ఆ 21 లోనూ డౌటే కాని….?

ప్రస్తుతం స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమ‌వుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను కూడా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది. [more]

Update: 2020-01-17 00:30 GMT

ప్రస్తుతం స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమ‌వుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను కూడా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది. ప్రభుత్వం కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయింది. పేద, మ‌ధ్యత‌ర‌గ‌తి నుంచి అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌ను త‌న వైపు మళ్లించుకునేందుకు చేయాల్సిన అన్ని కార్యక్రమాల‌ను చేసింది. సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా అమ‌లు చేస్తోంది. ఫ‌లితంగా స్థానిక ఎన్నిక‌ల్లోనూ సార్వత్రికాన్ని మించిన ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని భావిస్తోంది. అలాగ‌ని ఇప్పటి వ‌ర‌కు చేసింది స‌రిపోద‌ని, కాబ‌ట్టి అంద‌రూ అలెర్ట్ అవ్వాల‌ని జ‌గ‌న్ సూచిస్తున్నారు.

వాయిదా వేసి మరీ…

ఈ క్రమంలో అంద‌రినీ లైన్‌లో పెట్టేందుకు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీని కూడా జ‌గ‌న్ వాయిదా వేశారు. ఇక‌, తాము గెలుచుకున్న 151 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి బాగానే ఉన్నాకూడా టీడీపీ కైవ‌సం చేసుకున్న 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వైసీపీని ప‌రుగులు పెట్టించాలని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఇక‌, మిగిలిన 21 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ప‌ట్టు పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయాం? అనే విష‌యాన్ని చ‌ర్చిస్తున్నారు.

మంత్రులను పంపి….

దీంతోపాటు ప్రస్తుతం స్థానిక ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యాన్ని కూడా జ‌గ‌న్ కీల‌కంగా తీసుకున్నారు. మంత్రుల‌నే ఏకంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్దరేసి చొప్పున పంపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని ప‌రిశీలించ‌డంతోపాటు నాయ‌కులకు, ఇంచార్జ్‌ల‌కు పార్టీ లైన్‌ను వివ‌రిస్తున్నారు. విభేదాల‌ను ప‌క్కన పెట్టాల‌ని, అసంతృప్తుల‌ను కూడా వ‌దిలించుకుని పార్టీ కోసం ప‌ని చేయాల‌ని ఈ సంద‌ర్భంగా నాయ‌కులకు మంత్రులు హిత‌వు ప‌లుకుతున్నారు.

బలహీనంగా ఉన్నచోట…..

స్థానిక ఎన్నిక‌ల అనంత‌రం పార్టీ నామినేటెడ్ ప‌ద‌వుల నియామ‌కాలు ఉంటాయ‌ని వారు హామీ ఇస్తున్నారు. ఈ 21 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌క‌త్వంపై అనుమానం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా ఇప్పటికే గుర్తించారు. ప్రకాశం జిల్లా అద్దంకి, ప‌ర్చూరు లాంటి చోట్ల నాయ‌క‌త్వంపై జ‌గ‌న్‌కు ఇప్పటికే అనుమానాలు ఉన్నాయ‌ట‌. హిందూపురం, కుప్పంలోనూ ఇదే ప‌రిస్థితి ఉన్నా అక్కడ అంత‌కు మించిన ఆప్షన్ లేద‌న్న నిర్ణయానికి వ‌చ్చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండిలో కూడా నాయ‌క‌త్వ మార్పుపై చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఇక్కడ ఇటీవ‌లే పార్టీలో చేరిన గోక‌రాజు ఫ్యామిలీకి బాధ్యత‌లు ఇస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచన చేస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఆప‌రేష‌న్ ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితాలు ఇస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News