జగన్ ఒపిక పడితేనే మేలట

వైఎస్ జగన్ సర్కార్ కి ఇపుడు అడుగడుగునా శాసనమండలిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి అయినంతవరకూ జగన్ కి మండలి మీద ప్రత్యేకమైన ద్వేషం ఏమీ లేదు. [more]

Update: 2020-01-22 12:30 GMT

వైఎస్ జగన్ సర్కార్ కి ఇపుడు అడుగడుగునా శాసనమండలిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి అయినంతవరకూ జగన్ కి మండలి మీద ప్రత్యేకమైన ద్వేషం ఏమీ లేదు. తన పార్టీలో కష్టపడిన వారిని ఎమ్మెల్సీలు చేస్తానని ఆయన పలు ఎన్నికల సభల్లో హామీలు కూడా ఇచ్చారు. ఓ విధంగా రాజకీయ పునరావాసం మండలి అన్నది వైసీపీ, టీడీపీ రెండూ కూడా భావించి వాడుకుంటున్నాయి. అయితే 2014లో విభజన తరువాత ఏపీకి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు కావడం, అప్పటికి మండలిలో కాంగ్రెస్ కి, టీడీపీకే బలం ఉండడంతో ఆయనకు అన్ని విధాలుగా అనుకూలించింది. కాంగ్రెస్ సైతం పెద్దగా ఇబ్బందులు పెట్టలేదు.

సీన్ రివర్స్ ….

ఇపుడు మాత్రం వైసీపీ, టీడీపీల మధ్య ఉప్పూ, నిప్పూ అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. దాంతో మండలికి గత ఎనిమిది నెలల కాలంలో ఒకే ఒకమారు జగన్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారంటేనే ఆయన ఆ వైపు చూసేందుకు ఎంతలా ఇష్టపడడంలేదో అర్ధమైపోతుంది. మండలిలో 2014 నుంచే వైసీపీ బలం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికి అక్కడ టీడీపీ ఎమ్మెల్సీలు 32 మంది అయితే వైసీపీకి చెందిన వారు 9 మంది ఉన్నారు. మార్చిలో మండలికి ఎన్నికలు ఉన్నాయి. దాంతో మరో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ నుంచి వైసీపీ గెలుచుకుంటుంది. దాంతో వైసీపీ బలం 13కి చేరుకుంటే టీడీపీ బలం 27కి పడిపోతుంది.

రెండేళ్ళలో సరి….

ఇక మరో రెండేళ్ళు అంటే 2022 నాటికి జరిగే మండలి ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ వస్తుంది. అప్పటికి లోకేష్ సహా, టీడీపీ సీనియర్లు అంతా ఇంటి దోవ పడతారు. వైసీపీకి ఎటూ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఒక్క సీటు కూడా టీడీపీకి రాని పరిస్థితి ఉంది. ఇక లోకల్ బాడీ ఎన్నికల ద్వారా నెగ్గే ఎమ్మెల్సీలు కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. గవర్నర్ ద్వారా నామినేట్ చేయించుకునే ఎమ్మెల్సీలు అధికార పార్టీకే ఉంటారు. మొత్తంగా చూస్తే ఇపుడు ఇబ్బంది పడుతున్నా కూడా రేపటి రోజుల అసెంబ్లీలో ఉన్న బంపర్ మెజారిటీతో వైసీపీకే శాసనమండలిలో మంచిరోజులు వస్తాయని అంటున్నారు.

భరించాలి మరి….

అయితే అప్పటివరకూ టీడీపీ బలాన్ని మండలిలో వైసీపీ సహనంతో భరించాలి. కానీ కీలకమైన బిల్లులను జగన్ అసెంబ్లీలోకి తెస్తున్నారు. అవన్నీ కూడా గతంలో టీడీపీ చేసిన వాటిని రద్దు చేస్తూ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు కావడంతో సహజంగానే ఆ పార్టీ మండలిలో వ్యతిరేకిస్తుంది. మరో వైపు ఎటువంటి సామరస్య వాతావరణమూ ఈ రెండు పార్టీల మధ్య లేదు, ఉండదు కూడా. దానికి తోడు లోకేష్ వంటి వారిని మండలిలో చూసేందుకు జగన్ ఇష్టపడడంలేదని అంటున్నారు. మరి నాడు అన్న గారు ఎన్టీయార్ మాదిరిగా మండలిని రద్దు చేస్తే జగన్ కి టెంపరరీగా తలనొప్పి తగ్గవచ్చుని కానీ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి, నమ్మి వచ్చిన నాయకులకు పదవులు ఇవ్వడానికి వీలుండదు. మరి బంగారం లాంటి అవకాశం కోసం ఎదురుచూస్తారో లేక వేటు వేస్తారో జగనే తేల్చుకోవాలని అంటున్నారు.

Tags:    

Similar News