వై”ఎస్” కు నో చెబుతున్నట్లేగా?

జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడే కానీ ఆయన పోకడలు మాత్రం అచ్చం ఎన్టీయార్ లాగానే ఉంటాయి. అన్న గారి ఆవేశం, మాట తప్పని నైజం. జనంతోనే డైరెక్ట్ [more]

Update: 2020-01-24 03:30 GMT

జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడే కానీ ఆయన పోకడలు మాత్రం అచ్చం ఎన్టీయార్ లాగానే ఉంటాయి. అన్న గారి ఆవేశం, మాట తప్పని నైజం. జనంతోనే డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకోవడం, కుటిల రాజకీయాలకు దూరంగా ఉండడం. విలువలు పాటించడం వంటివి చూసుకున్నపుడు అన్న గారే కనిపిస్తారు. ఇక ఒక నిర్ణయం తీసుకున్నపుడు ముందూ వెనకా ఆలోచన చేయకుండా ఉండడం కూడా అన్న గారికి అలవాటు. అదే ఇపుడు జగన్ లోనూ కనిపిస్తోంది. అందుకే ఇపుడు జగన్ కూడా అన్న గారి బాటలోనే సాగుతున్నారు.

మండలి రద్దు…..

నిజానికి మండలి రద్దు అన్నది ఒక సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. నాడు ఎన్టీఆర్ అధికారంలోకి బంపర్ మెజారిటీతో వచ్చారు. పక్కనే మండలి ఉండేది. అది మహామహులైన కాంగ్రెస్ పెద్దలతో నిండా నిండిపోయింది. ఎన్టీయర్ విప్లవాత్మకమైన నిర్ణయాలు కొన్ని నాడు తీసుకున్నారు. వాటి విషయంలో చర్చ సాగేది. మండలిలో అడ్డుపుల్లలు వేయడమే కాదు, ఎన్టీఆర్ని గట్టిగానే విమర్శించేవారు. అక్కడ రాజకీయ ఉద్దండుడు రోశయ్య ఉండేవారు. ఆయన అయితే చెడుగుడు ఆడుకునేవారు. దాంతో అన్న గారు ఒకటే అనుకున్నారు. ఈ మండలి మనకు వద్దు అని. అది ఆనాడు గొప్ప నిర్ణయంగా మారింది. అనేక రాష్ట్రాలు సైతం దాన్ని అనుసరించాయి.

జగన్ రూటూ అటే …..

ఇపుడు జగన్ సైతం మండలి రద్దు గురించే ఆలొచన చేస్తున్నారు. అక్కడ చూస్తే టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. వారంతా అసెంబ్లీలో జరిగిన ప్రతీదానికీ గట్టి రిప్లై ఇస్తున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఏ రూలింగ్ ఇస్తే దాన్ని మండలి చైర్మన్ తో ఇప్పిస్తున్నారు. అసెంబ్లీలో బాబుని ఏ మాటలు అంటే మండలిలో అవే మాటలు రిపీట్ చేస్తున్నారు. అసెంబ్లీలో అవును అను ప్రభుత్వం అంటే మండలిలో కాదు అంటున్నారు. అలా కీలక‌మైన బిల్లులను ఇప్పటికే మండలి పంపించడం జరిగింది. అందులో ఇంగ్లీష్ మీడియం బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు వేరు కమిషన్లు ఏర్పాటు చేసే బిల్లులు ఉన్నాయి. దాంతో కొన్నాళ్ళ క్రితమే మండలి రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి.

బడ్జెట్ సెషన్లోనే …..

ఇక మండలి రద్దు చేయడం ద్వారా జగన్ తాను అనుకున్నది సాధించానని చెప్పుకోవడానికి వీలు అవుతుంది. పైగా రాజకీయ ఘర్షణలకు చెక్ పెట్టినట్లవుతుంది. ఫిబ్రవరి లో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదలవుతోంది. ఆ టైం కి అసెంబ్లీ రద్దు తీర్మానం పంపించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అదే కనుక జరిగితే ఉభయసభల్లో చర్చకు వస్తాయి. బీజేపీ ఈ రద్దుకు అనుకూలమని వినిపిస్తోంది. దాంతో దాదాపుగా కొద్ది నెలల్లోనే మండలి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తన తండ్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన మండలిని తనయుడిగా జగన్ రద్దు చేసి కొత్త చరిత్రను సృష్టించిన వారు అవుతారు.

Tags:    

Similar News