నాతో పెట్టుకుంటే…?

క్యాన్సిల్… క్యాన్సిల్… క్యాన్సిల్.. గత ఏడు నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో విన్పిస్తున్న మాట. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రద్దు దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. [more]

Update: 2020-01-27 08:00 GMT

క్యాన్సిల్… క్యాన్సిల్… క్యాన్సిల్.. గత ఏడు నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో విన్పిస్తున్న మాట. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రద్దు దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో కొన్నింటికి ప్రజామోదం లభించినప్పటికీ మరికొన్నింటికి మాత్రం వ్యతిరేకత కన్పిస్తుంది. కొన్నింటిలో రద్దు నిర్ణయం కారణంగా పనుల్లో జాప్యం జరుగుతంది. గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం జగన్ వ్యవహారశైలి ఆందోళన కల్గిస్తుంది.

పీపీఏ, పోలవరం….

తొలుత విద్యుత్తు పవర్ పర్చేశ్ మెంట్ అగ్రిమెంట్లను రద్దు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది. ఫలితంగా చంద్రబాబు పాలనలో లేని విద్యుత్తు కోతలను ఏపీ ప్రజలు చూడాల్సి వచ్చింది. తర్వాత పోలవరం టెండర్లను రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకు వచ్చారు. దీనివల్ల డబ్బు ఆదా అయిన మాట వాస్తవమే అయినా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టును 2020 కల్లా పూర్తి చేస్తానని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాదన్నది నిపుణులు చెబుతున్న మాట.

అమరావతి అంశంలోనూ….

చంద్రబాబు దాదాపు ఐదు కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశారు. దీనిపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత వ్యక్తమయింది. ఇక మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చారు. ఫలితంగా అమరావతికి ముప్పు ఏర్పడింది. అమరావతికి ఎక్కడా లోపం చేయడం లేదని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచుతామని జగన్ చెబుతున్నప్పటికీ అమరావతి ఇక కోలుకోనట్లే. అమరావతిని జగన్ రద్దు చేసుకున్నట్లే భావించాలి. అయితే మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్ కు కొంత సానుకూలత ఏర్పడింది.

మండలి రద్దుతో…..

తాజాగా శాసనమండలిని జగన్ రద్దు చేశారు. నిజానికి ఏడాదిన్నర ఆగి ఉంటే జగన్ పార్టీకి శాసనమండలిలోనూ బలం పెరిగేది. పార్టీ నేతలకు పదవులు దక్కేవి. కానీ జగన్ ఏ మాత్రం ఉపేక్షించకుండా శాసనమండలిని రద్దు చేశారు. ఇది తప్పుడు నిర్ణయమని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నప్పటికీ జగన్ తాను అనుకున్నదే చేశారు. కేవలం టీడీపీని బలహీనం చేయడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ రాజకీయాలను ఊహించలేదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. ఇలా జగన్ ఏడు నెలల పాలనలో అన్నీ రద్దు దిశగానే నిర్ణయాలు ఎక్కువగా ఉండటం ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి.

Tags:    

Similar News