ఆ ఇద్దరు మంత్రులకూ భలే ఛాన్సులే

జగన్ తనను నమ్ముకున్న వారికి ఎపుడూ అన్యాయం చేయరన్న సిధ్ధాంతం మరో మారు రుజువు కాబోతోంది. జగన్ కాంగ్రెస్ ని వదిలి ఒంటరిగా బయటకు వచ్చినపుడు ఆయనను [more]

Update: 2020-02-03 08:00 GMT

జగన్ తనను నమ్ముకున్న వారికి ఎపుడూ అన్యాయం చేయరన్న సిధ్ధాంతం మరో మారు రుజువు కాబోతోంది. జగన్ కాంగ్రెస్ ని వదిలి ఒంటరిగా బయటకు వచ్చినపుడు ఆయనను నమ్మి వెంట నడిచిన ఇద్దరు మంత్రులు నాడు కనిపిస్తారు. వారే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. ఈ ఇద్దరూ బలహీన వర్గాలకు చెందిన వారే. వీరిలో మోపిదేవి అయితే జగన్ తో పాటు జైలు జీవితం అనుభవించారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాలేకపోయారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిచినా ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. అయినా సరే ఎమ్మెల్సీలను చేసి ఈ ఇద్దరినీ మంత్రులుగా జగన్ తీసుకున్నారు. అయితే ఇపుడు శాసనమండలి రద్దు కాబోతోంది.

రాజ్యసభకు…..?

దాంతో తనను మాత్రమే నమ్మి అన్ని రకాలుగా త్యాగం చేస్తున్న ఈ ఇద్దరికీ మరో అవకాశం ఇవ్వాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారుట. మార్చిలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో రెండు ఈ ఇద్దరికీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారుట. ఇద్దరూ బడుగు వర్గాలవారు, పార్టీ పుట్టినప్పటినుంచి ఉన్నవారు కావడంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఎవరూ కాదని చెప్పే పరిస్థితి లేదని అంటున్నారు. అంతే కాదు, మండలి రద్దుతో ఈ ఇద్దరి విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో కూడా మిగిలిన వారికి సానుభూతి ఉంది. దాంతో జగన్ మంచి పనే చేస్తున్నారని అంటున్నారు.

ఆ ఇద్దరూ కూడా….

ఇక వీరితో పాటు మరో ఇద్దరు త్యాగమూర్తులకు కూడా జగన్ పెద్ద పీట వేయాలనుకుంటున్నారుట. పెద్దల సభకు వారిని కూడా నామినేట్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఆ ఇద్దరూ ఎవరంటే అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా కోసం చివరి ఏడాది తన పదవులకు రాజీనామా చేశారు. ఇక అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికలో ఎంపీగా వైసీపీ తరఫున గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కోసం బాగానే కష్టపడ్డారు. పైగా ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సోదరుడు. రాజధాని చిచ్చుతో ఆళ్ళకు భవిష్యత్తుల్లో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఆయన సోదరుడికి రాజ్యసభ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నది జగన్ ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి జగన్ ఆలోచనలతో ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్లకు రాజ్యసభ దక్కబోతోందని అంటున్నారు. మొత్తం మీద మండలి రద్దు అయినా కూడా తనవారికి జగన్ న్యాయమే చేస్తున్నారని అంటున్నారు.

.

Tags:    

Similar News