కడప గడప దాటకుండానే… ?

బీజేపీ అంటే ఏంటో దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. బీజేపీ విషయంలో ఒక కధ చెబుతారు. అరేబియన్ ఒంటె గుడారంలో తలదాచుకుందామని చోటు అడిగి [more]

Update: 2021-08-05 03:30 GMT

బీజేపీ అంటే ఏంటో దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. బీజేపీ విషయంలో ఒక కధ చెబుతారు. అరేబియన్ ఒంటె గుడారంలో తలదాచుకుందామని చోటు అడిగి మొత్తం ఆక్రమించినట్లుగా బీజేపీ తీరు ఉంటుందని కూడా అంటారు. ఉత్తరాది పార్టీగా ఉన్న బీజేపీని కర్నాటకలో అధికారం దక్కేలా చేసిన అనేక అంశాలలో టిప్పు సుల్తాన్ ఉదంతం కూడా అతి ముఖ్యమైనది. ఇపుడు ఆ టిప్పుని అడ్డం పెట్టుకుని ఏపీలో రాజకీయ తుప్పు రేపాలని చూస్తున్న కమలానికి చాలా తెలివిగా జగన్ చెక్ పెట్టేశారు.

సొంత గడ్డ మీదనే …?

జగన్ ఇలాకాగా చెప్పబడుతున్న కడప గడపలోనే బీజేపీ ఈ సాహసానికి ఒడికట్టింది. మైనారిటీలు, మెజారిటీ వర్గీయులు అంటూ విభజన రేఖను గీస్తూ భారీ పొలిటికల్ స్కెచ్ గీసింది. ఒక వైపు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా కేవలం దీని మీదనే బీజేపీ దృష్టి పెట్టి హడావుడి చేసింది. ఏపీలో పవర్ పట్టేలా ఎంట్రీకి కడపను గేట్ వేగా చేసుకోవాలనుకుంది. అయితే ధీటుగా వైసీపీ కూడా బదులిచ్చినా జగన్ మాత్రం దీన్ని కొనసాగించాలనుకోలేదు. బీజేపీ సంగతి తెలిసిన వారుగా ఆయన కాషాయం ఆటలు సాగనీయరాదు అనే తీర్మానించుకున్నారు. అందుకే టిప్పు విగ్రహానికి లేదు చోటు అనిపించేశారు.

కష్టమైనా …?

బీజేపీకి హిందూత్వ నినాదం చాలా ఇష్టం. అయితే ఏపీలాంటి చోట్ల అలాంటి ఎత్తులు పారడం కష్టం. అయినా సరే బీజేపీ తన ప్రయత్నాలను తాను చేస్తోంది. ఏపీలో ఇతర అంశాల మీద మాట్లాడితే ప్రతీ దాంట్లోనూ బీజేపీ తప్పుని జనాలు వెతుకుతారు. వీటన్నిటి కంటే కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్న కోపం ఏపీ నిండా ఉంది. దాంతో బీజేపీ ఈ షార్ట్ కట్ విధానాన్నే నమ్ముకుంటోంది. అయితే అక్కడ ఉన్న జగన్ మాత్రం ఇలాంటి వాటికి చాకచక్యంగా ఆదిలోనే అడ్డుకట్ట వేసేస్తున్నారు.

విజయమేనా ..?

కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు కాకుండా అడ్డుకున్నామని, ఇది తమ విజయమని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పైకి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం తమ ఎత్తులు పారలేదన్న బాధ ఉండే ఉంటుంది అంటున్నారు. ఏపీలో హిందూత్వ రాగాలు తీయడానికి అసలు ఒప్పనని వైసీపీ అధినాయకత్వం గట్టిగానే నిర్ణయించుకుంది. ఈ నేపధ్యంలో బీజేపీకి ఆదిలోనే ఇలా అతి పెద్ద చెక్ పడిపోయింది అనే చెప్పాలి.

Tags:    

Similar News