జగన్ అసలు స్ట్రాటజీ అదేనట

జగన్ మనసులో ఇపుడు విశాఖ బలంగా ఉంది. ఆయన మనిషిగా అమరావతిలో పాలన చేస్తున్నా ఎపుడెపుడు విశాఖ వెళ్దామా అన్న ఆలోచనల్లోనే గడుపుతున్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్ [more]

Update: 2020-02-13 08:00 GMT

జగన్ మనసులో ఇపుడు విశాఖ బలంగా ఉంది. ఆయన మనిషిగా అమరావతిలో పాలన చేస్తున్నా ఎపుడెపుడు విశాఖ వెళ్దామా అన్న ఆలోచనల్లోనే గడుపుతున్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాలకు ముందే విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేయాలని జగన్ గట్టిగా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి వైసీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు తరలింపుపైన ఎంత గందరగోళం జరుగుతున్నా కూడా జగన్ లెక్కచేయడంలేదు. తాను అనుకున్న మూడు రాజధానుల కాన్సెప్ట్ కి ఆయన కట్టుబడి ఉన్నారు. అంతే కాదు, ఈ ప్రక్రియను ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు.

ఓ పని అయిందా?

ఇక మూడు రాజధానుల విషయంలో కేంద్రం ఏమంటుంది, అడ్డుకుంటుందా అన్న సంశయాలు కూడా ఇపుడు తీరాయి. పార్లమెంట్ లో కేంద్రం ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా పక్కా క్లారిటీగా తేల్చేసింది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీని కలసి వచ్చారు. తాను ఏ పరిస్థితుల్లో మూడు రాజధానులను ప్రతిపాదించానో కూడా పెద్దాయనకు వివరించారు. ఓ విధంగా ఆ మొక్కుబడి తంతు కూడా జగన్ పూర్తి చేస్తున్నారన్నమాట. ఇక తరలింపే తరువాయి అంటున్నారు.

అలా సంకేతాలు….

ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో జగన్ మంత్రులకు రాజధాని విశాఖకు తరలింపుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ కి ముందే విశాఖకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన అన్నట్లుగా భోగట్టా. మార్చి 25న ఉగాది ఉంది. తెలుగు వారికి కొత్త సంవత్సరాది పండుగ అది. ఆ రోజున మంచి ముహూర్తం అని జగన్ భావిస్తున్నారుట. అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీని విశాఖలోనే చేపట్టాలన్నది జగన్ ఆలోచన. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా జగన్ ఆహ్వానించారు. మోడీ కనుక వస్తే మూడు రాజధానులకు ఓ విధంగా రాజముద్ర మరింత గట్టిగా పడుతుంది.

అపుడే బడ్జెట్….

ఇక విశాఖలో పరిపాలన రాజధాని తరలింపు ముందు ఉంటుందిట. అది ఉగాదితో మొదలవుతుందిట. ఆ తరువాత‌ అంటే ఏప్రిల్ మొదటి వారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు అమరావతి అసెంబ్లీ వేదికగా నిర్వహిస్తారుట. అలా చేయడం ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేసినా అమరావతిలో అసెంబ్లీ ఉంటుందని, అలా రాజధాని ఎక్కడికీ పోలేదన్న సందేశాన్ని అక్కడి ప్రజలకు ఇవ్వాలన్నదే జగన్ ముఖ్య ఉద్దెశ్యంగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎంతెంత దూరం విశాఖ అంటూ జగన్ రోజులు లెక్కబెడుతున్నట్లుగానే అనిపిస్తోంది మరి.

Tags:    

Similar News