బయట పల్లకీ మోతే

వైఎస్ జగన్ పరిస్థితి ఇది. ఆయనకు బయట కీర్తికాంతులకు ఎటువంటి ఢోకా లేదు. జై జగన్ అంటున్నారంతా. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు జగన్ పధకాలు, ఆయన విజనరీని [more]

Update: 2020-01-14 02:00 GMT

వైఎస్ జగన్ పరిస్థితి ఇది. ఆయనకు బయట కీర్తికాంతులకు ఎటువంటి ఢోకా లేదు. జై జగన్ అంటున్నారంతా. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు జగన్ పధకాలు, ఆయన విజనరీని వేన్నోళ్ళ కొనియాడుతున్నాయి. ఆయన సంక్షేమ పధకాలు, దూకుడు నిర్ణయాలు సైతం ప్రశంసా పాత్రమవుతున్నాయి. దిశ చట్టాన్ని వెంటనే తెచ్చి మొత్తం దేశాన్ని తన వైపునకు తిప్పుకున్న జగన్ ఏపీలో అమలు చేస్తున్న అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్యశ్రీ వంటి పధకాల ద్వారా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే హామీలను వరసగా అమలు చేసిన సీఎంగా కూడా జగన్ కి జాతీయ స్థాయిలో మంచి పేరు వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇంట్లో మాత్రం ఈగల మోతలాగానే పరిస్థితి ఉంది. కుడి ఎడమల తేడా లేకుండా జగన్ ఏం చేసినా విపక్షం మొత్తం ఒక్కటై రచ్చ చేస్తోంది.

తంబీల కితాబు ….

తమిళనాడులో పళనిస్వామి అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్ కంటే ముందే ఆయన అక్కడ సీఎం. అయినా జగన్ మంచితనాన్ని, ఆయన సేవా నిరతిని కొనియాడుతున్నారు. నిండు అరవ శాసన‌సభలో జగన్ మంచికి, మానవత్వానికి పెట్టింది పేరు అంటూ కీర్తిస్తున్నారు. అడిగిందే తడవుగా చెన్నై నగరానికి కృష్ణా జలాలను తెలుగు గంగ ద్వారా పంపి దాహం తీర్చిన అపర భగీరధుడు అంటూ తాజాగా తమిళ అసెంబ్లీలో ఆయన ఎలుగెత్తి చాటారు. మరో వైపు అక్కడ ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే అధినేత స్టాలిన్ సైతం జగన్ పట్ల సానుకూలంగానే ఉంటున్నారు. జగన్ సీఎం గా ప్రమాణం చేస్తే హాజరైన స్టాలిన్ కూడా తొందరలోనే మంచి నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న జగన్ పైన మంచి అభిప్రాయంతో ఉన్నారు.

మూడు.. కరెక్టే….

ఇదిలా ఉండగా, అమరావతి విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్‌ అని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అంటున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ఒక రాష్ట్రం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. సదుపాయాలు అందరికీ సమానంగా ఉండాలంటే ప్రతి జిల్లాలో అభివృద్ధి జరగాలని చెప్పారు. ఈ విషయంలో జగన్ విజనరీ కరెక్ట్ అని, ఏపీ లాంటి రాష్ట్రాలకు ఇది అనివార్యమని కూడా చెప్పుకొచ్చారు.

కెటీయార్ సై….

ఇంకోవైపు ఆరు నెలల జగన్ పాలన అదుర్స్ అని తెలంగాణా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఈ మధ్యనే తెగపొగిడారు. జగన్ బాగాపనిచేస్తున్నాడంటున్నారు. అదే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చిన్నవాడైనా జగన్ పాలన బాగా చేస్తున్నారని, చూసి నేర్చుకోవాలని కేసీయార్ని దెప్పుతున్న సంగతీ విధితమే. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో మాత్రం ప్రతిపక్షం అంతా ఒక్కటై జగన్ మీద బాణాలు ఎక్కుపెడుతూండడమే విస్మయం కలిగించే విషయం. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడూ ఉన్నట్లుగానే ప్రతి ప్రభుత్వంలోనూ మంచి, చెడూ రెండూ ఉంటాయి. వాటిని చూడకుండా ఎంతసేపూ జగన్ ఏ మాట మాట్లాడినా చీల్చి చెండాడేందుకే విపక్షాలు చూడడమే బాధకరం. మరి జగన్ ఇంట ఎపుడు గెలుస్తారో.

Tags:    

Similar News