సాహసమే… సాధ్యమవుతుందా?

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నిక‌ల ప్రక్రియ‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. న‌చ్చిన వ్యక్తితో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే అధికారం, న‌చ్చని వ్యక్తిని ప్రభుత్వం నుంచి కూల్చే [more]

Update: 2020-02-20 12:30 GMT

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నిక‌ల ప్రక్రియ‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. న‌చ్చిన వ్యక్తితో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే అధికారం, న‌చ్చని వ్యక్తిని ప్రభుత్వం నుంచి కూల్చే అధికారం కూడా ప్రజ‌ల‌కే ఉంది. అయితే, ఈ ఎన్నిక‌లు రాను రాను.. నాక‌ది – నీకిది చందంగా మారిపోయాయి. డ‌బ్బు, మ‌ద్యం, గిఫ్టుల తో ఎన్నిక‌ల‌ను నాయ‌కులు ప్రభావితం చేస్తున్నారు. ఇక‌, ఇవి ఇవ్వక‌పోతే.. ఓట్లు వేస్తారో లేదో అనే సందేహాలు ప్రజ‌ల నుంచి వ్యక్తమ‌వుతున్నాయి. దీంతో అది సార్వత్రిక ఎన్నిక అయినా.. స్థానిక ఎన్నిక అయినా కూడా ఓటుకు ఇంత అని ఇచ్చుకోక త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. అయితే, ఈ విష‌యంలో ఎప్పటిక‌ప్పుడు ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తూనే ఉన్నారు.

నియంత్రించేందుకు….

కానీ, య‌ధారాజా.. త‌థా ప్రజా అన్నట్టుగా ఎన్నిక‌ల్లో ముడుపుల బాగోతం సాగుతూనే ఉంది. అయితే, ఇప్పు డు ఇలాంటి ప‌రిస్థితికి ముకుతాడు వేయాల‌ని ప్రస్తుత ప్రభుత్వం సంక‌ల్పం చెప్పుకోవ‌డం నిజానికి ఓ సాహసోపేత నిర్ణయం. త్వర‌లోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు తెర‌దీస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున ఎన్నిక‌ల్లో ప్రజ‌ల‌కు నిధులు, మ‌ద్యం పంచేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే, ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న జ‌గ‌న్‌ స్థానిక ఎన్నికల్లో ధనం, మద్య ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రణాళిక‌లు రూపొందించేలా అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక ల్లో సర్పంచ్‌ ఎన్నికకు రూ. కోటి ఖ‌ర్చయిన‌ట్టు తెలుస్తోంది.

తర్వాత తెలిసినా….?

ఈ విష‌యాన్ని ప‌రిశీలించిన జ‌గ‌న్‌ ఇలాంటి ఖ‌ర్చుల‌ను నియంత్రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని పేర్కొన‌డం నిజంగా ప్రభుత్వం దూర‌దృష్టికి నిద‌ర్శనంగా చెప్పాలి. అంతేకాదు, ఎన్నికల్లో పోటీ చేశాక ఎన్నో కుటుంబాలు ఆస్తులను పోగొట్టుకుని.. అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల్లో ధన ప్రవాహాన్ని.. మద్యం ఏరులై పారడాన్ని నివారించాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఒకవేళ ఎన్నికల్లో గెలిచాక కూడా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించాడని తెలిస్తే తక్షణమే ఆ ఎన్నికను రద్దు చేసేలా బలమైన చట్టం తీసుకురావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

అంత ఈజీ కాదని….

అయితే, ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇలాంటి విష‌యాలు సాకారం కావడం, ప్రజ‌ల‌ను మ‌ళ్లించ‌డం, అభ్యర్థుల‌ను నిలువ‌రించ‌డం అనేవి అంత ఈజీ విష‌యాలు కావ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ఇలాంటి ప్రయోగాలు చాలా రాష్ట్రాల్లో జ‌రిగాయ‌ని, అయితే, ఒక్క కేర‌ళ‌లో త‌ప్ప ఎక్కడా స‌క్సెస్ కాలేద‌ని పేర్కొంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ కేర‌ళ‌లో అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కొంత‌మేర‌కు ఉపయోగ‌ప‌డుతుందేమోన‌ని అంటున్నారు.

Tags:    

Similar News