బొమ్మ తిరగబడితే?

రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి. ఎపుడేం జరుగుతుందో ఆ బ్రహ్మకు తప్ప ఎవరికీ తెలియదు. బంపర్ మెజారిటీతో వచ్చిన అన్న నందమూరి ఏడాదిన్నరలోపే [more]

Update: 2020-02-15 02:00 GMT

రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి. ఎపుడేం జరుగుతుందో ఆ బ్రహ్మకు తప్ప ఎవరికీ తెలియదు. బంపర్ మెజారిటీతో వచ్చిన అన్న నందమూరి ఏడాదిన్నరలోపే నాదెండ్ల భాస్కరరావు చేతిలో పదవీచ్యుతులవుతారని ఎవరైనా అనుకున్నారా. అప్పట్లో అదృష్టం కలిసివచ్చి మళ్ళీ ఎన్టీఆర్ నెల రోజుల్లోపే ముఖ్యమంత్రి కాగలిగారు. ఇక అదే ఎన్టీఆర్ 1995లో అల్లుడు బాబు చేతిలోనే పదవి పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా అన్న గారికి రికార్డ్ మెజారిటీతోనే అధికారం దక్కింది. ఈ రెండూ తెలుగునాట సంభవించిన కీలక పరిణామాలు. వీటిని జాగ్రత్తగా చూసుకున్నపుడు ఎంత పెద్ద మెజారిటీతో గెలిచినా ఎపుడూ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఎవరూ అనుకోనక్కరలేదు.

కిందా పడ్డా…?

ఇక ఏపీలో జగన్ కి అతి పెద్ద మెజారిటీ దక్కింది. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేల మీటింగులో మాట్లాడుతూ ఇది ప్రజలు మనకు అప్పగించిన బాధ్యత. ఈ విజయాన్ని తలకెక్కించుకోకూడదు అని హితబోధ చేశారు. కానీ జగనే ఆ విజయాన్ని నెత్తినెక్కించుకున్నారేమోని గత తొమ్మిది నెలల పాలన చూసిన వారు అనుకుంటున్నారు. జగన్ దృష్టిలో చంద్రబాబు విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు, ఆయన్ని జగన్ పూర్తిగా తిరస్కరించారు. ఆయన మళ్ళీ అధికారంలోకి రాలేడు. కానీ ఇది రాజకీయం అన్న సంగతినే జగన్ మరచిపోతున్నారు, పైగా చంద్రబాబు ఎన్నిసార్లు కిందపడ్డా పైకి లేవగల రాజకీయ గండరగండడు. అది గుర్తించి మెలగాలి కదా.

ప్రజాస్వామ్యయుతంగా….

మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ఏది చేసినా కూడా ఆ స్పూర్తి అన్నింటా కనిపించాలి. కానీ జగన్ పాలనలో మాత్రం అది పెద్ద లోటు అంటున్నారు మేధావులు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి రెండూ జగనే. ఆయన అయిదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటపుడు పార్టీలోనైనా విస్తృతంగా చర్చ జరగాలి లేదా ప్రభుత్వంలోనైనా కూడా చర్చ ఉండాలి. కానీ జగన్ తన మనసులో ఉన్నదే అజెండాగా పెట్టి అమలు చేస్తున్నారు. ఇది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు కూడా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రెండు పాత్రలూ పోషించేవారు. అయినా కూడా పొలిట్ బ్యూరో మీటింగులో పెట్టి మొక్కుబడికైనా చర్చ జరిపేవారు. అలాగే తన అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చి జనం మనోగతం తెలుసుకునేవారు. చివరికి బాబు అనుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నా అందులో అందరి భాగస్వామ్యం ఉన్నట్లుగా బయట వారికి తోచేది.

దూకుడు పనికిరాదుగా…?

జగన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఇంగ్లీష్ మీడియంలో బోధన అయినా, మూడు రాజధానుల ప్రతిపాదన అయినా చివరికి ప్రభుత్వం మాటే నెగ్గుతుంది. కానీ ఈ మధ్యలో చేయాల్సిన ప్రక్రియను జగన్ చేయకపోబట్టే ఆయన కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆయన ఒక్క బాబునే తనకు ప్రత్యర్ధిగా చూస్తున్నారు. బాబు పని ఒక్క ఎన్నికతోనే అయిపోయిందని కూడా భావిస్తున్నారు. కానీ జనం మాత్రం అన్నీ చూస్తున్నారు. రేపు జగన్ అనుకున్నట్లుగా కాకుండా బొమ్మ తిరగబడితే చేదు అనుభవాలే చూడాల్సివుంటుందని హితవు చెప్పేవారు చెబుతున్నారు. మరి జగన్ వింటారా.

Tags:    

Similar News