ముహూర్తం చెవిలో ఊదారా?

జగన్ విశాఖ మళ్ళీ వచ్చారు. స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాలుపంచుకుని రాజ్యశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలూ నిర్వహించారు. జగన్ స్వామిని [more]

Update: 2020-02-03 13:30 GMT

జగన్ విశాఖ మళ్ళీ వచ్చారు. స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాలుపంచుకుని రాజ్యశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలూ నిర్వహించారు. జగన్ స్వామిని అనుసరించి ఆయన చెప్పినట్లుగా మొత్తం ఈ ధార్మిక క్రతువులో పాలుపంచుకున్నారు. పూర్తి భక్తి శ్రద్ధలను కనబరచారు. స్వామి సైతం జగన్ రాకతో పులకించి మొత్తం ఆశ్రమాన్ని తిప్పి చూపించారు. ఆయన చేత దైవిక సంబంధ కార్యక్రమాలన్ని నిష్టగా, శ్రద్ధగా చేయించారు. జగన్ ని అలా చూసిన వారు ఆయన కంటే పరమ భక్తుడు వేరే లేరని అనుకుంటారు. ఎవరితోనూ మాట్లాడుకుండా పూర్తి ఏకాగ్రతతో జగన్ ఆశ్రమంలో పూజలు చేయడం విశేషం.

మౌనంగానే అడుగులు….

ఇదిలా ఉండగా విశాఖను పాలనా రాజధానిగా ప్రతిపాదించిన తరువాత జగన్ రావడం రెండవసారి. మొదటి సారి విశాఖ ఉత్సవ్ కి వచ్చినపుడు విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున జన సందోహం వెల్ కమ్ సీఎం అంటూ ప్ల కార్డులు పట్టుకుని ఘనంగా స్వాగతించింది. జగన్ అప్పట్లో నాలుగు గంటల పాటు నగరంలో ఉన్నా కూడా ఎక్కడా ఒక్క మాట విశాఖ రాజధాని గురించి చెప్పకుండా వెళ్ళిపోయారు. దాంతో నగర ప్రజలు నిరాశకు గురి అయినా ఆ వెంటనే వైసీపీ సర్కార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరపడం, మూడు రాజధానుల ప్రతిపాదనలు జగన్ ఆమోదించి మండలికి బిల్లు పంపడం చకచకా జరిగిపోయాయి.

ఇంకా దగ్గరగా….

ఇక ఇపుడు రాజధాని విషయంలో మరింత ప‌క్కా క్లారిటీ ఇచ్చి మరీ విశాఖ‌ శారదాపీఠానికి జగన్ రావడంతో విశాఖ జనంలోనూ ఆసక్తి కనిపించింది. ఇక జగన్ పీఠంలో ఉండగానే విశాఖలో సచివాలయంగా పెట్టేందుకు గుర్తించిన మిలీనియం టవర్స్ బీ బ్లాక్ కోసం 20 కోట్ల రూపాయల నిధులను విడుద‌ల చేయడం విశేషం. అంటే మరింత దగ్గరగా జగన్ విశాఖకు వచ్చేస్తున్నారనడానికి అదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇప్పటికే రుషికొండ వద్ద ఉన్న మిలీనియం టవర్స్ వద్ద పనులు జోరుగా సాగుతున్నాయి. దానికి ఈ నిధుల విడుదలతో మరింత దూకుడు పెంచినట్లైంది.

ముహూర్తం ఖరారు…..

ఇక జగన్ విశాఖను పాలనారాజధానిగా ఎంచుకోవడం వెనక శారదాపీఠం స్వామీజీ ఉన్నారని ఓ వైపు ప్రచారం ఉంది. ఏపీకి తూర్పు ముఖంగా పాలన సాగిస్తే వాస్తు బాగా కలసివస్తుందని కూడా స్వామీజీ చెప్పినట్లుగా అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే జగన్ నేరుగా పీఠానికి రావడం స్వామి ఆశీస్సులు పొందడంతో ఇక విశాఖ రాజధానికి మంచి ముహూర్తం ఒక్కటే మిగిలిందని అంతా భావిస్తున్నారు. ఆ ముహూర్తాన్ని కూడా స్వామీజీ దగ్గరుండి చూసి మరి జగన్ చెవిన వేశారని కూడా అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తెలుగు వారి కొత్త ఏడాది అయిన ఉగాది నాడు జగన్ విశాఖకు పూర్తి స్థాయిలో మకాం మార్చేస్తారని కూడా అంటున్నారు. అంటే మార్చి 25న జగన్ కొబ్బరికాయ కొట్టి మరీ విశాఖవాసిగా మారిపోతారని చెబుతున్నారు. మొత్తానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా జగన్ అడుగులు విశాఖవైపే పడుతున్నాయని, దానికి తాజా పరిణామాలు ఉదాహరణ అంటున్నారు.

Tags:    

Similar News