జగన్ కి దెబ్బకొట్టడానికేనా?

ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అంటే చిందరవందరగా, గందరగోళంగా అని ఒక్క ముక్కలో కవితాత్మకంగా చెప్పాల్సిఉంటుంది. ఆరేళ్ళ క్రితం దాదాపు లక్ష కోట్ల అప్పులతో విడిపోయిన [more]

Update: 2020-02-13 05:00 GMT

ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అంటే చిందరవందరగా, గందరగోళంగా అని ఒక్క ముక్కలో కవితాత్మకంగా చెప్పాల్సిఉంటుంది. ఆరేళ్ళ క్రితం దాదాపు లక్ష కోట్ల అప్పులతో విడిపోయిన ఏపీ ఇపుడు మరింతగా కుంగిపోయింది. ఇక సరైన అభివృధ్ధి లేదు, హైదరాబాద్ లా మొత్తం రాష్ట్రాన్ని పోషించే మహానగరం లేదు, పారిశ్రామిక కాంతులు లేవు. పైగా రాజకీయంగా కుమ్ములాటలు, భీకరమైన సమరాలు, ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఒకరి కన్ను ఒకరు పొడుచుకుంటూ అధికార ప్రతిపక్షాలు చివరికి ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న వైనాలు. అలాగే కక్షలు, కార్పణ్యాల ఏపీ రాజకీయ పార్టీల, నేతల కధలు ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. ఈ నేపధ్యంలో పొరుగున ఉన్న తెలంగాణా సంపన్న రాష్ట్రంగా ముందుకు దూసుకుపోతోంది.

దూకుడుగా….

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా ఓ వైపు ఏపీలో రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా తెలంగాణా మలచుకుంటోంది. ఏపీలో మూడు రాజధానుల వివాదాన్ని ఇప్పటికే పాజిటివ్ గా మార్చుకున తెలంగాణా ఇక ఏపీలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాలు, లోకల్ కే ఉద్యోగాలు అంటూ వైసీపీ సర్కార్ తెచ్చిన చట్టాలతోపాటు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయన్న ప్రచారంతో మరింత ఎక్కువగా ఏపీ మీద ఫోకస్ పెట్టింది. వీలైనంత వరకూ వచ్చిన వారికి వచ్చినట్లే రెడ్ కార్పెట్ పరుస్తూ తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది.

నీటి ప్రాజెక్టులతో….

మరో వైపు నీటి ప్రాజెక్టుల విషయంలోనూ తెలంగాణా సర్కార్ చాలా వేగంగా ఉంది. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్ట్ ని నిర్మించడం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోతలతో ఒడిసిపట్టి దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇప్పటికే నీటి కోత పెట్టిన కేసీఆర్ మరిన్ని కొత్త ప్రాజెక్టులను గోదావరి నది మీద చేపట్టాలనుకుంటున్నారు. మరో వైపు ఏపీలో చూస్తే పోలవరం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఇది పూర్తి అయినా గోదావరి నీళ్ళు తిన్నగా వచ్చి చేరుతాయన్న గ్యారంటీ లేకుండా ఎగువ రాష్టం తెలంగాణా ఇప్పటి నుంచే చేయాల్సినదంతా చేస్తోంది.

టాలీవుడ్ కుదుపు…

అసలే మూసినా తెరచినా గుడ్డి కన్ను అన్నట్లుగా ఏపీలో ప్రగతి అన్న ఊసు లేకుండా సాగుతోంది. ఉన్నంతలో అన్నట్లుగా విశాఖ రాజధాని ప్రతిపాదన జగన్ చేశారు. అయితే దీనివల్ల జరిగే మేలుని ముందే పసిగట్టిన కేసీఆర్ సర్కార్ ఆదిలోనే దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఇప్పటికిపుడు కాదు కానీ, అన్నీ సమకూరితే ఓ పదేళ్ళు గడిస్తే హైదరాబాద్ కి పోటీగా విశాఖ మారుతుంది. అయితే దానికి సరైన కార్యాచరణ కావాలి. ముఖ్యంగా విశాఖ రాజధాని అంటే సినీ జీవులు ఈ వైపుగా మళ్ళీ చూస్తున్నాయి. చిరంజీవి వంటి మెగాస్టార్ దీన్ని బాహాటంగానే సమర్ధించారు. ఈ క్రమంలో విశాఖలో టాలీవుడ్ ఏర్పాటుకు అవకాశాలు అంటూ చర్చలు మళ్ళీ మొదలయ్యాయి.

తెలివిగా పావులు కదిపారా?

ఇదే సందు అన్నట్లుగా కేసీఆర్ ఊహకందని మెరుపు వేగంతో టాలీవుడ్ పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గత ఆరేళ్ళలో ఎన్నడూ లేనిది తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏకంగా చిరంజీవి ఇంటికి వెళ్ళి ఏం కావాలి నరుడా అన్నట్లుగా వరాలకు కోరుకోమంటున్నారు. ఆ తరువాత సినీ పెద్దలతో మరో మీటింగ్ కూడా జరిగింది. ఏం అడిగినా తీరుస్తాం, స్థలాలను ఇస్తాం, అన్ని వర్గాలకూ మేలు చేస్తామని కేసీఆర్ సర్కార్ ముందుకు వస్తోంది. ఇది నిజంగా విశాఖ రాజధాని అయితే కలిగే లాభాలను దెబ్బతీయడమేనని అంటున్నారు. ఎంతైనా సినీ నటులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు. వారిని విశాఖ‌ రాజధాని ద్వారా జగన్ సర్కార్ ఆకట్టుకోకముందే కేసీఆర్ తెలివిగా పావులు కదిపారని అంటున్నారు. మరి దీనికి విరుగుడు మంత్రం జగన్ దగ్గర ఉందా అన్నదే ఇపుడు ప్రశ్న.

Tags:    

Similar News