ఆశలు వదిలేసుకున్నట్లే ఉంది

జగన్ విషయానికి వస్తే ఆయన వాస్తవ‌వాదిగా చెబుతారు. ఆయన తాను చేయగలిగింది ఏదో చేయలేనిది ఏదో కచ్చితమైన అంచనాతో ఉంటారని అంటారు. అది రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన [more]

Update: 2020-02-14 02:00 GMT

జగన్ విషయానికి వస్తే ఆయన వాస్తవ‌వాదిగా చెబుతారు. ఆయన తాను చేయగలిగింది ఏదో చేయలేనిది ఏదో కచ్చితమైన అంచనాతో ఉంటారని అంటారు. అది రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన లక్షణం. రాజకీయ నాయకుడు తాను పూర్తిగా ఆత్మవంచనతో ఉండి జనాలను మభ్యపెడుతూంటేనే రాజకీయం సజావుగా సాగేది. కానీ కుండబద్దలు కొట్టినట్లుగా ఉన్న విషయం చెబితే జనాలకు చేదుగానే ఉంటుంది. ఆది నిష్టూరం బెటర్ అన్నది జనాలకు తెలిసినా ఒప్పుకునేందుకు మనసు అంగీకరించదు. అందువల్లనే జగన్ చాలా సార్లు తన నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు.

మోడీ అంతేనా..?

ఢిల్లీ వెళ్ళినపుడుల్లా ప్రధాని మోడీ జగన్ ని బాగానే చూసుకుంటున్నారు. గాఢాలింగనాలు, మర్యాదలు బాగానే జరుగుతున్నాయి. అంతకు మించి పైసా సాయం మాత్రం ఏపీకి అందడం లేదన్నది తొమ్మిది నెలల వైసీపీ పాలనలోనే కచ్చితంగా తెలుస్తున్న విషయం. జగన్ ఎన్నో మార్లు ఢిల్లీ వెళ్ళి ఏపీని ఆదుకోవాలని విన్నపాలు చేసి వచ్చారు. సహజంగా ముక్కుసూటిగా ఉండే జగన్ ఏపీ ప్రజల తరఫున అడగాల్సింది మొహమాటం లేకుండానే అడుగుతున్నారు. అయితే చేస్తాం, చూస్తాం అన్న ఢిల్లీ రాజకీయం మాత్రం జగన్ కి అర్ధం కావడంలేదు. దాంతో ఆయన మోడీ సర్కార్ నుంచి ఏమీ రాదన్న ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశారని అంటున్నారు.

చెప్పేశారుగా….

ఈ మధ్యన విజయవాడలో జరిగిన ఓ సదస్సులో జగన్ తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. మూడు రాజధానుల గురించి తాను ఎందుకు ప్రతిపాదించానో ఆయన చెప్పుకున్నారు. అమరావతి రాజధాని అంటే లక్షల కోట్ల వ్యవహారం. ఏపీ సర్కార్ వద్ద అంత డబ్బులు లేవు ఖర్చు పెట్టాలంటే అయిదేళ్ళలో అయిదు వేల కోట్లకు మించి ఏపీ ప్రభుత్వానికి సాధ్యపడదు, ఈ నేపధ్యంలో కేంద్ర సాయం చూసుకుంటే ఆరేళ్ళలో రాజధాని కోసం అచ్చంగా 1500 వందల కోట్లే వచ్చాయి. కేంద్రం ఇంతకంటే ఆర్ధిక సాయం చేయదు అని జగన్ ఆ సదస్సులోనే చెప్పేశారు. ఆ విధంగా కేంద్రం ఏపీకి ఏమీ చేయదని కూడా జగన్ భావిస్తున్నారన్నది అర్ధమైపోతోంది.

పోలవరం ఎలా?

అమరావతి రాజధాని విషయంలో కేంద్రం పైసా విదల్చదని చంద్రబాబు కంటే పక్కా క్లారిటీ జగన్ కి ఉంది. దాంతో ఆయన మూడు రాజధానుల పరిష్కారం కనుగొన్నారు. అయితే పోలవరం విషయంలో మాత్రం జగన్ కేంద్రం మీద ఆధారపడకతప్పదు. అయితే అక్కడా మెలిక ఉంది. పునరావాసం ఖర్చు ఏపీ సర్కార్ భరించాలని కేంద్రం అంటోంది. నిజానికి విభజన చట్టంలో మొత్తం ఖర్చు కేంద్రానిదే అని రాసుంది. కానీ బాబు పోలవరం నిర్మాణం ఏపీ సర్కార్ చేతుల్లోకి తీసుకోవడంతో జాతీయ ప్రాజెక్ట్ నిధులు కూడా ఇపుడు ఇబ్బందులో పడ్డాయి.

అప్పులే దిక్కు….

ఇక నాడు బాబు అయినా నేడు జగన్ అయినా అప్పులతోనే పాలన చేస్తున్నారు. అయిదేళ్ల పాలన ముగిసేనాటికి బాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ ఇప్పటికే 40 వేల‌ కోట్లు అప్పుచేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక తాజాగా ఆసియన్ అభివృధ్ధి బ్యాంక్ నుంచి 21 వేల కోట్లు జగన్ అప్పు అడుగుతున్నారు. మరి మరో నాలుగేళ్ళ పాలనలో ఎన్నో వేల కోట్లు అప్పులు ఏపీ చేయాల్సివుంటుందట మరి. ఎందుకంటే కేంద్రం సాయం చేయదు, పదే పదే అడగడం జగన్ కి ఇష్టం ఉండదు కాబట్టి ఏపీ అంటే అప్పుల కధేనని చెప్పకతప్పదేమో.

Tags:    

Similar News