టూర్ బాగానే కలిసొచ్చిందట

జగన్, మోదీ బంధం అలాంటిలాంటిది కాదు అని ఢిల్లీ సర్కిళ్ళలో ఒకటే గోల. ఇద్దరిదీ విడదీయని తీయని బంధమని కూడా అంటున్నారు. మోడీ జగన్ ని హత్తుకుంటే [more]

Update: 2020-02-14 05:00 GMT

జగన్, మోదీ బంధం అలాంటిలాంటిది కాదు అని ఢిల్లీ సర్కిళ్ళలో ఒకటే గోల. ఇద్దరిదీ విడదీయని తీయని బంధమని కూడా అంటున్నారు. మోడీ జగన్ ని హత్తుకుంటే ఆయనలో తండ్రి వాత్సల్యాన్ని జగన్ చూస్తున్నాడుట. జగన్ పదేళ్ళ రాజకీయ జీవితంలో కేంద్రంలో ఎపుడూ కయ్యాలే మరి. ఇపుడు ప్రధాని స్థాయి వ్యక్తి జగన్ ని చేరదీయడమే కాకుండా భవిష్యత్తు బాగా ఉన్న నాయకుడుగా గుర్తిస్తున్నాడుట. అందుకే జగన్ ని తన నివాసానికి పిలిపించుకుని మరీ గంటన్నరకు పైగా మాటా మంతీ జరిపారు. నేనున్నా జగన్ అంటూ భరోసా ఇచ్చిన మరీ ఆంధ్రా విమానం ఎక్కించి పంపారు.

పొత్తులేనా?

ఏపీ విషయంలో ఇన్నాళ్ళకు బీజేపీకి ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. సొంతంగా అధికారంలోకి ఎప్పటికీ రాలేమని కచ్చితంగా బోధపడిందని, ఢిల్లీ ఎన్నికల తరువాత అది ఇంకా అర్ధమైందని అంటున్నారు. ఇక ఒకనాటి నేస్తం చంద్రబాబుతో జట్టు కట్టి అసలుకే ఎసరు తెచ్చుకోవడం బీజేపీకి అసలు ఇష్టం లేదుట. మరో వైపు జనసేన పార్టీయో కాదో కూడా తెలియని పరిస్థితి. అందుకే బలమైన నేతగా ఉన్న జగన్ నే మచ్చిక చేసుకుని దారికి తెచ్చుకుంటే ఏపీ కూడా పగవాడి రాష్ట్రం కాదు, మనవాడిదేనన్న భావన మిగులుతుందని బీజేపీ భావిస్తోందట. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీలో వైసీపీతోనే బీజేపీ పొత్తులు పెట్టుకోవాలనుకుంటోందట. దాని మీదనే మోడీ, జగన్ ల మధ్యన చర్చలు మంచి వాతావరణంలో కొనసాగాయని అంటున్నారు.

దండీగా నిధులు…..

బీజేపీతో జట్టు కడితే ఏపీలో వైసీపీ దశ రాజకీయంగా ఎలా ఉన్నా ప్రభుత్వ పరంగా గొప్పగా వెలిగిపోవడం ఖాయమని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయలేమని చెబుతున్న బీజేపీ పెద్దాయన దానికంటే ఎక్కువగా నిధులు ఏపీకి ఇస్తామని అంటున్నారుట. యాభై వేల కోట్ల రూపాయలు నిధులను ఏపీకి ప్రత్యేక గ్రాంటుగా ఇచ్చేందుకు ప్రధాని గట్టి హామీ ఇచ్చారని కూడా చెబుతున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పిన మోడీ విశాఖ రాజధాని అభివృధ్ధికి అయిదు వేల కోట్ల రూపాయలను స్పెషల్ ప్యాకేజిగా ఇచ్చేందుకు కూడా సిధ్ధమైనట్లుగా చెబుతున్నారు.

నదుల అనుసంధానం కోసం….

ఇక నదుల అనుసంధానం కోసం కూడా రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నిధులతో దక్షిణాదిన పెద్ద ఎత్తున నదులను కలిపే కార్యక్రమం చేపట్టాలని కూడా ప్రధాని డిసైడ్ అయ్యారట. ఆ నిధులను ఏపీ చేతికే ఇచ్చి ఖర్చు పెట్టించేలా చూడాలని, జగన్ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని కూడా కోరినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి నిధుల వరద పారించేందుకు ప్రధాని జగన్ కి భారీ హామీ ఇచ్చారని తెలుస్తోంది.

మోదీ ప్రశంసలు….

అదే సమయంలో జగన్ ఏపీలో అమలు చేస్తున్న మద్య నిషేధం మీద కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారని అంటున్నారు. నిధుల కొరత ఉన్నా చూసుకోకుండా ప్రజల ఆరోగ్యం కోసం జగన్ చేపట్టిన దశలవారీ మద్య నిషేధంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారని చెబుతున్నారు. అలాగే ఏపీ ప్రజల కోసం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసున్న ప్రధాని స్వార్ధ రాజకీయాల కంటే కూడా జనం కోసం పరితపిస్తున్న యువ నేతగా జగన్ని గుర్తించారని చెబుతున్నారు. జగన్ కి ఎంతో భవిష్యత్తు ఉందని, పైగా ముక్కుసూటితనం, జనం పట్ల నిబద్ధత వంటివి ప్రధానిని ఆకట్టుకున్నాయని అంటున్నారు.

భావోద్వేగ బంధంగానే….

బాబులా మాట మార్చకపోవడం, ప్రత్యేకించి కాంగ్రెస్ అధినాయకత్వం పట్ల బీజేపీ మాదిరిగానే తీవ్ర వ్యతిరేకత ఉండడమే జగన్ ని మోడీ సన్నిహితున్ని చేశాయని అంటున్నారు. ఇక జగన్ సైతం తండ్రిని కోల్పోయిన తన పట్ల పుత్ర వాత్సల్యం చూపిస్తూ దేశ పెద్దగా ఉంటూ తనకు కూడా మార్గదర్శనం చేస్తున్న మోడీ పట్ల అభిమానం ప్రత్యేకంగా ఉందని చెబుతున్నారు. ఈ ఇద్దరు నాయకుల భేటీని సాధారణ రాజకీయాలతో పాటు అంతకంటే ఎక్కువ బంధంగానే చూడాలని అంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏపీ రాజకీయాలో కొత్త అంకం కూడా మొదలవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News