వైఎస్సార్ దోస్తులే టార్గెట్… ?

జగన్ ఇపుడు కొత్త రూట్లో వెళ్తున్నారు. ఏపీలో నిన్నటి రాజకీయం వేరు. రేపటి రాజకీయం వేరు అన్నట్లుగా ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి తన [more]

Update: 2021-08-01 03:30 GMT

జగన్ ఇపుడు కొత్త రూట్లో వెళ్తున్నారు. ఏపీలో నిన్నటి రాజకీయం వేరు. రేపటి రాజకీయం వేరు అన్నట్లుగా ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి తన చరిష్మా ఎంతగానే ఉపయోగపడింది. కానీ వచ్చే ఎన్నికల్లో అది జరిగే పని కాదని ఆయన ఆలోచిస్తున్నారుట. తన ఇమేజ్ తో పాటు సొంతంగా బలం ఉన్న వారు కూడా ఉంటే గెలుపు గుర్రం ఎక్కడం ఈజీ అని ఆయన అంచనా వేస్తున్నారు. అలా ఇతర పార్టీలలో బలమైన నాయకులు ఎవరున్నా కూడా వైసీపీలోకి వారిని ఆహ్వానించాలని జగన్ యోచిస్తున్నట్లుగా భోగట్టా.

సీనియర్లు అలా ..?

తన తండ్రికి అత్యంత సన్నిహితులుగా పేరుపడిన సీనియర్లను వెతికి పట్టుకుని మరీ పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారుట. నిజంగా జగన్ లో వచ్చిన సరికొత్త మార్పు ఇదని అంటున్నారు. సీనియర్లు, పైగా వైఎస్సార్ దోస్తులు వైసీపీకి కావాలి అని జగన్ గుర్తించారుట. వారిని తెచ్చి వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా ఆయా జిల్లాల్లో బరిలోకి దించాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. వారికి ఉన్న సీనియారిటీ అనుభవంతో జాతీయ రాజకీయాల్లో వైసీపీకి కొత్త రూపూ షేపూ వస్తాయన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

లిస్ట్ రెడీ…

ఏపీలోని కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు అలాగే మిగిలి ఉన్నారు. కొందరు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే మరి కొందరు వేరే పార్టీలలో ఉన్నారు. వీరందరినీ దగ్గరకు తీయాలని జగన్ ప్లాన్ గా ఉందిట. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మరో కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ లతో పాటు, కోస్తాంధ్రలో పల్లం రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని వైసీపీలో చేర్చుకోవాలని జగన్ పెద్ద లిస్ట్ తయారు చేశారు అంటున్నారు. వీరు కనుక వస్తే అటు పార్టీలోనూ సముచిత స్థానం కల్పించడంతో పాటు ఎంపీలుగా వీరిని పార్లమెంట్ కి పంపాలని జగన్ భావిస్తున్నారుట. ఇపుడున్న ఎంపీలలో దాదాపుగా అంతా కొత్త వారు ఉండడంతో పాటు రేపటి ఎన్నికల్లో మరో మారు గెలిచే సత్తా లేదని జగన్ భావిస్తున్నారుట.

జీరో చేయాలంతే …?

ఇక బలమైన నాయకులు ప్రత్యర్ధి పార్టీలలో లేకుండా జీరోని చేయాలని జగన్ భావిస్తున్నారుట. టీడీపీలో ఉంటూ అవకాశాలు లేక ఉన్న వారిని కూడా వైసీపీలోకి ఆకర్షించాలని జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ కోర్ కమిటీ ఈ రకంగా సిఫార్సు చేసింది అంటున్నారు. ఏపీలో చంద్రబాబుని మించి ఆలోచిస్తేనే తప్ప తాను రేపటి ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగరవేయలేనని జగన్ అంచనా వేసుకుంటున్నారు. అటు పార్టీకి కూడా వైఎస్సార్ ఆలోచనలు పంచుకునే వారు కావాలని జగన్ ఉద్దేశ్యంగా ఉందిట. మొత్తానికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో జగన్ సీనియర్లను అనుభవం ఉన్న వారిని, ఎక్కువగా పాత కాంగ్రెస్ కాపులను దించబోతున్నారని అర్ధమవుతోంది. మరి వైఎస్సార్ విధేయులు జగన్ పిలుపునకు పలుకుతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News