దెబ్బ మామూలుగా లేదుగా

జగన్ ని చంద్రబాబు తరచూ ఫ్రాక్షనిస్ట్ అని విమర్శిస్తారు. నిజానికి జగన్ తరం వచ్చేటప్పటికి రాయలసీమలో ఫ్రాక్షనిజం దాదాపుగా అంతానికి వచ్చేసింది. మరో వైపు చూసుకుంటే తెలుగుదేశం [more]

Update: 2020-02-11 02:00 GMT

జగన్ ని చంద్రబాబు తరచూ ఫ్రాక్షనిస్ట్ అని విమర్శిస్తారు. నిజానికి జగన్ తరం వచ్చేటప్పటికి రాయలసీమలో ఫ్రాక్షనిజం దాదాపుగా అంతానికి వచ్చేసింది. మరో వైపు చూసుకుంటే తెలుగుదేశం వచ్చాక సీమ జిల్లాల్లో ఎక్కడా ఫ్యాక్షన్ లేకుండా చేశామని చంద్రబాబే ఒకటికి పదిసార్లు చెప్పుకుంటారు. అటువంటి పెద్ద మనిషి జగన్ విషయం వచ్చేసరికి మాత్రం ఫ్రాక్షనిజం అంటూ విరుచుకుపడతారు. ఇక్కడే చంద్రబాబు రెండు నాలుకల ధోరణి బయటపడుతోందని అంటున్నారు. సరే చంద్రబాబు ఆరోపణలు పక్కన పెడితే వైఎస్సార్ ని మంచి స్నేహితుడుగా చెప్పుకునే సీమ జిల్లాలకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సైతం ఈ మధ్య కాలంలో జగన్ ని ఫ్రాక్షనిస్టు అంటున్నారు.

కుంగిపోతున్నారా…?

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఏం చేయదలచుకున్నదీ ఒక క్లారిటీతో ముందుకు పోతున్నారనిపిస్తోంది. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను చకచకా తీర్చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ బాకీలనూ తీర్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ విషయంలో అయిన దానికి కాని దానికీ విమర్శలు చేస్తూ ఇబ్బందు పెట్టిన జేసీ లాంటి వారికి ఇపుడు కోరలు తీసేసే పనిని జగన్ చేస్తున్నారని అంటున్నారు. ఓ విధంగా జేసీ ఆర్ధిక మూలాల మీద పెద్ద దెబ్బనే జగన్ కొడుతున్నారని అంటున్నారు. ముందుగా ఆయన బస్సుల మీద పడిన వైసీపీ సర్కార్ ఇపుడు ఆయనకు లీజుకు ఇచ్చిన సున్నపు రాయి గనుల మీద పడింది. ఇక జేసీ కుటుంబాన్ని ఫోర్జనీ కేసులు తాజాగా వెంటాడుతున్నాయి.

బాబు ముందు బేలగా….

ఇవనీ ఇలా ఉంటే జేసీ ఎపుడూ ధీమాగా కనిపించే మనిషి. అటువంటి పెద్దాయన బేలగా మారిపోయారని తమ్ముళ్ళే అంటున్నారు. ఈ మధ్యన ఆయన చంద్రబాబు వద్దకు వెళ్ళి ఆయన భుజాలు పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాను అన్ని విధాలుగా ప్రస్తుత సర్కార్ లో కుంగిపోతున్నానని జేసీ కన్నీటి పర్యంతం అయ్యారని చెబుతున్నారు. ఓ విధంగా జేసీ లాంటి వారికి ఏ సర్కార్ వచ్చినా పోయేది ఏమీ లేదు. గతంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నపుడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఆయన వ్యాపారాలకు అడ్డులేకుండా పోయింది. ఇపుడు జగన్ మాత్రం మూలాలనే కుదిపేయడంతో జేసీ ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు.

వేట మొదలైందా..?

మరో వైపు చంద్రబాబు బయటకు ఎంత నిబ్బరంగా ఉన్నా కూడా ఆయన సైతం గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన పడుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. బాబు సన్నిహితులపైన కూడా ఇపుడు వేట సాగుతోందని, బాబుకు ఇది ఇబ్బందిగా పరిణమిస్తోందని అంటున్నారు. అయిదేళ్ళ చంద్రబాబు జమానాలో అన్నీ నిబంధనలూ పక్కన పెట్టి బాబు పల్లకీ మోసిన ఫలితాన్ని ఇపుడు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనుభవిస్తున్నారని అంటున్నారు. ఇదే వరసలో మరింతమంది అధికారుల మీద చర్యలకు వైసీపీ సర్కార్ రెడీ అవుతోందని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఓ వైపు రాజకీయంగా, మరో వైపు సామాజికంగా, ఇంకోవైపు ఆర్ధికంగా దెబ్బకొట్టడం ద్వారా చక్రబంధంలో చంద్రబాబుని, ఆయన బ్యాచ్ ని బంధించాలని జగన్ వేస్తున్న కొత్త ఈ ఎత్తులతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కిపోతోంది.

Tags:    

Similar News