ పల్లెత్తు మాట అనని సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక సార్లు మోడీని కలసి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బంపర్ మెజారిటీ దక్కినప్పటికీ కేంద్రం పట్ల మంచిగానే ఉంటూ నాలుగు డబ్బులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. బీజేపీ వద్దన్నదని ప్రత్యేక హోదా విషయాన్ని కూడా జగన్ ఇపుడు పక్కన పెట్టేసారు. అయితే జగన్ ఇంత మంచిగా ఉన్నా కూడా కాషాయం పార్టీకి మాత్రం ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో నిధుల లేమి ఉంది. జగన్ కి ఏ మాత్రం సాయం అందించకపోగా తన పార్టీ వారితో ప్రతీ రోజూ తిట్టించే పనికి బీజేపీ సిధ్ధపడుతోంది.

సీబీఐ వెనక….?

జగన్ కేసు ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా కోర్టులో నలుగుతోంది. దీనికి సంబంధించి పదహారు నెల‌ల పాటు జగన్ జైలులో కూడా ఉన్నారు. అనేక చార్జిషీట్లు వేశారు. అయినా ఈ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసినా కూడా ప్రతి శుక్రవారం ఠంచనుగా కోర్టుకు హాజరయ్యారు. ఇపుడు ఆయన ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అందువల్ల బిజీ షెడ్యూల్ ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టుకు విన్నవించుకున్నరు. దీని మీద సీబీఐ ఘాటుగా స్పందించింది. జగన్ కి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వవద్దని వాదించింది.

ప్రభావితం చేస్తారని…

జగన్ సాక్షులను ఆయన ప్రభావితం చేస్తారని కూడా పేర్కొంది. ఈ రకమైన కామెంట్స్ సీబీఐ చేయడం వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. సీబీఐ ఎవరి నియంత్రణలో ఉందో అందరికీ తెలిసిందే. అటువంటి సీబీఐ జగన్ కి వ్యతిరేకంగా బలమైన వాదన వినిపించడంద్వారా ఇరుకునపెట్టాలనుకుంటోంది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరైతే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. విపక్షానికి మరో అస్త్రం అందించినట్లు అవుతుంది. నిజానికి జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో తప్పులేదు. ఆయన ఎక్కడికీ పారిపోలేదు. ముఖ్యమంత్రిగా అనునిత్యం ప్రజల ముందే ఉంటారు. మరి అలాంటిది లాజిక్ లేని వాదనలు సీబీఐ చేస్తోందంటే దాని వెనక ఎవరు ఉన్నారా అని వైసీపీ శ్రేణులు తర్కించుకుంటున్నాయి.

Tags:    

Similar News