ఢిల్లీ టార్గెట్ అదే

మూడు నెలల విరామం తర్వాత జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. అభివృద్ధి విషయాలను పక్కన పెడితే ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో నిజంగా సంచలనమే [more]

Update: 2020-02-12 05:00 GMT

మూడు నెలల విరామం తర్వాత జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. అభివృద్ధి విషయాలను పక్కన పెడితే ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో నిజంగా సంచలనమే కానుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తొలిసారి జగన్ మోదీని కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కల్యాణ్ విషయం ఈ భేటీలో ప్రస్తావన రాకపోయినా మానసికంగా ఈ కలయిక పార్టీ క్యాడర్ ను దెబ్బతీస్తుందంటున్నారు.

చాలా గ్యాప్ తర్వాత…..

ఇక మూడు నెలల నుంచి ప్రయత్నించినా దొరకని ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో వెంటనే దొరికింది. బీజేపీ వరస పరాజయాలతో తమకు మద్దతుగా ఉన్న వారిని కూడా వదులుకోకూడదని నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే వెంటనే జగన్ కు మోదీ, షాల అపాయింట్ మెంట్ దొరికింది. ఈ భేటీతో ఆర్థికంగా రాష్ట్రానికి ఎంత లాభం? అన్నది పక్కన పెడితే రాజకీయంగా జగన్ కు ప్రయోజనమేనన్నది అందరికీ తెలసిందే.

మూడు రాజధానుల అంశం…..

ప్రధానంగా మూడు రాజధానుల అంశం, దాని ఆవశ్యకతను ప్రధాని మోదీకి జగన్ వివరించ నున్నారు. అంతేకాకుండా అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయాన్ని కూడా తెలపనున్నారు. దీనిపై ఇప్పటికే సీఐడీ దర్యాప్తు సాగుతుందని, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగితే బాగుంటుందని ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అమరావతి నిర్మాణం వల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయేదీ జగన్ ప్రధానికి తెలపనున్నారు. ఇందుకోసం సీఎంవో అధికారులు ప్రత్యేకంగా నోట్ రూపొందించినట్లు తెలుస్తోంది.

హైకోర్టు తరలింపుపై….

విశాఖనే రాజధానిగా ఎందుకు చేయాలనుకుంటుంది కూడా జగన్ వివరించనున్నారు. ఇక శాసనమండలి రద్దు అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని కోరే అవకాశముందని తెలుస్తోంది. ఇక కర్నూలుకు హైకోర్టును తరలించాలంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని విన్పిస్తున్న వాదనలను కూడా ప్రధానికి తెలపనున్నారు. దీంతో పాటు రెవెన్యూ లోటు బడ్జెట్ పై కూడా చర్చించనున్నారు. మొత్తం మీద మూడు నెలల గ్యాప్ తర్వాత ప్రధాని మోదీతో భేటీ తర్వాత అనూహ్య పరిణామాలు ఏపీలో చోటు చేసుకునే అవకాశముందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News