ఒక్క ముక్క చెబితే ఏం పోయింది?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజంగా తనంతట తాను సమస్యలను కొని తెచ్చిపెట్టుకున్నారనిపిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఆరోపణలు ఎదురైనా, విమర్శలు వినిపించినా ఒక్క ముక్క మాట్లాడకపోవడంతో [more]

Update: 2020-02-16 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజంగా తనంతట తాను సమస్యలను కొని తెచ్చిపెట్టుకున్నారనిపిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఆరోపణలు ఎదురైనా, విమర్శలు వినిపించినా ఒక్క ముక్క మాట్లాడకపోవడంతో సమస్య మరింత పెరుగుతుంది. కేవలం మంత్రులు, అధికార ప్రతినిధులు మాత్రమే సమాధానమిస్తున్నారు. దానికి ప్రజలు, విపక్షాలు సయితం సంతృప్తి పడటం లేదు సరికదా మరింతగా విమర్శల జోరు పెంచుతున్నారు.

కియా పైనా…..

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో వివరణ ఇవ్వడం తప్ప ఏ సమస్య గురించి బయట ప్రస్తావించడం లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న సమస్య వచ్చినా వెంటనే మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చేవారు. అయితే జగన్ కు పెద్ద సమస్య వచ్చినా పెదవి విప్పడం లేదు. కియా పరిశ్రమ తరలిపోతుందని పెద్దయెత్తున ప్రచారం నడిచినా మంత్రులు మాత్రమే స్పందించారు. అదే జగన్ నేరుగా చెప్పి ఉంటే విపక్షాల నోటికి తాళం పడేది.

రాజధాని రైతుల విషయంలో….

ఇక మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో జగన్ ప్రకటన చేశారు. తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్దయెత్తున నిరనసలు జరుగుతున్నాయి. 58 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా జగన్ దీనిపై స్పందించలేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో వచ్చిన కొందరు రాజధాని రైతులను తమ వద్దకు పిలిపించుకుని మాట్లాడారు తప్పించి నేరుగా అడ్రెస్ చేయలేదు. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు జగన్ తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారు.

ఢిల్లీ పర్యటనపై కూడా…..

దీంతోపాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో కలసి వచ్చిన జగన్ ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సహజంగా ఢిల్లీ మీడియాతో మాట్లాడి తనకు అనుకూలంగానే మలచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్ ఏమీ చెప్పలేదు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. జగన్ కేనుల మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లారని ప్రచారాన్ని ప్రారంభించింది. ఇలా జగన్ తనంతట తాను సమస్యలను పెద్దవి చేసుకుంటున్నారన్న విమర్శలయితే గట్టిగానే విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే దానికి అక్కడితోనే ఫుల్ స్టాప్ పడుతుందంటున్నారు.

Tags:    

Similar News