జ‌గ‌న్ గురి ఇక అక్కడేనట

త్వర‌లోనే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం కానుంది. కొన్ని రోజుల కింద‌ట రిజ‌ర్వేషన్ విష‌యం ఓ కొలిక్కి వ‌చ్చినా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజ‌ర్వేష‌న్లు [more]

Update: 2020-02-09 12:30 GMT

త్వర‌లోనే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం కానుంది. కొన్ని రోజుల కింద‌ట రిజ‌ర్వేషన్ విష‌యం ఓ కొలిక్కి వ‌చ్చినా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించ‌రాదంటూ.. కొంద‌రు కోర్టును ఆశ్రయించ‌డంతో ప్రస్తుతం రిజ‌ర్వేష‌న్‌ల అంశం పెండింగ్‌లో ప‌డింది. అయినా కూడా ఈ ఏడాది మే నాటికి ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని గ‌తంలో హైకోర్టు ఆదేశం ఉన్న నేప‌థ్యంలో త్వర‌లోనే ఈ కేసును ప‌రిష్కరించి, ప్రభుత్వం ఎన్నిక‌ల‌కు వెళ్లేలా హైకోర్టు దిశానిర్దేశం చేస్తుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప్రభుత్వం మాత్రం ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ సాధించేందుకు అవస‌ర‌మైన అన్ని కార్యాచ‌ర‌ణ‌లూ సిద్ధం చేసుకుంటోంది.

సంక్షేమ కార్యక్రమాలతో….

రాష్ట్రంలో ప్రజ‌ల‌కు చేరువగా ఉండేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలూ తీసుకున్న ప్రభుత్వం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల‌ను ప్రజ‌ల‌కు చేరువ చేస్తోంది. అదేస‌మ‌యంలో ఇటీవ‌ల ప్రారంభించిన ప‌థ‌కాల‌కు గ‌డువును మ‌రింతగా పెంచి ప్రజ‌ల‌కు ల‌బ్ధి చేకూరేలా చేస్తోంది. ప్రజ‌ల‌కు పాల‌కులం కాదు, సేవ‌కులం అనే సీఎం జ‌గ‌న్ మాట‌ను మ‌రింత‌గా ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు, నాయ‌కులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

టీడీపీకి పట్టున్న…..

ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా కూడా వైసీపీ ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీలోని అసంతృప్తుల‌ను త‌గ్గించి, అంద‌రినీ ఒకే తాటిపై న‌డిపించేందుకు ప్రయ‌త్నిస్తోంది. ఇక‌, టీడీపీలో ఉండి, వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ప్రోత్సహించ‌డం ద్వారా పార్టీకి మేలు క‌లిగేలా కూడా చ‌ర్యలు తీసుకోవాల‌ని పార్టీ అధినేత జ‌గ‌నే మౌఖిక ఆదేశాలు ఇచ్చార‌ని స‌మాచారం. రాష్ట్రంలో టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రింత దూకుడు పెంచి వైసీపీకి అనుకూలంగా ప‌రిస్థితిని మార్చాల‌ని చూస్తున్నార‌ట‌.

ఇక్కడ ఇబ్బందులున్నా…..

ఇక‌, మూడు రాజ‌ధానుల నిర్ణయాన్ని కూడా ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లి, ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడంతోపాటు మిగిలిన పార్టీల వైఖ‌రుల‌ను కూడా ప్రజ‌ల్లో ఎండ‌గ‌ట్టాల‌ని చూస్తున్నారు. విశాఖ‌, సీమ ప్రాంతాల్లో వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు వీస్తుండ‌డంతో ఇప్పటికే టీడీపీ నాయ‌కులు చేప‌ట్టిన అమ‌రావ‌తి ఉద్యమాలు తెర‌మ‌రుగైన విష‌యాన్ని నాయ‌కులు ప్రస్తావిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా జ‌గ‌న్ వాటిని ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేరని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

క్లీన్ స్వీప్ చేయాలని…..

అన్ని కార్పొరేష‌న్లతో పాటు మున్సిపాల్టీల్లోనూ క్వీన్‌స్వీప్ చేయాల‌ని ఆయా జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన‌ట్టు ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా గెలుపే ధ్యేయంగా జ‌గ‌న్ ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. మొత్తంగా చూస్తే స్థానికంగా భారీ విజ‌యం న‌మోదు చేసేందుకు వైసీపీ ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News