అదే జరిగితే ఎదుటోళ్లకు పుట్టగతులుంటాయా?

జగన్ మీద చాలా మంది నేతలకు ఈ రోజుకూ ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఆయన తమ కంటే చాలా జూనియర్ అని, రాజకీయంగా ఆయనకు ఏమీ [more]

Update: 2021-07-05 12:30 GMT

జగన్ మీద చాలా మంది నేతలకు ఈ రోజుకూ ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఆయన తమ కంటే చాలా జూనియర్ అని, రాజకీయంగా ఆయనకు ఏమీ తెలియదని, ఆయన ముఖ్యమంత్రి కావడమేంటని. ఇలా వారిలో అనేక రకాలైన భావాలు ఉన్నాయి. అయితే ఇలా మాట్లాడుతున్న వారంతా వాస్తవ దృష్టితో ఆలోచించడం లేదనుకోవాలి. నాయకుడు అన్న వారిని ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు, జనం వారిని మెచ్చి ఆదరిస్తే చాలు. జగన్ అలా డైరెక్ట్ గా జనం నుంచే నేతగా ఎన్నుకోబడ్డారు. ఆయనకు అలాగే పుష్కలమైన జనాదరణ లభిస్తోంది.

ఇంకా అక్కడేనా…?

జగన్ విషయంలో కొంతమంది ఇప్పటికీ చేస్తున్న ఆరోపణలు చూస్తే నవ్వు రాక మానదు, ఆయన దోచుకుంటున్నాడని, ఆయన అవినీతిపరుడని అంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ పుష్కరం కాలం నాటి నుంచి జనం వింటున్న అరిగిపోయిన రికార్డు లాంటి మాటలు. వాటిమీద జనాలు ఏనాడో తీర్పు ఇచ్చేశారు కూడా. ఇక జగన్ జైలుకు వెళ్తాడని కూడా పదే పదే బెదిరిస్తూంటారు. ఆ విషయం జగన్ కి తెలియదా. లేక జగన్ కి జైలు అంటే కొత్తటనా. ఆయన పదహారు నెలలు జైలులో ఉండి వచ్చిన వాడు, ఒకవేళ రాజకీయ కుట్రలో భాగంగా ఆయన మళ్ళీ జైలుకు వెళ్లాల్సివస్తే భయపడతారా. పైగా ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన తరువాతనే ఇంతటి ఆదరణ దక్కిందే. మళ్ళీ మళ్ళీ జగన్ జైలుకు వెళ్తే ఏపీలో మరో పార్టీకి పుట్టగతులు ఉంటాయా.

ఏమీ చేయలేరా…?

ఆవేశం పిరికివాడి ఆయుధం అని మహాత్ముడు అంటారు. అలాగే రాజకీయాల్లో ఊకదంపుడు విమర్శలు చేసేవారు బలహీనులే అనుకోవాలేమో. జగన్ గొప్ప నాయకుడు ఏమీ కాడు, ఆయన పాలనలోనూ తప్పులు జరిగి ఉండవచ్చు. వాటిని జనంలో పెట్టి ఎండగట్టి అదే జనం మనసు గెలుచుకోవచ్చు. కానీ అలా ఎందుకు చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ జగన్ సర్కార్ లో జరిగిన పొరపాట్ల కంటే జగన్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తున ఉంది కాబట్టి. అందుకే సులువైన మార్గంలో జగన్ ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. మరి జగన్ మీద అభాండాలు వేస్తే ప్రజలు నమ్ముతారా. ప్రజలకు కావాల్సింది ఏంటో జగన్ సమకూరుస్తున్నాడు. ఒకవేళ జగన్ తప్పుకుని కొత్త పాలకులు ఎవరు వచ్చినా ఇంతలా చేయలేరు అనిపించేలా జగన్ చేసి చూపిస్తున్నాడు. అలాంటపుడు జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే విపక్షాన్ని మెచ్చి పీఠం అప్పచెబుతారా.

అదే గీటు రాయి….

జగన్ పాలనకు గీటు రాయి ఆయన జనాలకు చెప్పినప్రకారం పాలన అందించడమే. ఒకవేళ అలా కాకపోతేనే ఆయన మీద విరక్తి వస్తుంది. అంతే తప్ప జగన్ తన తండ్రి వైఎస్సార్ పాదయాత్రకు దూరంగా ఉన్నాడనో, ఆయన వైఎస్సార్ అసలైన వారసుడు కాదనో, లేక ఆయన కాంగ్రెస్ ని మోసం చేశాడనో ఇలాంటి ఆరోపణలు చేస్తే జనాలు అసలు పట్టించుకోరు. ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హైలెట్ కావడానికి కొందరు హఠాత్తుగా జగన్ మీద ఆరోపణలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇవన్నిటినీ ఏనాడో జగన్ దాటేశారు. ఇపుడు ఆయన ఒక స్థిరమైన నాయకుడిగా ఎదిగారు. ఆయనకు జనాలకు మధ్య తెలియని కనెక్షన్ ఉంది. అది ఈ రోజుకు బలంగానే ఉంది. మరి అక్కడ ఏమైనా తేడా వస్తే తప్ప జగన్ని ఎవరూ ఏమీ చేయ‌లేరు అన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News