Ycp : ఇప్పటికైనా కొట్టుకోవడం ఆపేస్తారా?

అనంతపురం జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో రెండు సీట్లను కోల్పోయింది. ఒకటి ఉరవకొండ కాగా, రెండోది హిందూపురం నియోజకవర్గాలు. ఉరవకొండలో పయ్యావులు కేశవ్, హిందూపురంలో బాలకృష్ణలు గెలిచారు. [more]

Update: 2021-11-13 12:30 GMT

అనంతపురం జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో రెండు సీట్లను కోల్పోయింది. ఒకటి ఉరవకొండ కాగా, రెండోది హిందూపురం నియోజకవర్గాలు. ఉరవకొండలో పయ్యావులు కేశవ్, హిందూపురంలో బాలకృష్ణలు గెలిచారు. ఈ రెండింటిని వచ్చే ఎన్నికల్లో గెలుచుకునేదిశగా జగన్ పదవుల పంపకాన్ని చేపడుతున్నట్లు అర్థమయింది. తాజాగా ఉరవకొండకు చెందిన శివరామిరెడ్డిని ఎమ్మెల్సీ పదవికి జగన్ ఎంపిక చేశారు.

ఇద్దరికీ పదవులు…

గతంలోనే జగన్ హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అక్కడ పార్టీలో కీలక నేతగా ఉన్న నవీన్ నిశ్చల్ కు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. హిందూపురంలో వీరిద్దరూ కలసి పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ పదవులను కీలక నేతలకు ఇచ్చారు. మొన్నటి వరకూ రెండు గ్రూపులుగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో పదవుల భర్తీతో కొంత పార్టీ గాడిలో పడినట్లే కన్పిస్తుంది.

ఇక్కడా రెండు గ్రూపులు…

మరొక నియోజకవర్గమైన ఉరవకొండలో కూడా రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. ఇద్దరూ వైసీపీలో తొలి నుంచి నమ్మకంగా ఉన్న వారే. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. కానీ జగన్ ఆలోచన 2024 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయించాలన్నది. అక్కడ శివరామిరెడ్డి వర్గం కూడా బలంగా ఉంది. గత కొంతకాలంగా రెండు గ్రూపులు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి.

ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చి…

ఉరవకొండ వైసీపీ ఇన్ ఛార్జిగా విశ్వేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. శివరామిరెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి జగన్ ఆయనకు గౌరవం ఇచ్చారు. ఇప్పుడు రెండు గ్రూపులు కలసి పార్టీని ఉరవకొండలో బలోపేతం చేయాలని ఆదేశించారు. ఉప్పు నిప్పులా ఇప్పటి వరకూ రెండు వర్గాలు కొనసాగాయి. ఇప్పటికైనా రెండు వర్గాలు కలసి వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆ నియోజకవర్గం పార్టీ క్యాడర్ కోరుకుంటోంది.

Tags:    

Similar News