జగన్ అలా చేస్తే…?

జగన్ వైఖరి ఏంటో బయటకు ఎవరికీ తెలియదు. మోడీ పట్ల, బీజేపీ విషయంలో జగన్ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని అంటారు. నిజానికి జగన్ రాజకీయమే [more]

Update: 2020-02-06 02:00 GMT

జగన్ వైఖరి ఏంటో బయటకు ఎవరికీ తెలియదు. మోడీ పట్ల, బీజేపీ విషయంలో జగన్ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని అంటారు. నిజానికి జగన్ రాజకీయమే వేరుగా ఉంటుంది. ఒక పార్టీని, నాయకుడిని ఆయన గట్టిగా ద్వేషించారంటే శాశ్వత శత్రువుగానే చూస్తారు. కాంగ్రెస్ పార్టీ తో జగన్ ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరితో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇపుడు మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. అది కేంద్రంలో అప్రతిహతంగా వెలిగిపోతోంది. ఎవరు కాదన్నా కూడా మరో నాలుగేళ్ళకు పైగా మోడీతో వేగాల్సిందే.

ఒత్తిడి గట్టిగానే….

ఈ నేపధ్యంలో మోడీతో కోరి మరీ విరోధాన్ని జగన్ తెచ్చుకుంటారా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఓ వైపు చూసుకుంటే ఏపీ మీద బీజేపీకి దయ, కరుణా ఏమీ లేవని మోడీ తేల్చేస్తున్నారు. ఏపీ వంటి ఇబ్బందులలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఆయన ఏ మాత్రం ముందుకు రావడంలేదు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీ అన్న తీరున వెళ్తున్నారు. పోనీ ఆ సమానమైనా ఉందా అంటే ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయారిటీ ఇస్తున్నరు. దీంతో ఇపుడు జగన్ మీద ఒత్తిడి ఒక స్థాయిలో ఉంది.

కోరి తెచ్చుకుంటారా…?

ఈ రోజు దేశమంతా సీఏఏ మీద రగిలిపోతోంది. ఎక్కడా దొరకని మోడీ అక్కడ దొరికేశాడని ప్రతిపక్షం సంబరం చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో వరసగా పలు రాష్ట్రాలు సీఏఏ వద్దు అంటూ తీర్మానాలు కూడా చేస్తున్నాయి. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటివి ఇప్పటికే తీర్మానం చేస్తే కేసీఆర్ కూడా బడ్జెట్ సెషన్లో సీఏఏ మాకు వద్దు అంటూ తీర్మానించి కేంద్రానికి పంపుతామని అంటున్నారు. మరో వైపు పాండిచ్చేరి కూడా సీఏఏ వద్దు అంటూ అసెంబ్లీ తీర్మానం తెస్తోంది. ఇలా కుడి ఎడమల రాష్ట్రాలన్నీ అసెంబ్లీ తీర్మానాలు చేస్తూంటే జగన్ కూడా అలాగే చేసి పంపాలని వత్తిడి వస్తోంది. మరి అలాంటి పని జగన్ చేస్తారా, మోడీతో వైరం కొని తెచ్చుకుంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది.

అడకత్తెరేనా…?

ఇక ఏపీలోని రాయసీమ జిల్లాల్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. వారంతా వైసీపీవైపే ఉంటున్నారు. కాంగ్రెస్ తరువాత వారు నమ్మిన పార్టీగా అది ఉంది. ఇక జగన్ కూడా వారికి గట్టి నమ్మకస్తుడిగా కనిపిస్తున్నారు. ఇపుడు సీఏఏ చిచ్చు తో మైనారిటీలు ఎక్కడ జారిపోతరోనన్న కంగారు ఆ పార్టీలో ఉంది. దీని మీద కర్నూలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ సీఏఏను సపోర్ట్ చేయదని, చేస్తే కనుక తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంటున్నారు. మరో వైపు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కూడా సీఏఏ కు మద్దతు ఇవ్వమని చెబుతున్నారు. ఇది ఒక్కటే చాలదు ఏపీలో దాన్ని అమలు చేయమని అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వామపక్షాల నేతలు జగన్ ని డిమాండ్ చేస్తున్నారు. బయటకు ఇలా డిమాండ్ చేయలేని రాజకీయ అసహాయతతో టీడీపీ ఉన్నా జగన్ ఇలా ఇరుక్కుంటే చూడాలనుకుంటోంది. మరి జగన్ ఏం చేస్తారో.

Tags:    

Similar News