సహజ మిత్రులున్నారటగా

కొన్ని విషయాల్లో చంద్రబాబుని జగన్ అనుసరిస్తున్నారు. నిజమే బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరి. ఎక్కడ ఎలా నరుక్కురావాలో తెలిసిన పెద్ద మనిషాయే. ఆయన రాజకీయ చతురత‌ [more]

Update: 2020-02-12 02:00 GMT

కొన్ని విషయాల్లో చంద్రబాబుని జగన్ అనుసరిస్తున్నారు. నిజమే బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరి. ఎక్కడ ఎలా నరుక్కురావాలో తెలిసిన పెద్ద మనిషాయే. ఆయన రాజకీయ చతురత‌ కొంత ఇతరులకూ స్పూర్తిగా ఉండడంలో తప్పులేదు. ఇపుడు జగన్ కూడా ఫాలో ఫాలో అంటున్నారు. గతంలో చంద్రబాబు బీజేపీతో దోస్తీ చేశారు, విడిపోయారు. అయితే బీజేపీలో బాబుకు పెద్ద తలకాయలతో పాటు, కొంతమంది ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో సన్నిహిత సంబంధాలు గట్టిగానే ఉన్నాయి. వాటినే ఆయన ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. ఇపుడు అచ్చం బాబు లాగానే జగన్ కూడా బీజేపీలో మిత్రులను సంపాదించుకుని నింపాదిగా రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

ఆయన అండ….

ఇక జీవీఎల్ నరసింహారావు అనే పెద్ద మనిషి ఇపుడు వైసీపీకి అండగా ఉంటున్నారు. జీవీఎల్ కి కేంద్ర పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉంది. ఆయన బీజేపీ జాతీయ స్థాయి అధికార ప్రతినిధి. ఆయన స్వతహాగా చంద్రబాబు వ్యతిరేక కోటరీ మనిషి. దాంతో అది ఇపుడు జగన్ కి బాగా కలసివస్తోందని అంటున్నారు. జీవీఎల్ జగన్ సర్కార్ మీద ఈగ వాలకుండా జాగ్రత్తగానే పావులు కదుపుతున్నారు. దాంతో ప్రతి చిన్న విషయాన్ని చిరిగి చేట చేసుకుంటున్న వైసీపీ సర్కార్ కి ఢిల్లీ స్థాయిలో జీవీఎల్ పెద్ద అండగా ఉండడమే కాదు, నైతికంగా కూడా బలంగా నిలుస్తున్నారు అంటున్నారు.

ఒడ్డున పడేస్తున్నారుగా…?

ఇక జగన్ ప్రభుత్వం చిక్కుల్లో పడ్డ ప్రతీ సారీ ఒడ్డున పడేయడంలో జీవీఎల్ ముందుంటున్నారు. మూడు రాజధానుల విషయంలో అన్ని పార్టీలు కలసి పెద్ద ఎత్తున జగన్ మీద దాడి చేశాయి. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా ఓ దశలో రెచ్చిపోయారు. వీటన్నింటినీ పక్కన పెట్టేలా రాజధానుల ఎంపిక అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని జీవీఎల్ ఒక్క ముక్కతో తేల్చేసారు. అదే విధంగా అమరావతి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాన్ని మార్చడం బ్రహ్మతరం కాదని తమ్ముళ్ళు వితండవాదం చేస్తున్న సమయంలో కూడా అదేమీ అక్బర్ శిలాశాస‌నం కాదు, మరో కొత్త జీవో ఇచ్చి కొత్త రాజధాని మీద గెజిట్ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అని సులువుగా జీవీఎల్ చేప్పేశారు. దీంతో తమ్ముళ్ళకు మైండ్ బ్లాంక్ అయింది. ఇక శాసన మండలి వ్యవహారంలోనూ జీవీఎల్ అంతా రాజ్యాంగబధ్ధంగా జరుగుతుంది. మండలి రద్దు ఖాయం అంటూ పసుపు శిబిరంలో కలవరం రేపారు.

కలసివస్తోంది….

జగన్ కి జీవీఎల్ సహజ‌ మిత్రుడిగా బీజేపీలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఆయన ఒక్కరే కాదు, బీజేపీలో మొదటి వరసలో ఉండే కొందరు అగ్ర నేతలు కూడా జగన్ని కాపాడుతున్నారని అంటున్నారు. బాబుకు కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్క‌రీ వంటి వారి పరోక్ష మద్దతు ఉంటే జగన్ కి వారితో పొడ గిట్టని మిగిలిన వారి మద్దతు ఉందని చెబుతున్నారు. ఏపీలో జగన్ సర్కార్ ఉండడమే బీజేపీకి మేలు అని, రాజకీయంగా బాబుని కోలుకోనివ్వడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని మెజారిటీ బీజేపీ నేతలు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మోడీ, షాలకు కూడా బాబు మీద పీకల్లోతు కోపం ఉండడం జగన్ కి అన్ని విధాలుగా కలసివస్తోందిట. ఏది ఏమైనా జగన్ బీజేపీలో మిత్రులను బాగానే సంపాదించుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News