తప్పించుకోవడం అసాధ్యమట

జగన్ కేసుల విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో తీర్పు ముందే చెబుతున్నారు. ఆయన ఆర్ధిక మంత్రి కదా న్యాయం గురించి ఏమి తెలుసు [more]

Update: 2020-01-26 03:30 GMT

జగన్ కేసుల విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో తీర్పు ముందే చెబుతున్నారు. ఆయన ఆర్ధిక మంత్రి కదా న్యాయం గురించి ఏమి తెలుసు అనుకుంటారు. యనమల పూర్వాశ్రమంలో అంటే రాజకీయాల్లోకి రానపుడు న్యాయవాదిగా పనిచేశారు. ఆ సంగతి అలా ఉంటే అక్రమాస్తుల కేసులో జగన్ మెడకు పూర్తిగా ఉచ్చు బిగుసుకునే ఆధారాలు ఉన్నాయని యనమల అంటున్నారు. ప్రత్యర్ధి పార్టీకి చెందిన నేతగా ఈ విమర్శలు తేలికగా తీసుకున్నా ఆయన లా పాయింట్లు తీసి మరీ చెబుతూంటే వైసీపీ వర్గాల్లో కలవరం చెలరేగుతోంది.

మనీ లాండరింగ్…

జగన్ కేసులో మనీ లాండరింగ్ పై ఆధారాలు పక్కాగా ఉన్నాయని, మిగిలినవి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ఆయన దొరికిపోతారని యనమల న్యాయ నిపుణుడిగా చెప్పేస్తున్నారు. జగన్ కేసుల్లో ట్రయల్ విచారణ మొదలు అయితే అపుడు ముఖ్యమంత్రికి ఊపిరి కూడా ఆడదని ఆయన అంటున్నారు. జగన్ అపుడు కోర్టు బోనులోనే కాలక్షేపం చేయాలని కూడా రేపటి సీన్ ని కూడా వైసీపీ కళ్ళ ముందు పెడుతున్నారు. జగన్ కేసులో దాఖలు చేసిన పదకొండు చార్జిషీట్లలో ఆధారాలు గట్టిగానే ఉన్నాయని యనమల అంటున్నారు.

జైలు గోల…..

ఇక ఎప్పటి మాదిరిగానే జగన్ జైలుకు పోతారని కూడా యనమల జోస్యం చెబుతున్నారు. ట్రయల్ విచారణ మొదలై వేగవంతంగా సాగితే జగన్ జైలు కి అంతే తొందరగా వెళ్ళడం ఖాయమని ఆయన అంటున్నారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని మరో టీడీపీ నేత వర్ల రామాయ్య కూడా వల్లే వేస్తున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ని ఆర్ధిక ఉగ్రవాదిగా చిత్రీకరించారు. జగన్ తో పాటు వైసీపీ మొత్తంగా ఉన్న వారంతా కరడు కట్టిన నేరస్థులేనని బాబు గట్టిగానే నోరు చేసుకుంటున్నారు.

అన్నీ అనుమానాలే?

మరో వైపు జగన్ కేసులలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు ఉండదని, కుదరదని చెబితే వారెంట్ కూడా జారీ చేస్తామని చెప్పడంతో వైసీపీలో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోతోంది. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయిదు కోట్ల మంది ప్రజల ప్రతినిధి ఆయన. ఆయన్ని బోనెక్కించడం అంటే ప్రజలకు కూడా అవమానమే. పైగా ఎన్నో కేసుల్లో ఇటువంటి వెసులుబాటు ఉంది. కానీ జగన్ పెట్టుకుంటున్న అభ్యర్ధనలను పదే పదే కొట్టేయడం చూస్తూంటే కేసు విషయంలో కొత్త డౌట్లు వస్తున్నాయి. ఇక ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అన్నది తెలిసిందే. సీబీఐ పనితీరు కూడా కేంద్ర పెద్దల ఆధీనంలో ఉంటుంది. జగన్ విషయంలో ఏం జరగాలన్నా కూడా కేంద్రం చూపు ఉండాల్సిందేనని అంటున్నారు. జగన్ కేసుల విషయంలో వ్యక్తిగత హాజరుపై మరీ ఇంతలా సీబీఐ విభాగం పట్టుపట్టడం, ఈడీ సైతం హాజరు కాక తప్పదని అనడం బట్టి చూస్తూంటే తెర వెనక ఏదో జరుగుతోందని వైసీపీ వర్గాల్లో డౌట్లు ఉన్నాయి. దానికి తోడు అన్నట్లుగా టీడీపీ నేతల మాటల దాడులు, భవిష్యత్తు తీర్పులు ఇవన్నీ కలసి ఏపీలో 2020 ముగిసే లోపు ఏదైనా జరుగుతుందా అన్న అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

Tags:    

Similar News