వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి `ఆ ఇమేజ్‌` ఉండ‌దా..?

ఏపీ అధికార పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. నాయ‌కుడిగా జ‌గ‌న్ పార్టిని న‌డిపిస్తున్నా.. వ్యవ‌స్థీకృతంగా చూసు కుంటే.. పార్టీ ఇమేజ్ అంతా కూడా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి [more]

Update: 2021-08-01 11:00 GMT

ఏపీ అధికార పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. నాయ‌కుడిగా జ‌గ‌న్ పార్టిని న‌డిపిస్తున్నా.. వ్యవ‌స్థీకృతంగా చూసు కుంటే.. పార్టీ ఇమేజ్ అంతా కూడా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌పైనే ఆధార‌ప‌డింది. ఎన్నిక‌ల‌కు ముందు.. వైఎస్ ఇమేజ్‌ను, పేద‌ల్లోను, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల్లోనూ.. వైఎస్‌కు ఉన్న సానుభూతిని వైసీపీ నేత‌లు బాగానే వినియోగించుకున్నారు. జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వీడి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పటి నుంచే ప్రతిక్షణంలోనూ వైఎస్ ఇమేజ్‌ను వాడుకుంటూనే వ‌స్తున్నారు. జ‌గ‌న్ సైతం త‌న ప్రతి ప్రసంగం ప్రారంభానికి ముందే మ‌హానేత పేరు ప్రస్తావిస్తూనే వ‌స్తున్నారు. జ‌నాల్లో వైఎస్ ప‌ట్ల సానుభూతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టర్ కూడా వారిని విజ‌యం వైపు న‌డిపించింది కూడా. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ఇమేజ్‌ను కొంచెం ప‌క్కన పెట్టి.. జ‌గ‌న్ ఇమేజ్‌ను తీసుకురాని ప‌క్షంలో క‌ష్టం అవుతుంద‌న్న అభిప్రాయాలు ఆ పార్టీ సీనియ‌ర్ల నుంచే వ్యక్తమ‌వుతున్నాయి.

పథకాలకు అందుకే….

ప్రస్తుతం గ‌త ఏడాది కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌ ఇమేజ్ పెంచుకునేలానే పార్టీ, ప్రభుత్వం కూడా వ్యవ‌హ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాది.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరిటే.. అనేక ప‌థ‌కాల‌ను ప్రవేశ పెట్టారు. ప్రతి ప‌థ‌కానికీ, ఆయన పేరు ఉంచారు. కానీ, త‌ర్వాత త‌ర్వాత‌.. వైఎస్ జ‌గ‌న్ పేరును పెడుతూ వ‌చ్చారు. ఇటీవ‌ల ప్రారంభించిన అనేక ప‌థ‌కాల‌కు జ‌గ‌న‌న్న పేరుతోనే ప్రచారం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్రతి కార్యాల‌యంలోనూ జ‌గ‌న్ ఫొటోనే ఉంచుతున్నారు. అధికారులు కూడా గ‌తంలో వైఎస్‌పేరును జ‌పించేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో దీనిని ప‌క్కన పెట్టారు. జ‌గ‌న్ పేరుతో మాత్రమే ప‌లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జనంలో గుర్తుండేలా?

మ‌రీ చిత్రం ఏంటంటే.. కొన్ని కొన్ని ప‌థ‌కాల విష‌యంలో అస‌లు వైఎస్ ప్రస్తావ‌న కూడా ఉండ‌డం లేదు. అత్యంత కీల‌క‌మైన‌.. పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కానికి సంబంధించి మొద‌ట్లో.. వైఎస్సార్ ఇళ్లు అనే పేరు పెట్టాల‌ని భావించారు. కానీ, పేద‌ల‌కు సంబందించిన సెంటిమెంటుతో కూడుకున్న విష‌యం.. ప‌ది కాలాల పాటు నిలిచిపోయే ల‌బ్ధిని చేకూరుస్తున్నందున‌.. దీనికి జ‌గ‌న్ పేరు పెడితే బాగుంటుంద‌ని ఆ దిశ‌గానే నిర్ణయం తీసుకున్నారు. గ‌తంలో వైఎస్ రైతుల గుండెల్లో ఎలా నిలిచిపోయారో.. పేద‌ల గుండెల్లో జ‌గ‌న్ పేరు కూడా అలానే ఉంటుంద‌ని అన‌డంతో జ‌గ‌న్ చివ‌ర‌కు త‌న‌పేరునే ఖరారు చేసుకున్నారు. ఇలా.. రాబోయే ఎన్నిక‌ల నాటికి వైఎస్ పేరును కొంత మేర‌కు త‌గ్గించి.. జ‌గ‌న్ ఇమేజ్‌తోనే ముందుకు సాగాల‌ని పార్టీ అధిష్టానం, జ‌గ‌న్ నిర్ణయంగా తెలుస్తోంది.

Tags:    

Similar News