తరతరాలు…గుర్తుండిపోయేలా

చరిత్ర సృష్టించే అవకాశం చాలా కొద్దిమందినే దక్కుతుంది. ఎందుకంటే కాలం అనంతం. అందులో మానవ జీవితం అనల్పం. ఏ రంగంలోనైనా చిరకాలం గుర్తిండిపోవడం బహు కష్టం. అయితే [more]

Update: 2020-01-21 05:00 GMT

చరిత్ర సృష్టించే అవకాశం చాలా కొద్దిమందినే దక్కుతుంది. ఎందుకంటే కాలం అనంతం. అందులో మానవ జీవితం అనల్పం. ఏ రంగంలోనైనా చిరకాలం గుర్తిండిపోవడం బహు కష్టం. అయితే కొన్ని సాహస నిర్ణయాలు తీసుకున్నపుడు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తరతరాలూ చెప్పుకునేలా ఉంటే వాటి వెనక కారకులకు కూడా ఆ కీర్తి లభిస్తుంది. అది ఆచంద్రతారార్కం అవుతుంది. వయసులో చిన్న అయినా జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అలాంటిదే. ఇక జగన్ విశాఖను రాజధానిగా చేయాలని సంకల్పించినపుడు ఎన్నో అవరోధాలు. ఓ విధంగా అతి పెద్ద యుధ్ధాన్నే ఆయన చేశారు. అయినా తాను అనుకున్నది చేసి చూపించారు.

కరెక్ట్ చాయిస్….

ఓ సందర్భంలో చంద్రబాబు కూడా అనుకోవాల్సి రావచ్చు. విశాఖను తాను ఎలా విస్మరించానని, కళ్ళ ముందు ఏకైక అభివృధ్ధి చెందిన నగరంగా ఉంటే తాను ఎందుకు విశ్వామిత్ర సృష్టి చేసేందుకు వెంపర్లాడానని, రెడీ మేడ్ నగరంగా ఉన్న విశాఖనే తాను ఎంపిక చేసుకుని ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గెలిచేవాడినేనో అని కూడా చంద్రబాబు భావించే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే టీడీపీకి ఎటూ కోస్తా జిలాలు పట్టుకొమ్మలు. అందువల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా కంచుకోటగా ఉన్న క్రమంలో ఇక్కడే రాజధాని చేసి సీమకు హైకోర్టు కేటాయిస్తే మొత్తం రాష్ట్రం ఆయన ఆధీనంలో ఉండేది. ఆ పని జగన్ ఇపుడు చేసి కరెక్ట్ ఛాయిస్ విశాఖ రాజధాని అనిపించుకున్నారు.

ఎంత ఎదిగితే….

విశాఖ విషయం చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఈ నగరానికి మరిన్ని హంగులు సమకూర్చితే చాలు. అభివృధ్ధి పరుగులే పెడుతుంది. దాంతో విశాఖ ఎంత ఎదిగినా కూడా ఆ మొత్తం క్రెడిట్ ఇపుడు జగన్ ఖాతాలోనే పడుతుంది. అదే ఆయన‌కు మరో నాలుగున్నరేళ్ళ తరువాత జరిగే ఎన్నికల్లో కూడా చెప్పుకోవడానికి ఒక ఆయుధంగా మారుతుంది. విశాఖకు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఓ విధంగా దీని వెనక రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా కూడా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం విశాఖతో పాటు ఆయన్ని కూడా అగ్ర భాగాన నిలబెట్టేదేనని అంటున్నారు.

వెనకబడిన చోట…

ఉత్తరాంధ్రా జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయి. ఇక్కడ వెనకబాటుతనం నుంచి పుట్టుకువచ్చిన మావోయిస్ట్ ఉద్యమాలు కూడా చరిత్రలో ఉన్నాయి. అటువంటి చోట అభివృధ్ధిని చూపించడానికి విశాఖ రాజధాని ఉపయోగపడుతుందని మేధావులు కూడా అంటున్నారు. ఉత్తరాంధ్రకు విశాఖ ముఖద్వారంగా ఉంది. దాంతో ఈ ప్రాంతంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా ఎదుగుతాయని అంటున్నారు. ఇలా వెనకబడిన ప్రాంతాలకు ఆలంబనగా నిలిచిన జగన్ రాజధాని నిర్ణయం మాత్రం చరిత్రలో నిలిచిపోయేదేనని అంటున్నారు. ఎన్ని కొత్త పేజీలు వచ్చి చేరినా కూడా జగన్ కంటూ ఒక పేజీని ఉండేలా చేసేది ఈ నిర్ణయం అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News