కొంప కొలాప్స్ అయితే ఖల్లాస్

కూల్చేది ఇంటిని కాదు. కులం బలాన్ని. కరకట్ట మీద చంద్రబాబు ఇంటిని కూలుస్తారా లేదా> ఈ వారమే ముహూర్తం. నోటీసుల గడువు పూర్తి కాగానే కూల్చేస్తారని పుకార్లు.! [more]

Update: 2019-09-26 05:00 GMT

కూల్చేది ఇంటిని కాదు. కులం బలాన్ని. కరకట్ట మీద చంద్రబాబు ఇంటిని కూలుస్తారా లేదా> ఈ వారమే ముహూర్తం. నోటీసుల గడువు పూర్తి కాగానే కూల్చేస్తారని పుకార్లు.! ప్రభుత్వ పెద్దల్లో ఎందుకింత మొండితనం? ఎందుకీ ఆవేశం? ఏమి సాధించాలని చంద్రబాబు ఇంటి మీద దూకుడుగా వెళ్తోంది?. ఆ ఇల్లు అక్కడ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఉదయం లేచినప్పటి నుంచి వేరే వ్యవహారం లేనట్టు వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఎందుకింత వాదన? టీవీ డిబేట్లు…. దీనికి సమాధానం సింపుల్…… జరుగుతున్నది కులానికి కులానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఆధిపత్య కులాల అహనికి జరుగుతోన్న పోరాటం. పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి మనసులో గూడు కట్టుకున్న భావాలకు, ఆలోచనలకు క్రియా రూపమే ప్రస్తుత పరిణామాలు. ఇందులో సామాన్య జనాలకు, ప్రత్యేకంగా పాలిత కులాలకు వచ్చే లాభం ఏమి ఉండదు. పాలక కులాల మధ్య జరిగే పోరాటంలో వినోదాన్ని ఆస్వాదించడం. ఏదో పక్షాన చేరి దాన్ని సమర్ధించి, వ్యతిరేకించి సంబరపడుతుండటమే.

అవి ఉల్లంఘనలే…..

నదీ పరివాహక చట్టాలు, అటవీ, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి కరకట్ట మీద కట్టడాలు నిర్మించడం ఈ రోజు కొత్తగా జరిగిందేమి కాదు. అది లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ తో మొదలైంది కాదు. రేపు కొత్తగా అక్కడ నిర్మాణాలు జరగవనే నమ్మకం కూడా ఎవరికి అక్కర్లేదు. ఇదంతా చంద్రబాబు- జగన్ ల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటం. ఇందులో అంతకు మించి ఏమి ఆశించకూడదు.

ఏమిటి లాభం…..?

పాలక కులాలు ఎప్పుడు ఒకదాని ఆధిపత్యాన్ని మరొకటి దెబ్బ తీయడమే నయా రాజకీయం. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జగన్ బల పడకపోవడానికి, చేతి దాకా వచ్చిన కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడానికి, సీబీఐ కేసుల్లో చిక్కుకోవడానికి చంద్రబాబు కారణమనే భావన జగన్ లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఎన్నికల్లో అధికారానికి దూరమై అసెంబ్లీలో అవమానాలు పడటాన్ని జగన్ నేపథ్యం అంత సులువుగా అంగీకరించదు. పదేళ్ల పాటు జైలులో పడిన కష్టాలు, రోడ్డున పడి చేసిన పాద యాత్రలు ప్రజలకు చేరువ చేసినా అతని మనసులో కసిని, కోపాన్ని అవేమి చల్లార్చవు. అతని ప్రతి చర్య రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడం, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీయడం కోసమే జరుగుతోంది. దీని వల్ల వచ్చే చెడును కూడా అతను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి రావొచ్చు. కానీ అతని అహం మాత్రం చల్లారుతుంది.

ప్రత్యర్థి నష్టమే అసలు లక్ష్యం….

రాజకీయ ప్రత్యర్థి అనడం కంటే పోటీ కులం ఆర్థిక మూలలను దెబ్బ తీయడమే జగన్ ప్రథమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందులో మిగిలిన వర్గాలు దూరమయ్యే అవకాశం ఉండదు కాబట్టి మొండిగా ముందుకు వెళుతున్నాడు. రాజధాని మీద ఏర్పడిన ప్రతిష్టంభన, ఇసుక కొరత, రివర్స్ టెండరింగ్, కరకట్ట నిర్మాణాల కూల్చివేత ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్న వ్యవహారాలు. వీటి వల్ల పరోక్ష ప్రభావానికి గురయ్యే వారి కంటే ప్రత్యక్ష లబ్ది పొందే వారిని మాత్రమే జగన్ టార్గెట్ చేసినట్టు అర్థం అవుతుంది. ఇందులో మంచి చెడులు, లాభ నష్టాలు పక్కన పెడితే సమకాలీన రాజకీయాల్లో ఇదో ఆసక్తికరమైన పరిణామం. మున్ముందు ఏమి జరుగుతుందో చెప్పలేకున్నా జరిగే పరిణామాలను తమకు అనుగుణంగా మలచుకోవడమే రాజనీతి. రాజధానిలో మెజారిటీ భూములిచ్చిన వర్గాలకు కరకట్ట మీద చంద్రబాబు ఉండటం ఓ ధైర్యం. ఆ ధైర్యాన్ని కూల్చి వేయడం లక్ష్యం అయితే….. అందులో లింగమనేని లాంటి వాళ్ళు కేవలం పావులు. కూలేది బాబు ఇల్లో, ఆస్తి కాదు కాబట్టి ఆయనకి జరిగే నష్టం ఏమి ఉండదు. పైగా దేశం మొత్తం తిరిగి సానుభూతి పొందొచ్చు. రాజధాని ప్రాంతంలో పది, ఇరవై లక్షల భూమిని రెండు, మూడు కోట్ల స్థాయికి చేర్చినందుకు ఎటూ ఓ వర్గం ఆయనకు రుణ పడే ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News