సిద్ధమయ్యారు.. కానీ వారు ఒప్పుకుంటారా?

ఎన్నో ముహూర్తాలు, మరెన్నో ఆలోచనలు. గత రెండేళ్లలో ఒకే ఒక అంశం మీద ఆకాశం భూమీ కలిపేలా జరిగిన చర్చలు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కధ [more]

Update: 2021-06-23 15:30 GMT

ఎన్నో ముహూర్తాలు, మరెన్నో ఆలోచనలు. గత రెండేళ్లలో ఒకే ఒక అంశం మీద ఆకాశం భూమీ కలిపేలా జరిగిన చర్చలు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కధ ఎక్కడ ఉంది అంటే కోర్టులలో అని సమాధానం వస్తుంది. ఒక వైపేమో జగన్ దూకుడు చేస్తున్నారు. ఆయన పాలన సగానికి వచ్చేసినా అమరావతిలోనే ఉండిపోవడం అసహనాన్ని కలిగిస్తోందిట. తన మార్క్ పాలన, తాను కోరుకున్న చోట నుంచి సాగించాలన్నది జగన్ పంతంగా ఉంది. దాని కోసం ఈసారి ఆరు నూరైనా జరగాల్సిందే అంటున్నారు జగన్.

ఆగస్ట్ లోనేనా…?

ఆగస్ట్ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర దినోత్సవం అదే నెలలో జరుగుతుంది. అలాగే శ్రావణ మాసం కూడా ఆ నెలలోనే వస్తుంది. వేడుకలు, పండుగలకు ఆలవాలమైన నెలగా చెబుతారు. అటువంటి ఆగస్ట్ లో మంచి ముహూర్తాన విశాఖ నుంచి పాలన చేయాలని జగన్ తలపోస్తున్నారు అన్నది తాజా టాక్. రాజధాని తరలిరావడానికి కోర్టు అడ్డంకులు చాలా ఉన్నాయి. కానీ జగన్ ఒక్కరే వస్తే ఏ గొడవా లేదు. పైగా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా రెడీ అవుతోంది కాబట్టి సాగర నగరంలో ఉంటూనే జగన్ చల్లని పాలన అందిస్తారట. అలా ఇండిపెండెన్స్ డే వేళ జగన్ విశాఖ నుంచే జెండా ఎగరేస్తారు అంటున్నారు.

ఉద్యోగుల గుస్సా ….

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల విషయంలో తొలిసారిగా ఒక పాలక వర్గం రగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయట. చంద్రబాబుని కాదని జగన్ని తెచ్చుకున్న తమకు వరస‌ షాకులే తగులుతున్నాయని వారు వాపోతున్నారు. జగన్ చెప్పిన హామీలు నెరవేరలేదు అన్నది వారి అసలు బాధ. 11వ పీయార్సీని జగన్ ఆమోదించలేదు అని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇక పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. దాంతో పాటు అమరావతిలోనే రాజధాని ఉంటే బాగుంటుందని తమ లోపలి మాటను బయటపెడుతున్నారుట.

ఎలా ఒప్పిస్తారో…

చంద్రబాబు అమరావతికి ఉద్యోగులను రప్పించడానికి అనేక తాయిలాలు ఇచ్చారు. దాంతో పాటు ఇదే రాజధాని అని అక్కడ అప్పులు చేసి మరీ ప్లాట్లు కొనుక్కున్నారు. దాంతో వారు ఇపుడు విశాఖ అంటే ససేమిరా అన్న పరిస్థితి ఉందిట. ఇక అమరావతి అభివృద్ధి చెందితే తమ ప్లాట్లకూ విలువ వస్తుందని వారి ఆలోచనట. జగన్ విశాఖ వెళ్లినా ఆయనతో వివిధ శాఖ వారు మెల్లగా రావాల్సిందే. ఇక మూడు రాజధానుల విషయం కోర్టులో తెమిలితే అంతా చలో విశాఖ అనాల్సిందే. మరి జగన్ వెంట ఏ హామీ లేకుండా ఎగిరిపోవడానికి సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా లేరు అన్న మాట అయితే ఉంది. జగన్ కి అన్నీ అనుకూలం అయినా ఉద్యోగ వర్గాలు కనుక మొరాయిస్తే కధ అడ్డం తిరుగుతుంది అంటున్నారు. విశాఖ వెళ్లే ఉత్సాహంలో జగన్ మౌలిక విషయాలని కనుక పరిష్కరించుకోకపోతే అదే రేపటి రోజున పెద్ద దెబ్బ అవుతుంది అన్న మాట కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News