Ys jagan : ఇద్దరు నానిలకు గండం లేదట.. రీజన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్దమయ్యారు. ఈ మంత్రివర్గ విస్తరణ సంక్రాంతికి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్ లెక్క ప్రకారం [more]

Update: 2021-09-26 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్దమయ్యారు. ఈ మంత్రివర్గ విస్తరణ సంక్రాంతికి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్ లెక్క ప్రకారం వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. అయితే మరో మూడు నెలల పాటు దీనిని జగన్ వాయిదా వేశారు. కొత్త ఏడాది సంక్రాంతి పండగ సమయంలో నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది.

మొత్తం మార్చేస్తామన్నా….

అయితే ఈసారి వంద శాతం మంత్రులను మార్చబోతున్నట్లు సంకేతాలను బయటకు పంపారు. కానీ ఇది సాధ్యం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి మినహాయింపు ఉంటుందని పార్టీ కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. వీరిలో కీలకమైన శాఖలు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత ఇష్టులు కేబినెట్ లో ఉండే అవకాశముందని తెలుస్తోంది. తనకు బంధువైన బాలినేని శ్రీనివాసులురెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించినా, కొందరిని మాత్రం జగన్ కంటిన్యూ చేసే అవకాశముంది.

కొడాలి నానికి ప్రత్యామ్నాయంగా….

కొడాలి నాని విషయమే తీసుకుంటే ఆ సామాజికవర్గంలో సరైన నేత వైసీపీ లో లేరు. ప్రత్యర్థి పార్టీపై విరుచుకుపడటం, జగన్ కు దన్నుగా ఉండటం వంటివి కొడాలి నానికి ప్లస్ పాయింట్. మంత్రిగా కొడాలి నాని సక్సెస్ అయ్యారా? లేదా? అన్నది పక్కన పెడితే కమ్మ సామాజికవర్గం నేతగా వైసీపీ క్యాడర్ లో నానిది ప్రత్యేక స్థానం. ఆయనను తప్పించి వేరే అదే సామాజికవర్గం నేతకు ఇవ్వాలన్నా సరైన నేత కన్పించడం లేదు.

పేర్ని అవసరం…..

ఇక కాపు సామాజికవర్గానికి సంబంధించి కూడా ఒకరిద్దరు మంత్రులు జగన్ కేబినెట్ లో కొనసాగే అవకాశముంది. ఇందులో పేర్ని నాని వంటి వారి పేర్లు విన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ వంటి వారి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే పేర్ని నాని వంటి వారిని కంటిన్యూ చేయక తప్పదంటున్నారు. మొత్తం మీద జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టినా ఇద్దరు నానిలకు మాత్రం గండం లేదని పార్టీలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News