వైసీపీ మాస్టర్ స్కెచ్ టీడీపీ కోలుకునేదెలా?

ఒక పద్ధతి ప్రకారం జగన్ సర్కార్ టీడీపీని విశాఖ వీధుల్లో నిలబెడుతోంది. మెల్లగా చిన్న ఆక్రమణల స్వాధీనంతో మొదలైన కధ కాస్తా ఇపుడు టీడీపీ బిగ్ షాట్స్ [more]

Update: 2021-06-14 08:00 GMT

ఒక పద్ధతి ప్రకారం జగన్ సర్కార్ టీడీపీని విశాఖ వీధుల్లో నిలబెడుతోంది. మెల్లగా చిన్న ఆక్రమణల స్వాధీనంతో మొదలైన కధ కాస్తా ఇపుడు టీడీపీ బిగ్ షాట్స్ మీదకు వచ్చేసింది. గునపం నేరుగా పెద్ద భూ కామందుల భూముల్లోనే దిగిపోతోంది. దాంతో మొదట్లో ఏమిటీ గోల అని విశాఖ జనం అనుకున్నా వరసపెట్టి జరుగుతున్న ఘటనలు చూసిన వారికి అర్ధం చేసుకున్న వారికి విశాఖ ల్యాండ్ ని బడా బాబులు కంప్లీట్ గా లూటీ చేసేశారు అన్న భావన మాత్రం కలుగుతోంది. అసలు అలాంటి అభిప్రాయం జనంలో బలపడాలనే వైసీపీ ఈ మాస్టర్ స్కెచ్ ని వేసిందనుకోవాలి.

ప్రెసిడెంట్ ఇలాకాలోనే…?

రానున్న రోజుల్లో టీడీపీకి ఆర్ధికంగా రాజకీయంగా సామాజికంగా అందివస్తారనుకున్న వారే భూకబ్జాదారులుగా ముద్ర పడిపోతున్నారు. అదను చూసి వారి మీదనే వైసీపీ సర్కార్ బాణాలు వేస్తోంది. విశాఖలో గత రెండేళ్లలో చాలా మంది టీడీపీ నేతలు ఈ విధంగా భూ ఆక్రమణదారులు, కబ్జాకోర్లు అని అధికారులు గట్టిగానే స్టాంప్ వేసేశారు. ఆ తరువాత కొందరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా వైసీపీ కాగల కార్యం మాత్రం బాగానే నెరవేరిపోతోంది. ఇపుడు సడెన్ గా విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ భూములలోనే అధికారులు జెండా పాతేశారు. దాదాపుగా యాభై ఎకరాలు, ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వానికి చెందకుండా పల్లా ఆయన కుటుంబం కబ్జా చేశారాని రెవిన్యూ అధికారుల అభియోగం. విశాఖలో ఇప్పటిదాక జరిగిన కబ్జాలలోకెల్లా ఇది అతి పెద్దది అని కూడా అధికారులు చెబుతున్నారు.

ఎపుడూ అదే మాటేనా…?

విశాఖలో ఒక్కో టీడీపీ నాయకుని మీద భూ కబ్జా ఆరోపణలు మోపి స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఆ సమయంలో టీడీపీ నుంచి వినిపించే మాట ఒక్కటే. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని వేధింపు అని అంటున్నారు. మొదట్లో జనాలు కూడా వీటిని నమ్మేవారు. కానీ రాను రానూ అదే మాట పదే పదే పసుపు తమ్ముళ్ళు చెప్పడంతో జనాలు కూడా పట్టించుకోవడం మానేశారు. మరో వైపు ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి స్వాధీనం లోకి తెస్తున్నామని, గడచిన కాలంలో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల, రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించి కబ్జా చేసుకుంటూ పోయారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దానికి నిదర్శనంగా ఆ భూములు కనిపిస్తూండడంతో టీడీపీ వాదన చెల్లకుండా పోతోంది.

గజానికొకరుగా…?

టీడీపీ ఏలుబడిలోనే మొత్తం భూముల ఆక్రమణలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ భూములను చెరపెట్టేవారు ఎంతటి వారు అయినా తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రీ అవంతి శ్రీనివాస్ అంటున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పల్లా శ్రీనివాస్ మీద చంద్రబాబు పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సిట్ నివేదిక చేతిలోకి రాగానే చాలా మంది పెద్ద తలకాయల మీద కేసులు ఉంటాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా టీడీపీ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల విలువ అయిదు వేల కోట్ల రూపాయలు అని అధికారుల లెక్కలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింతమంది కబ్జాకోరుల మీద దాడులు చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీగా ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి విశాఖలో టీడీపీ పరువు పోయేలా కొందరు నాయకులు చేసిన చేష్టలను సమర్ధించడమా, లేక వారిని బయటకు పంపి జనాలలోకి కొత్త సందేశం పంపడమా అన్నది టీడీపీ హై కమాండ్ నిర్ణయించుకోవాలని అంటున్నారు.

Tags:    

Similar News