జగన్.. లక్కీ ఫెలో

దేశంలో ఇపుడు జాతీయ వాదం అన్నది ఒక చర్చగా ఉంది. అది బీజేపీ తెచ్చిన చర్చ. తనకు అనుకూలంగా దేశంలోని ఎన్నికలను మలచుకోవడానికి ఒకే దేశం, ఒకే [more]

Update: 2020-02-12 08:00 GMT

దేశంలో ఇపుడు జాతీయ వాదం అన్నది ఒక చర్చగా ఉంది. అది బీజేపీ తెచ్చిన చర్చ. తనకు అనుకూలంగా దేశంలోని ఎన్నికలను మలచుకోవడానికి ఒకే దేశం, ఒకే జాతి, ఒకేసారి ఎన్నికలు ఇలా బీజేపీ నయా జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చింది. అయితే అది ఇపుడు దారుణంగా ఫెయిల్ అవుతోందని అంటున్నారు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీకి ఓటమి తప్పడం లేదు. అది హర్యానా అయినా, మహరాష్ట్ర అయినా, జార్ఖండ్ అయినా, చివరికి డిల్లీ అయినా బీజేపీని ఓడిస్తోంది ప్రాంతీయ వాదమే. ఇపుడు ఈ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

జాగ్రత్తగా చూసి….

దేశంలో బీజేపీకి కాంగ్రెస్ పోటీ అని అనుకుంటారు, కానీ కాంగ్రెస్ చాలా చోట్ల ఓడి పెద్ద ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఇపుడు కమలాన్ని నిలువరిస్తున్నాయి. తెలంగాణాలో తీసుకుంటే అక్కడ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలని మట్టి కరిపించి టీఆఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేస్తోంది. ఇక ఏపీ విషయం తీసుకుంటే అధికార ప్రతిపక్షాలుగా వైసీపీ, టీడీపీ మాత్రమే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నోటాతోనే పోటీ పడుతున్నాయి.

దూకుడు తగ్గిస్తే…..

నిజానికి వరసగా అనేక రాష్టాలో బీజేపీ ఓటమిపాలు కావడం జగన్ కి కొత్త బలమేనని అంటున్నారు. అక్కడ కనుక కాషాయం కాంతులు చిమ్మితే ఏపీ మీద నేరుగా రాజకీయ దాడి చేసే పరిస్థితి ఉండేదని కూడా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బీజేపీ ఇలా బలహీనపడడం వైసీపీకి, జగన్ కి కూడా మరో విధంగా రాజకీయ బలమేనని అంటున్నారు. దీన్ని గమనంలోకి తీసుకుని దూకుడు తగ్గించుకుంటే జగన్ కి ఏపీలో తిరుగు ఉండదని అంతా సూచిస్తున్నారు.

తగ్గాలిగా…?

రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకుంటే అది అయిదు కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. జగన్ కి ఇపుడు ఏపీ శాసనసభలో మందబలం ఉంది, బ్రేకులేస్తున్న శాసనమండలిని ఆయన రద్దు చేసే పనిలో ఉన్నారు. మరో వైపు కేంద్రం నుంచి కూడా రానున్న రోజుల్లో రాజకీయ వత్తిళ్ళు ఉండే అవకాశాలు అయితే లేవు. ఓ విధంగా జగన్ రాజకీయ అదృష్టవంతుడుగా చెప్పాలి. బాబు సీఎం గా ఉన్న టైంలో హస్తినలో బీజేపీ బాగా బలంగా కనిపించేది, పైగా నాడు పొత్తులు కూడా బాబు కాళ్ళకు బంధం వేసేవి. జగన్ విషయం అలా కాదు, ఆయన స్వేచ్చా జీవిగా ఉన్నారు. ఇపుడే జగన్ వివేచనతో ఆలోచించాలి. తనకు అడ్డూ అదుపూ లేదని వేగంగా వెళ్తే ఇబ్బందుల్లో పడతారు. నిర్ణయాలు తీసుకునేటపుడే కూలంకషంగా చర్చలు జరిపితే మంచిది. అది ఆయనకే కాదు, పార్టీకి, ఏపీకి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇపుడు దేశంలో, రాష్ట్రంలో కూడా రాజకీయం జగన్ కి పూర్తి అనుకూలంగా ఉంది. దాన్ని జగన్ అనుకూలంగా మార్చుకుంటే సుదీర్ఘకాలం పాటు పీఠం ఆయనదే మరి.

Tags:    

Similar News