Ys jagan : ఒకే ఒక ఛాన్స్… జగన్ మిస్సయ్యారా?

వైఎస్ జగన్ తాను బలవంతుడిననుకోవచ్చు. తన పథకాలే తనను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని నమ్మవచ్చు. కానీ ప్రజల నాడి తెలుసుకునే అవకాశాన్ని జగన్ కోల్పోయారు. చేజేతులా వచ్చిన [more]

Update: 2021-10-31 15:30 GMT

వైఎస్ జగన్ తాను బలవంతుడిననుకోవచ్చు. తన పథకాలే తనను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని నమ్మవచ్చు. కానీ ప్రజల నాడి తెలుసుకునే అవకాశాన్ని జగన్ కోల్పోయారు. చేజేతులా వచ్చిన అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో ఎన్నో హామీలను జగన్ అమలు చేశారు. కరోనా సమయంలోనూ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోగలిగారు. అభివృద్ధిని పక్కన పెట్టి మరీ సంక్షేమాన్ని జనాలకు చేర్చగలిగారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…

అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్, పంచాయతీలు, పరిషత్ ఎన్నికలు వరసగా వచ్చాయి. ఇది నిజంగా జగన్ కు తన పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చిక్కిన చక్కని అవకాశం. అయితే దానిని జగన్ వదిలేసుకున్నారనే చెప్పుకోవాలి. సహజంగా అధికారంలో ఉన్న పార్టీవైపు స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అయితే ప్రతిపక్షం కూడా బరిలో ఉన్నప్పుడే ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందన్నది తెలిసే వీలవుతుంది. మరో ఐదేళ్ల వరకూ స్థానికసంస్థల ఎన్నికలు జరగవు.

అర్బన్ ప్రాంతాల్లో….

కానీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టినా అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ విజయం సాధించింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అన్నింటిని కైవసం చేసుకోగలిగింది. అర్బన్ ఓటర్లు వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నారనే అనుకోవాలి. ఇక పంచాయతీ ఎన్నికల్లో గుర్తులుండవు. అయితే ఇక్కడ అభ్యర్థులను బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. సామ,దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి పంచాయతీలను కూడా వైసీపీయే అధిక సంఖ్యలో కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల అధికార పార్టీ నామినేషన్లను కూడా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి.

గ్రామాల్లో వాస్తవ పరిస్థితిపై…..

పంచాయతీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో గ్రామ, మండల స్థాయిలో వైసీపీ బలమెంతో బేరీజు వేసుకునే అవకాశాన్ని జగన్ కోల్పోయినట్లంది. పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించామని చెప్పుకుంటున్నప్పటికీ, అసలు గ్రౌండ్ లెవెల్ లో తన పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలిసేది. కానీ జగన్ కు పరిషత్ ఫలితాలు చూసి అంతా పచ్చగానే కన్పిస్తుంది. అందుకే విపక్షాలు పోటీ చేసేలా వాతావరణం సృష్టించి ఉంటే వాస్తవ పరిస్థితి తెలిసి ఉండేదని వైసీపీ నేతలే అంటుండటం విశేషం.

Tags:    

Similar News