అయితే మాకేంటి…?

జగన్ తాను అనుకున్నది సాధించారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉంటే అభివృధ్ధి సాగుతుందని, ప్రాంతీయ వైష‌మ్యాలు తలెత్తవని జగన్ ఊహించి చేసిన ఈ కొత్త ప్రయోగం [more]

Update: 2020-01-22 02:00 GMT

జగన్ తాను అనుకున్నది సాధించారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉంటే అభివృధ్ధి సాగుతుందని, ప్రాంతీయ వైష‌మ్యాలు తలెత్తవని జగన్ ఊహించి చేసిన ఈ కొత్త ప్రయోగం ఆచరణకు రానుంది. ఇంతకాలం ఆలోచనల్లో ఉన్న మూడు రాజధానులు ఇకపై కార్యాచరణలో కనిపిస్తాయి. అంటే ఈ వాదనలో వాస్తవమెంత అన్న పరీక్షకు అవి సిధ్ధమవుతాయన్నమాట. నిజానికి మూడు రాజధానుల కాన్సెప్ట్ వినడానికి బాగున్నా అమలు అంత ఈజీయేనా అన్న మాట కూడా ఉంది. ఒక్క రాజధానికే దిక్కులేదు, మూడా అంటూ విపక్షం ఎకసెక్కం ఆడుతున్న నేపధ్యంలో తాను చేసింది రైటూ అని జగన్ నిరూపించుకోవాల్సివుంది.

విశాఖ వైపు….

విశాఖవాసులు చిత్రమైనవాళ్ళు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఆదరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చేస్తారు. తాము ఎప్పటికీ పాలితులమేనని అనుకుంటారు. అంత విశాల హృదయం విశాఖది. అయితే వారు అభివృధ్ధిని కోరుకుంటారు కానీ మరీ అందరాని చందమామలను తీసుకురావాలని ఎపుడూ అడగలేదు. మరి అడగని వరాన్ని జగన్ ప్రసాదించారు. ఏకంగా రాజధాని హోదా ఇచ్చేశారు. రాజధాని వస్తే మాకేంటి అన్న సామాన్యుడి సణుగుడు అపుడే మొదలైంది. మధ్యతరగతి మీద ధరాభారం, అద్దెల మోత కూడా భయపెడుతోంది. ఇక భూములున్న వారు కబ్జాలవుతాయని హడలుతున్నారు. వీటన్నిటినీ వైసీపీ సర్కార్ అర్ధం చేసుకుని పరిష్కరించాలి. సామాన్యుడి రాజధాని విశాఖ అనిపించేలా జగన్ పాలన ఉండాలి.

గీటురాయిగా….

ఇక రాజకీయంగా చూసుకుంటే జగన్ చేసిన నిర్ణయం ఎంత కరెక్ట్ అన్నది తేల్చేందుకు జీవీఎంసీ ఎన్నికలు సిధ్ధంగా ఉన్నాయి. జగన్ రాజధాని ఇలా మార్చిన వెంటనే అలా జరుగుతాయి. అంటే ముఖ్యమంత్రి ఉన్న చోట, మంత్రులు కొలువైన చోట, పాలన సాగుతున్న నగరంలో అధికార పార్టీ కచ్చితంగా జెండా ఎగరేయాలి. జీవీఎంసీ పీఠం వైసీపీ పరం అవాల్సిన అవసరం ఇపుడు కచ్చితంగా ఉంది. టీడీపీకి ఓడినా ఫ‌రవాలేదు కానీ వైసీపీకి గెలవడం అన్నది జీవన్మరణ పరీక్ష. మరి దాని సాధించేందుకు జగన్, ఆయన మంత్రులు ఇప్పటినుంచే కృషి చేయాలి. ఆ దిశగా అడుగులు పడినపుడే రాజకీయంగా జగన్ కి మేలు జరుగుతుంది. విశాఖ వారు రాజధానిని పూర్తిగా స్వాగతించినట్లవుతుంది.

బాగా విస్తరించాలి….

ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా వెనకబడిపోయాయి. ఇక్కడ అభివృధ్ధి అన్న ఊసే లేదు. విశాఖ నగరం ఇంతలా ప్రగతిపధంలో దూసుకుపోతున్నా కూడా తలసరి ఆదాయంలో ఈ రెండు జిల్లాలూ దారుణంగా ఉన్నాయి. రాజధాని వస్తే ఉత్తరాంధ్రా బాగుపడుతుందని ఆశపడిన వారి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత పూర్తిగా వైసీపీ సర్కార్ మీద ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిలాల అభివ్రుధ్ధికి అచ్చంగా యాభై వేల కోట్లు అవసరం అవుతాయని మేధావులు తేల్చారు. లక్ష కోట్లు ఖర్చు భరించలేకనే విశాఖ వైపు చూసిన జగన్ కి ఇపుడు ఇంత డబ్బు ఖర్చు అన్నది అధిక భారమే. ఏదో తమకు షెల్టర్ జోన్ గా విశాఖ ఉందని భావనతో కాకుండా దశలవారీగానైనా ఉత్తరాంధ్ర అభివృధ్ధికి గట్టి ప్రణాళికలు వేసుకున్నపుడే జగన్ విజయం సాధించినవారు అవుతారని అంటున్నారు.

Tags:    

Similar News