జగన్ గిరి గీసుకున్నారా…?

వైఎస్ జగన్ తీరు ప్రత్యేకం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరుకు వైఎస్సార్ కుమారుడు అయినా ఆయన కంటే భిన్నగా చాలా విష‌యాల్లో కనిపిస్తారు. [more]

Update: 2019-09-09 12:30 GMT

వైఎస్ జగన్ తీరు ప్రత్యేకం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరుకు వైఎస్సార్ కుమారుడు అయినా ఆయన కంటే భిన్నగా చాలా విష‌యాల్లో కనిపిస్తారు. వైఎస్సార్ లో ఉన్న బోళాతనం, కలివిడితనం వైఎస్ జగన్ లో పెద్దగా కనిపించదు. వైఎస్ జగన్ బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆయన లెక్కలు అన్నీ వేరేగా ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది. ఏది ఎలా ఉన్నా వైఎస్ జగన్ ఇపుడు ఓ విధంగా ఒకనాటి చంద్రబాబు బాటలో నడుస్తున్నారని అంటున్నారు. 1995లో చంద్రబాబు ఇపుడున్న వైఎస్ జగన్ వయసులోనే సీఎం గా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సీఎం కావడానికి ఎంతో మంది టీడీపీ తమ్ముళ్ళు సాయం చేశారు. వారు బాబు సీఎం అయ్యాక పాత చనువు చూపించబోతే బాబు సున్నితంగానే పక్కనపెట్టారని అప్పట్లో కధలు వినిపించాయి. సీఎం అంటే బాస్ ఇదే బాబు విధానం. అందువల్ల అప్పటివరకూ నువ్వూ అన్న వారే బాబు గారు, సార్ అనాల్సివచ్చింది. ఇపుడు వైఎస్ జగన్ విషయంలో సన్నిహితుల బాధ కూడా అలాగే ఉందంటున్నారు.

గిరిగీసుకున్న యువనేత…..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు పార్టీ అధినేతగా ఓ కోటరీని మెయింటైన్ చేసేవారు. ఆ కోటరీలో చాలామంది నేతలు ఉంటూ వైఎస్ జగన్ తో చనువుగా ఉండేవారు. ఎపుడైతే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారో ఆ కోటరీ కోట కూలిందట. వైఎస్ జగన్ ఇపుడు అధికారంలో ఉన్నారు. కొత్తరకం ఇన్నర్ సర్కిల్ ఏర్పడిందని, అది అతి కొద్ది మందికే పరిమితమని కూడా అంటున్నారు. దాంతో వైఎస్ జగన్ తో గత పదేళ్ళుగా చెట్టాపట్టాలు వేసిన వారు, పాత దోస్తులు ఎవరూ ఈ ఇన్నర్ సర్కిల్ దాటుకుని వైఎస్ జగన్ వద్దకు రాలేకపోతున్నారని సమాచారం. ఇక వైఎస్ జగన్ సైతం తన అధికారం వెలుగులు ఎక్కువమంది మీద ప్రసరించకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీఎం గా తాను ఎవరికీ సన్నిహితుడిని కాను అన్న సందేశం పంపించడానికే వైఎస్ జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

పార్టీకి దెబ్బేనా…?

వైఎస్ జగన్ ఈ విధంగా చేయడం కొంతవరకూ కరెక్టే అయినా కూడా పార్టీ నాయకులు మాత్రం ఈ వైఖరి పట్ల కొంత అసంత్రుప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మునుపటిలా వైఎస్ జగన్ తో మాట్లాడే అవకాశం కూడా చాలా మంది నాయకులకు లేదని అంటున్నారు. మొత్తం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఇప్పటికీ వైఎస్ జగన్ ని కలవని వారు 70 కి పైగా ఉన్నారంటేనే ఎంత గ్యాప్ ఏర్పడిందో అర్ధమైపోతుంది. వైఎస్ జగన్ ఈ గ్యాప్ ని కొంతవరకూ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉందన్న సంగతి వైఎస్ జగన్ కి తెలియనిది కాదని, అందువల్ల పార్టీకి కూడా ప్రాధ్యాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. వైఎస్ జగన్ మాత్రం తన చనువుని అలుసుగా తీసుకుని అధికార దుర్వినియోగం ఎవరైనా చేస్తారని ఎక్కువ జాగ్రత్త పడిపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News