ఆ ఇద్దరి ప్లేస్ లో ఈ ఇద్దరట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. శాసనమండలి దాదాపు రద్దు కావడంతో ఇద్దరు మంత్రి పదవులు పోతున్నాయి. వారి స్థానంలో జగన్ ఎవరు కేబినెట్ [more]

Update: 2020-02-15 05:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. శాసనమండలి దాదాపు రద్దు కావడంతో ఇద్దరు మంత్రి పదవులు పోతున్నాయి. వారి స్థానంలో జగన్ ఎవరు కేబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. శాసనమండలి రద్దుతో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తమ పదవులను కోల్పోతున్నారు. ఎమ్మెల్సీ పదవులు కూడా పోతుండటంతో వారు పార్టీ పదవులకే పరిమితం కావాల్సి ఉంటుంది.

రెండున్నరేళ్ల వరకూ…..

అయితే రెండున్నరేళ్ల వరకూ మంత్రివర్గాన్ని విస్తరించనని చెప్పిన జగన్ ఈ ఇద్దరి రాజీనామా తర్వాత విస్తరించాల్సి ఉంటుంది. కీలకమైన రెవెన్యూ శాఖను పిల్లి సుభాష్ చంద్రబోస్ చూస్తున్నారు. అంతే కాకుండా వెనకబడినవర్గాలు, పశుసంవర్థక శాఖలను మోపిదేవి వెంకటరమణ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి చూస్తున్న మార్కెటింగ్ శాఖను మంత్రి కన్నబాబుకు జగన్ అప్పగించారు. అయితే రెవెన్యూ శాఖను మరో మంత్రికి అప్పగించే అవకాశం లేదు. ఖచ్చితంగా విస్తరణ జరిపి కొత్త వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

అదే సామాజికవర్గానికి…..

ఈ నేపథ్యంలో వారిద్దరి స్థానంలో జగన్ ఎవరిని తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా తమకు అన్యాయం జరిగిందని రెడ్డి సామాజికవర్గం అసంతృప్తిలో ఉంది. ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే వీరి స్థానంలో రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ తీసుకోరు. వారిద్దరి సామాజికవర్గానికి చెందిన వారినే తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే జగన్ వద్దకు కొందరు ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనలను తెచ్చినా నవ్వి ఊరుకున్నారట.

ఆ ఇద్దరికేనని…..

అయితే జగన్ మనసులో మాత్రం ఇద్దరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరికి అవే శాఖలు అప్పగించకపోయినా శాఖలను మార్పిడి చేసి ఈ ఇద్దరినీ తీసుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ సామాజికవర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేరు వినపడుతుంది. జిల్లా లోనూ బోసు స్థానంలో ఆయనకు అవకాశం కల్పిస్తే ముగ్గురికి ఇచ్చినట్లవుతుంది.

ఈక్వేషన్లు చూసిన తర్వాతే…..

ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్ పేరు జగన్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మోపిదేవి స్థానంలో జోగి రమేష్ ను నియమిస్తే గుంటూరు జిల్లా నుంచి ఒకరే అవుతారు. ఈ ఈక్వేషన్లు చూసిన తర్వాతనే జగన్ ఒక నిర్ణయానికి వస్తారంటున్నారు. మొత్తం మీద పార్టీలో అయితే సతీష్, రమేష్ పేర్లు మాత్రం బాగా విన్పిస్తున్నాయి. మరి జగన్ చూపు ఎవరిపైన పడుతుందో చూడాలి.

Tags:    

Similar News