మండలిని పీకేద్దామా?

శాసనమండలిలో నిన్న జరిగిన పరిణామాలు తనను కలచి వేశాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆమోదించిన చట్టాన్ని [more]

Update: 2020-01-23 12:35 GMT

శాసనమండలిలో నిన్న జరిగిన పరిణామాలు తనను కలచి వేశాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆమోదించిన చట్టాన్ని బలంతో శాసనమండలిలో అణిచివేశారన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ బిల్లులను సెలెక్ట్ కమిటీ పంపారని జగన్ అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. అయినా శాసనమండలిని వాడుకుంటూ ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.

ప్రజలు ఆశీర్వదించారు…..

నిన్న శాసనమండలిలో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసునన్నారు. మండలి చట్ట బద్దంగా వ్యవహరిస్తుందని తాను నమ్మానన్నారు. ఏదైనా శాసనసభలో ఆమోదించిన బిల్లులను ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలి కాని, సెలెక్ట్ కమిటీకి పంపడం వెనక దురుద్దేశం దాగుందని జగన్ అన్నారు. తమను 151 స్థానాల్లో ప్రజలు గెలిపించారని తెలిపారు. తాము పాలకులుగా కాకుండా సేవకులగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన మండలి ప్రజోపయోగమైన బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు.

విచక్షణాధికారాన్ని ఇలా…..

ీఈ సందర్భంగా శాసనసభలో నిన్న మండలిలో ఛైర్మన్ షరీఫ్ చేసిన 11 నిమిషాల ప్రసంగపు వీడియోను ప్రదర్శించారు. ఛైర్మన్ విచక్షణాధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే అంగీకరించానని ఒప్పుకున్నారన్నారు. చట్టాన్ని బలోపేతం చేసేందుకే విచక్షణాధికారిని వినియోగించుకోవాలన్నారు. తనకు సంబంధంలేని సభలోని గ్యాలరీలో కూర్చుని చంద్రబాబు ఆదేశాలిచ్చారన్నారు. ఓడిన నాయకుడి ప్రయోజనాలు, ఇష్టాలను బట్టి శాసనమండలి నడుస్తుందన్నారు. లేని అధికారాన్ని ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. తప్పులను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ఈ మండలిని చూస్తుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టలేదనిపిస్తోంది. ఆ తప్పులు చేయకుండా ఆపాలా? వద్దా? చెప్పాలన్నారు.

ఏడాదికి అరవై కోట్లు….

రాష్ట్రాల్లో మండలి వద్దని గతంలో అనేక మంది చెప్పారన్నారు. ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్నారు. ఈ పేద రాష్ట్రానికి ఖర్చుతో కూడిన మండలి అవసరమా? అని ప్రశ్నించారు. శాసనమండలి కోసం ఏడాదికి అరవై కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మేధావులు ఆ సభలో ఉంటారనుకుంటే శాసనసభలోనే ఇంజినీర్లు, మాజీ ఐఏఎస్ లు, డాక్టర్లు, జర్నలిస్టులు, రైతులు, యాక్టర్లు ఉన్నారన్నారు. మంచి చేయడం కోసం తమ ఆలోచనలను పెట్టకుండా, ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి? ఎలా జాప్యం చేయాలి? అని రూల్స్ ను అతిక్రమిస్తున్న మండలిని కొనసాగించడం అవసరమా? అనిపిస్తోందన్నారు జగన్.

సీఎం ఎక్కడ ఉంటే…

రాజ్యాంగంలో రాజధాని అనే పదవి లేదన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి కూర్చునైనా పాలన చేయవచ్చన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే చాలన్నారు. చట్టంలో లేకున్నా నైతిక విలువలు మర్చిపోయి ఇదంతా చేస్తున్నారో వారిని వారు ప్రశ్నించుకోవాలన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? అన్నది అనుమానమేనని అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్న ఈ శాసనమండలిని కొనసాగించాలా? లేదా? అన్నది ఆలోచించాలి. దీనిపై అసెంబ్లీలో చర్చించి కొనసాగంచాలా? లేదా? అన్నది నిర్ణయిద్దామన్నారు. సోమవారం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని సీఎం జగన్ స్పీకర్ ను కోరారు.

Tags:    

Similar News