అందుకే జగన్ ను ఇలా….?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వంద రోజులు గడచిపోయాయి. అయిదు కోట్ల ప్రజలు ఏపీలో ఉన్నారు. ప్రభుత్వం అన్నాక ప్రజలకు చాలానే చేస్తుంది, అయినా ఎక్కడో [more]

Update: 2019-09-13 02:00 GMT

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వంద రోజులు గడచిపోయాయి. అయిదు కోట్ల ప్రజలు ఏపీలో ఉన్నారు. ప్రభుత్వం అన్నాక ప్రజలకు చాలానే చేస్తుంది, అయినా ఎక్కడో ఓ చోట సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ విచిత్రంగా జగన్ పాలనలో ఒక్క ప్రజా సమస్య కూడా ప్రతిపక్ష టీడీపీకి కనిపించడంలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. తెల్లారిలేస్తే జగన్ ని తిట్టే టీడీపీ అధినేత తన వంద రోజుల విపక్ష నేత పాత్రలో ఒక్క సమస్యనూ గుర్తించలేకపోయారా అనిపిస్తుంది. చంద్రబాబు చేస్తున్న విమర్శలు, చేపడుతున్న ఆందోళనలూ చూస్తే జగన్ బాగానే పాలిస్తున్నట్లుగా అనుకోవాలి. వైసీపీ వాళ్లు చెప్పుకుంటున్నట్లుగా అద్భుతమైన రాజ్యంగానే భావించాలి.

బాబు పోరాటమంతా అక్కడే….

జగన్ గెలిచాడనగానే చంద్రబాబు తన పార్టీ వారితో అన్న మాట ఒకటి ఉంది. జగన్ మీద ఎంత మోజు లేకపోతే 151 అసెంబ్లీ సీట్లు ఇస్తారు, అందువల్ల జగన్ విషయంలో ఇపుడే తొందరపడి విమర్శలు చేయవద్దు కనీసంగా ఆరు నెలల సమయం ఇద్దామని బాబు చెప్పినట్లుగా కూడా ప్రచారం జరిగింది. తమ్ముళ్ళు కూడా మేము ఆరు నెలలు టైం ఇద్దామనుకున్నామని చెప్పుకొచ్చేవారు. మరి అంతలోనే యూ టర్న్ తీసుకుని జగన్ మీద నిప్పులు కక్కడం వెనక కారణాలేంటని ఆలోచిస్తే అన్నీ కూడా ఫక్తు రాజకీయ పరమైనవే ననిపిస్తాయి. ప్రతిపక్ష నేతగా బాబు జగన్ కి రాసిన తొలి లేఖ ప్రజా వేదికను తనకు అధికార నివాసంగా ఇమ్మని. ఇక ఆ తరువాత పోలవరం విషయంలో అవినీతి వెలికి తీస్తామంటే కాంట్రాక్టర్ల వైపు నిలబడి టీడీపీ అల్లరి చేసింది. ఇక అమరావతి రాజధాని విషయానికి వచ్చేసరికి అక్కడ తన సొంత సామాజిక వర్గం, తమవారుకున్న వారి ప్రయోజనాల కోసమే అన్నట్లుగా పెద్ద గొంతు చేసుకుంది ఇక చలో ఆత్మకూరు ఆందోళన తీసుకున్నా పూర్తిగా రాజకీయమే తప్ప ఒక్క ప్రజాసమస్య కూడా కనిపించదంటున్నారు.

ప్రజల కోసం నిలబడదా…?

ప్రతిపక్షం అన్న తరువాత ప్రజల కోసం నిలబడి పనిచేయాలి. ప్రభుత్వం చేసిన తప్పులను నిర్మాణాత్మకమైన విధానంలో ఎత్తిచూపాలి. టీడీపీ వ్యవహారం అలా లేదు, జగన్ రావడంతోనే అభద్రతాభావంతోనే ఆ పార్టీ ఉంది. అదే ఆ పార్టీ ప్రతి కదలికలోనూ కనిపిస్తూ వస్తోంది. వంద రోజుల జగన్ పాలనకు టీడీపీ సున్నా మార్కులు వేస్తే మరి విపక్ష పాత్రకు జనం ఎన్ని మార్కులు ఇవ్వాలో తమ్ముళ్లే చెప్పాలి. జగన్ పాలనాపరంగా రివర్స్ అంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీ నాయకులు నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన, వరసగా హామీలను నెరవేర్చిన తీరు, నాణ్యమైన బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే ప్రయత్నాల విషయంలో మంచి చెడ్డల పైన చర్చిస్తే బాగుండేది. ప్రజల సమస్యలపైన ఉద్యమిస్తే మద్దతు దొరుకుతుంది కానీ వారికి దూరంగా జరిగి రాజకీయ పోరాటాలు చేస్తే అది టీడీపీకి ఎంతవరకు మేలు అన్న చర్చ కూడా వస్తోంది. అదే సమయంలో ఏపీలో ప్రజా సమస్యలు లేవని, అందుకే టీడీపీ ఇలా గొడవ చేస్తోందన్న వైసీపీ మాటలనే టీడీపీ నిజం చేసేలా ఉంది.

Tags:    

Similar News