ఈ ఇద్దరితో ఈసారి నష్టమేనా?

గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో జగన్ శ్రమ ఒకటి కాగా, విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల కూడా జగన్ విజయంలో ప్రధాన పాత్ర [more]

Update: 2021-07-13 12:30 GMT

గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో జగన్ శ్రమ ఒకటి కాగా, విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల కూడా జగన్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికల నాటికి వీరిద్దరే జగన్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారారన్న టాక్ పార్టీ నుంచే విన్పిస్తుంది. ఈ ఇద్దరి వల్ల జగన్ కు రానున్న ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న అంచనాలు మాత్రం విన్పిస్తున్నాయి.

తానే కారణమై….

వైఎస్ షర్మిల తన అన్న జగన్ అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వాతావరణాన్ని జగన్ కు అనుకూలంగా మలిచారు. చంద్రబాబును బద్నాం చేయడం, యువతను ఆకట్టుకోవడంతో జగన్ విజయం మరింత సులభమయింది. అయితే ఇప్పుడు అదే వైఎస్ షర్మిల జగన్ కు ఇబ్బందిగా మారారు. జగన్ కు, షర్మల కు మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

వైఎస్ కుటుంబంలో….

తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఏపీలో ఉన్న జగన్ కు ఇబ్బందిగా మారారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ స్టాండ్ తీసుకోవడంతో జగన్ ను ఇరకాటంలోకి నెడుతుంది. వైఎస్ కుటుంబంలో విభేదాలని, ఇద్దరూ డ్రామా ఆడుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇది జగన్ కు వచ్చే ఎన్నికల్లో కొంత మైనస్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. ముందుగా తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోతాయి కాబట్టి, అప్పటికి రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.

విపక్షంలో ఉన్నప్పుడు….

ఇక విజయసాయి రెడ్డి వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. జగన్ కు కుడిభుజంగా వ్యవహరించారు. టీడీపీ, బీజేపీని విడగొట్టడంలో ఆయన ముఖ్య పాత్రధారి. ట్విట్టర్ లో తన కామెంట్స్ తో చంద్రబాబును నిత్యం ఒక ఆటాడుకునే వారు. కానీ అదే విజయసాయిరెడ్డి కారణంగా ఇప్పుడు పార్టీకి నష్టం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పార్టీని ఇబ్బందుల్లో పడేసిందని చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఈ ఇద్దరి వల్ల ముప్పు తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News