ఉత్తరాంధ్ర నెత్తిన పెద్ద కుంపటి పెడుతున్నారా ?

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుతనానికి గురి అయినవి. ప్రగతి అన్నది అసలు ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు [more]

Update: 2021-07-12 02:00 GMT

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుతనానికి గురి అయినవి. ప్రగతి అన్నది అసలు ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఆ పనిని తాను భుజాన వేసుకుంటానని జగన్ అంటే జనాలు సంతోషించారు. కానీ ఇపుడు అదే జగన్ అణు కుంపటిని నెత్తిన పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాలు విధ్వంసం కావడానికి అణు కుంపటి ఒక్కటి చాలు అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే తన తండ్రి వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న అణు విద్యుత్ ప్లాంట్ ని నిర్మించడానికి జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారట‌.

సిక్కోలుకి చిక్కే ….?

శ్రీకాకుళం జిల్లాలోని రణ స్థలంలోని కొవ్వాడ వద్ద ఆసియాలోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు 2004లో నాటి సీఎం వైఎస్సార్ ప్రతిపాదించారు. అమెరికన్ కొలాబరేషన్ తో ఈ ప్లాంట్ ని నిర్మించాలని కూడా భావించారు. ఈ ప్లాంట్ ద్వారా తొమ్మిది వేల ఆరు వందల మెగా వాట్ల విద్యుతు ఉత్పత్తి అయితే దేశానికే చాలా వరకూ కొరత తీరుతుందని అన్నది ఆలోచన. నాడు భూసేకరణ కూడా చురుకుగా సాగింది. రెండు వందల యాభై దాకా ఎకరాలకు 2013లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం భారీ నష్ట పరిహారం కూడా చెల్లించారు. ఇక ఈ ప్లాంట్ నిర్మాణం కోసం మూడు వందల కోట్లను కూడా ఎపుడో రిజర్వ్ చేశారు. 16 వేల కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించాలని ప్రతిపాదన.

ఉవ్వెత్తిన ఉద్యమాలు …

అయితే వైఎస్సార్ హయాంలోనే ఈ అణు ప్లాంట్ వద్దు, ఇది కనుక వస్తే మూడు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల దాకా భస్మీపటలమే అవుతాయని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ కత్తి మీద సాము అని ఏ చిన్న పొరపాటు జరిగిన అతి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. దాని వల్ల నాడు కొంత వెనక్కి తగ్గారు. ఆ తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలతో పాటు, విభజన ఏపీలో చంద్రబాబు కూడా ప్లాంట్ నిర్మాణానికి ఆసక్తి చూపించలేదు. అయితే వైసీపీ మాత్రం దీన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

అభివృద్ధి ఓకే కానీ…?

అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల పెద్ద ఎత్తున విద్యుతు చౌకగా లభిస్తుంది. దాని వల్ల పారిశ్రామికీకరణ కూడా జరుగుతుంది. ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. అభివృద్ధి కూడా జరుగుతుంది. కానీ అదే సమయంలో అణు కుంపటి నెత్తిన ఉంటే ఎప్పటికైనా ముప్పే అన్న ఆందోళన అయితే జనాలలో ఉంది. అయితే ఈ మధ్యన మళ్లీ అణు ప్లాంట్ కోసం వేగంగా కదులుతున్న జగన్ సర్కార్ తీరు చూసి ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నాయి. మరో వైపు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా అణు ప్లాంట్ కి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రతిపాదిస్తున్న జగన్ ఉత్తరాంధ్రా ప్రగతి సాధ్యం కావాలంటే అణు విద్యుత్ ప్లాంట్ అవసరం అనే భావిస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News