జగన్ కే నష్టమట

ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ సమీకరణలు చివరికి జగన్ కే నష్టం చేకూరుస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారుట. అదే ఆయన తమ్ముళ్ళకు కూడా చెబుతున్నారుట. జనసేనతో [more]

Update: 2020-01-23 14:30 GMT

ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ సమీకరణలు చివరికి జగన్ కే నష్టం చేకూరుస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారుట. అదే ఆయన తమ్ముళ్ళకు కూడా చెబుతున్నారుట. జనసేనతో బీజేపీ పొత్తు వల్ల టీడీపీకి ఇబ్బంది అని బెంగపడనవసరం లేదని బాబు ధైర్యం చెబుతున్నారుట. జగన్ టార్గెట్ గానే ఈ కొత్త పొత్తులు కుదిరాయని బాబు వివరిస్తున్నారుట. ఏపీలో బీజేపీ బలపడాలంటే జగన్ మీద గురి పెట్టడమే మార్గమని, అందుకోసం సామాజిక, రాజకీయ సమీకరణలు తనకు అనుకూలం చేసుకుంటోందని బాబు భావిస్తున్నారుట.

కేంద్రంతో దూరం…..

ఈ కొత్త పొత్తుల వల్ల జగన్ కి కేంద్రం పూర్తిగా దూరం అవుతుందని టీడీపీ విశ్లేషించుకుంటోంది. జగన్ అధికారంలోకి రావడానికి బీజేపీ వెనక ఉందని భావిస్తున్న టీడీపీకి జనసేనతో ఆ పార్టీ జత కట్టడం గొప్ప ఊరటను ఇస్తోందట. జగన్ ఇంతకాలం కేంద్రంతో అనుకూలంగా మెలుగుతూ వచ్చారని, ఇపుడు అది కుదిరే పని కాదని కూడా తమ్ముళ్ళు సంబరపడుతున్నారుట. జగన్ కి రానున్న రోజుల్లో కేంద్రం నుంచి కొత్త ఇబ్బందులు ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారుట.

కేసుల ఊసులు….

జగన్ ఇప్పటికే పీకల్లోతు కేసులలో ఉన్నారని, ఆయన్ని ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయ్యేలా ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇకపై ఈ కేసులు మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. జగన్ ని టార్గెట్ చేసి జనంలో ఆయన్ని పలుచన చేస్తేనే బీజేపీ మనగలుగుతుందని, లేకపోతే ఆ పార్టీకి ఏపీలో స్కోప్ ఉండదని టీడీపీ అంచనా కడుతోంది. ఆ విధంగా చూసుకుంటే జగన్ బాగా ఇబ్బందులు పడే రోజులు ముందున్నాయని కూడా ఆలోచన చేస్తున్నారుట.

చిక్కులేనా?

జగన్ ని అష్ట దిబంధనం చేసేందుకే బీజేపీ ఈ కొత్త సమీకరణను తెరపైకి తెచ్చిందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. జగన్ ది ప్రజాబలం అని ఆయన పార్టీకి క్షేత్ర స్థాయిలో పటిష్టమైన క్యాడర్ లేదని కూడా టీడీపీ వాదిస్తోంది. ఒక్కసారి ఆ ప్రజాబలాన్ని, అభిమానాన్ని దెబ్బ కొడితే పార్టీ కుప్పకూలడం ఖాయమని పసుపు శిబిరం భావిస్తోంది. ఆ పనిని బీజేపీ విజయవంతంగా చేస్తుందని తమ్ముళ్ళు ఊహించుకుంటున్నారు. అదే సమయంలో జగన్ ఎంతలా పలచబడితే అంతలా నిలదొక్కుకునే చాన్స్ ఒక్క టీడీపీకే ఉంటుందని, ఏపీలో బీజేపీ ఎంత బలం పుంజుకున్నా అధికారంలోకి వచ్చే సీన్ లేదని, మొత్తానికి ఈ పరిణామాలు తమకే అనుకూలంగా ఉంటాయని టీడీపీ మేధావులు లెక్కలు కడుతున్నారట.

Tags:    

Similar News