జగన్ మీద కొత్త ముద్ర ?

జగన్ అవినీతిపరుడు. లక్ష కోట్లు దోదేశాడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఇంతకాలం తెలుగుదేశం అంటూ వచ్చింది. అయితే వీటి వయసు [more]

Update: 2021-07-23 02:00 GMT

జగన్ అవినీతిపరుడు. లక్ష కోట్లు దోదేశాడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఇంతకాలం తెలుగుదేశం అంటూ వచ్చింది. అయితే వీటి వయసు పుష్కర కాలం. ఇప్పటికే రెండు ఎన్నికల్లో ఈ ఆరోపణల అస్త్రాలు తుత్తునియలు అయ్యాయి. జగన్ కి రాజకీయంగా ఏమీ కాలేదు. దాంతో పాటు పాచిపోయిన లడ్డూల లాంటి ఈ ఆరోపణలు చేయడంతో జనాలు కనెక్ట్ కాలేకపోతున్నారు. పైగా తండ్రి హయాంలో జగన్ కనీసం ఎంపీ కూడా కాకుండా ఇన్నేసి ఆర్ధిక నేరాలు చేశారూ అంటే జనాలు కూడా అసలు నమ్మరు. మరి జగన్ ని బోనులో నిలబెట్టాలి అంటే లేటెస్ట్ గా కొత్త అవినీతిని కనుగొనాలి.

ఇలాగైతే కరెక్ట్ …..

జగన్ ఇపుడు సీఎం. ఆయన జమానా రెండేళ్ళుగా సాగుతోంది. ఇపుడు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా జగన్ కనుసన్నలోనే జరుగుతుంది. అంటే జగన్ సీఎం గా ఉండగా అవినీతి జరిగింది అని నిరూపిస్తే జనాలు కచ్చితంగా నమ్మేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇపుడు అర్జంటుగా మూలనున్న పయ్యావుల కేశవ్ బయటకు వచ్చారు. రెండేళ్ళ క్రితం ఆయనకు అప్పగించిన పీఏసీ చైర్మన్ పదవికి అక్షరాలా న్యాయం చేస్తూ టీడీపీకి కొత్త బూస్టింగ్ ఇచ్చాడు. ఏకంగా 41 వేల కోట్ల రూపాయలు ఎటువంటి లెక్కా జమా లేకుండా పక్కదారి పట్టాయంటూ పయ్యావుల పెద్ద బాంబే పేల్చారు.

కుంభకోణమేనా ..?

ప్రభుత్వ పరంగా జరిగే ఎలాంటి ఆర్ధిక లావాదేవీకైనా ఒక కచ్చితమైన లెక్క ఉండాలి. మరి దాన్ని కాదని ఖర్చు పెట్టారు అంటే అది అనధికారమే అవుతుంది. సరిగ్గా ఇలాంటి అనుమానాలే కలిగేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారు. దాదాపుగా అర లక్ష కోట్ల రూపాయల మొత్తం పక్కదారి పట్టేసిందని ఆయన గవర్నర్ కి ఫిర్యాదు చేయడమే కాదు ప్రెస్ మీట్ పెట్టి గర్జించారు. ఇక అంతే టీడీపీ అనుకూల మీడియాతో సహా మొత్తం పదమూడు జిల్లాల నాయకులు అంతా జగన్ మీద ఒక్కసారిగా పడిపోయారు. జగన్ ఆర్ధిక అవినీతి చేయడంతో సిద్ధహస్తుడంటూ పాత ఆరోపణలకు కొత్త కలరింగ్ ఇస్తూ తమ్ముళ్ళు ధాటీగా దాడి చేశారు. ఏపీ చరిత్రలో అతి పెద్ద ఆర్ధిక కుంభకోణంగా దీన్ని వారు పేర్కొంటున్నారు.

వివరణ ఇచ్చినా ..?

అయితే వెంటనే అలెర్ట్ అయి ఆర్ధిక శాఖ వివరణ ఇచ్చినా కూడా అదంతా కవరింగే తప్ప నిజం కానే కాదని తమ్ముళ్ళు కొట్టిపారేస్తున్నారు. అయ్యా ఎస్ అంటూ అధికారులు జగన్ సర్కార్ కి కొమ్ము కాయడం వల్లనే ఇంతటి పెద్ద మొత్తం పక్క దారులు పట్టిందని కూడా అంటున్నారు. సరే ఈ విషయంలో నిబంధనలు అన్నీ పాటించామని, ట్రజరీ కోడ్ ని ఎక్కడా ఉల్లంఘించలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇపుడు జగన్ మీద అర్జంటుగా కొత్త అవినీతి ముద్ర వేయడం ద్వారా జనాల్లో చెడ్డ చేయాలని టీడీపీ వేసిన ఎత్తుగడకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దీని నుంచి ఎలా తప్పించుకుంటుందో కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా జగన్ మీద ఇలాంటి ఆరోపణలు వస్తే ఈసారి ఎక్కువ శాతం జనాలు నమ్మే వీలు ఉంటుంది. అందుకే టీడీపీ మెరుపు లాంటి మాస్టర్ ప్లాన్ ని అమలు చేస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News