ఇప్పటికిది కరెక్టేనా?

కేంద్రంలో బీజేపీకి జగన్ ఇపుడు కొత్త మిత్రుడు అవుతున్నారు. ఆ మాటకు వస్తే జగన్ ఎప్పటినుంచో తెర వెనక మిత్రుడు అని రాజకీయం తెలిసిన వారు అంటారు. [more]

Update: 2020-02-16 05:00 GMT

కేంద్రంలో బీజేపీకి జగన్ ఇపుడు కొత్త మిత్రుడు అవుతున్నారు. ఆ మాటకు వస్తే జగన్ ఎప్పటినుంచో తెర వెనక మిత్రుడు అని రాజకీయం తెలిసిన వారు అంటారు. అది రికార్డ్ కాదు కాబట్టి ఇపుడు కేంద్ర మంత్రివర్గంలో జగన్ తన ఎంపీలను చేరిస్తే కచ్చితంగా బాబు బాటలో నడిచినట్లే. ఇక్కడ తేడా ఏంటి అంటే బాబు తొలి ఏడాది నుంచే బీజేపీ మంత్రివర్గంలో చేరితే జగన్ రెండో ఏడాది చేరుతున్నారు. అయిదేళ్ళూ ఈ బంధం నిలబడితే జగన్ మంత్రులు కూడా నాలుగేళ్ళ పాటు అధికారం అనుభవిస్తారు. సరే కేంద్రంతో పొత్తు పెట్టుకుని బాబు ఏం బావుకున్నారో అంతా చూశారు, ఇపుడు జగన్ రాజకీయంగా ఏం లాభపడతారు అన్నదే చర్చ.

ఇప్పటికి ఇదే రైట్….

జగన్ కనుక ఎన్డీయేలో చేరితే రాంగ్ డెసిషన్ అని లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ గురించి ఆలోచించే వారు అంటారు. కానీ ఇప్పటికైతే జగన్ చేసింది కరెక్ట్ అనేవారూ ఉన్నారు. ఎందుకంటే జగన్ ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. చేతిలో అధికారం ఉంది కానీ ఖజానా చూస్తే ఖాళీ. ఇక ఏపీలో అన్ని పార్టీలు వెలివేసి మరీ జగన్ ని ఓ ఆటాడుకుంటున్నాయి. మరో వైపు రెండు సీట్లలో తాను ఓడి, తన పార్టీ దారుణంగా చిత్తు అయినా కూడా పవన్ కళ్యాణ్ జగన్ని సవాల్ చేసే దాకా వచ్చారంటే బీజేపీ అండ చూసుకునే. మరో వైపు చంద్రబాబు సైతం కమలానికి కన్ను గీటుతున్నారు. దీంతో వీరిద్దరినీ ఒక్క దెబ్బతో చిత్తు చేయాలంటే బీజేపీతో జగన్ చేతులు కలపడమే బెటర్ అన్నది పార్టీలో అధికుల మాటగా ఉంది.

అది బిగ్ రిలీఫ్…..

ఇక జగన్ ని మరో వైపు సీబీఐ కేసులు వెంటాడుతున్నాయి. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సివస్తోంది. సీబీఐ అధికారులు జగన్ ని పరుషంగా నిందిస్తూ పిటిషన్లు వేస్తున్నారు. రాజకీయంగా జగన్ కి ఇది పెద్ద ఇబ్బందిగా ఉంది. కేంద్రంతో బయట నుంచి ఎంత సఖ్యతగా ఉన్నా సీబీఐ విషయంలో వారు ఏమీ చేయలేకపోతున్నారు. దాంతో అక్కడ కూడా అధికారం పంచుకుంటే బిగ్ రిలీఫ్ వస్తుందని జగన్ భావిస్తున్నారు. జగన్ విషయంలో సీబీఐ ఇకపై దూకుడుగా పిటిషన్లు దాఖలు చేయదు. ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించవచ్చేమో కూడా.

అల్లరైపోతారా…?

అలాగే మూడు కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. రాజకీయంగా ఇప్పటికైతే బలంగా ఉంటారు కానీ భవిష్యత్తులో జగన్ కి చిక్కులేనని విశ్లేషిస్తే వస్తున్న అంచనా ఎందుకంటే బీజేపీ గాలి ఇప్పటికే బాగా తగ్గిపోయింది. మోడీ గ్లామర్ ఓ వైపు మసకబారుతోంది. 2024 నాటికి బీజేపీకి కనీస మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు, 200 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడం కష్టమే. మరో వైపు ప్రాంతీయ పార్టీలు ఇంకా బలపడతాయి. మూడవ ఫ్రంట్ కి అవకాశం ఉంది. కాంగ్రెస్ సైతం అందులో చేరిపోవచ్చు. అపుడు జగన్ బీజేపీతో ఉంటే చిక్కుల్లో పడతారు.

మైనారిటీలు దూరమా?

ఇక పౌర సత్వ బిల్లు నేపధ్యంలో బీజేపీ మీద మైనారిటీలు గుర్రుమీదున్నారు. జగన్ పార్టీకి వారే పెద్ద ఓటు బ్యాంక్. మరి బీజేపీతో అంటకాగితే వారు దూరమవడం ఖాయం. మరో వైపు ఏపీకి బీజేపీ పెద్దగా నిధులు ఇవ్వకపోయినా, అభివృధ్ధి జరగకపోయినా ఆ ఎఫెక్ట్ నేరుగా జగన్ మీద పడుతుంది. అంటే జగన్ బాబు పొజిషన్లోకి వస్తారన్న మాట. బాబుని బీజేపీ ఇబ్బందులు పెట్టకపోతే మాత్రం ఆయన జగన్ మాదిరిగా జనంలో రెచ్చిపోతారు. పవన్ లాంటి వారు కూడా తోడు అయితే ఏపీలో ఫలితాలు కూడా రివర్స్ అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. అవన్నీ మరో నాలుగేళ్ళ తరువాత రాజకీయ లెక్కలు. అంతవరకూ బండిని లాగాలంటే మాత్రం జగన్ ఇపుడు చేస్తున్నదే కరెక్ట్ అన్న వారూ ఉన్నారు. మొత్తానికి బాబు బాటలోనే జగన్ నడుస్తున్నారా అన్న చర్చ మాత్రం జరుగుతోంది.

Tags:    

Similar News