సరైన సమయం వచ్చేసింది… మరి నిర్ణయమో?

అలుగుటయే ఎరుగని మహిమాత్ముడు అన్నట్లుగా కనిపించే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా లేఖలు రాస్తున్నారు. ఆయన సైతం కరోనా వ్యాక్సిన్ కోసం ధర్మ పోరాటానికి రెడీ [more]

Update: 2021-06-04 12:30 GMT

అలుగుటయే ఎరుగని మహిమాత్ముడు అన్నట్లుగా కనిపించే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా లేఖలు రాస్తున్నారు. ఆయన సైతం కరోనా వ్యాక్సిన్ కోసం ధర్మ పోరాటానికి రెడీ అంటున్నారు. దేశంలో మూడవ దశ కరోనా వచ్చేలోగా వ్యాక్సిన్ కధ ముగించాలని కూడా సూచిస్తున్నారు. దేశంలోని సీఎంలకు ఆయన తాజాగా లేఖలు రాశారు. దీనికి ముందు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఏపీ సీఎం జగన్ సహా అందరికీ లేఖలు రాశారు. ఉచిత వ్యాక్సిన్ కోసం కేంద్రాన్ని నిలదీయాలని ఆయన కోరారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేయాలని దాదాపుగా అన్ని రాష్టాల సీఎంల నుంచి ఒకే డిమాండ్ వస్తోంది.

లేఖల గుట్టేనా…?

జగన్ సీఎం అయ్యాక ఇలా వరసపెట్టి లేఖలు రావడం అన్నది మునుపు ఎపుడూ జరగలేదు. జగన్ సైతం తన రాష్ట్రం తన పని అన్నట్లుగా ఉండేవారు. కానీ ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోడీ సర్కార్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా అంతా ఒక్కటి కావాలంటూ విపక్ష సీఎంలకు లేఖ రాశారు. జగన్ కి కూడా అది అందింది. ఇపుడు మరి కొందరు సీఎం లు ముందుకొచ్చారు. అందరి మాటా బాటా ఒక్కటిగానే ఉంది. సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీస్తున్న మోడీ సర్కార్ మీద దండెత్తాలి అన్నదే అందరి అజెండాగా ఉంది. ఇలా వచ్చి పడుతున్న లేఖల మీద జగన్ రెస్పాన్స్ ఏంటి అన్నది మాత్రం అసలు వెల్లడి కావడంలేదు.

లాగేస్తున్నారుగా…?

నిజానికి జగన్ ఎన్డీయేలో లేరు. పైగా ఆయనకు ఎవరితోనూ పొత్తులు లేవు. అందుకే ఆయన్ని కలుపుకుని ముందుకు పోవడానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. జగన్ మోడీల మధ్య సంబంధాలను కేవలం అధికార పరిధుల వరకూ మాత్రమే చాలా మంది చూస్తున్నారు. ఏపీకి కూడా కేంద్రం ఏ సాయం చేయడం లేదు అన్నది జాతీయ స్థాయి విపక్షల నేతల భావనగా ఉంది. అందువల్ల జగన్ లాంటి యంగ్ డైనమిక్ లీడర్ చేతులు కలిపితే పని మరింత సులువు అవుతుంది అన్న వారే ఉన్నారు. పైగా చంద్రబాబు ప్లేస్ లో జగన్ రావాలని కోరుకుంటున్న వారూ విపక్ష శిబిరంలో ఉండడం విశేషం. దీంతో చేయి పట్టుకుని మరీ జగన్ని తమ వైపు లాగేసుకోవడానికి వీరంతా ఆరాటపడుతున్నారు.

కుదిరేనా…?

రాజకీయ తటస్థ వైఖరిని అనుసరించడం దేశంలో మోడీ పీఎం గా ఉండగా కుదిరేది కాదు అన్న దానికి నిట్ట నిలువు ఉదాహరణ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. ఆయన జాతీయ రాజకీయాల్లో అసలు బుర్ర పెట్టరు. అలాటిది ఆయన కూడా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర విధానాలను ప్రశ్నిస్తున్నారు. మరి రెండు దశాబ్దాలుగా సీఎం గా ఉన్న నవీన్ లాంటి వారే ఒక స్టాండ్ తీసుకోగా లేనిది రెండేళ్ల సీఎం జగన్ తీసుకుంటే తప్పేంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇదే కరెక్ట్ సమయం అని కూడా చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం దేశ ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. కేంద్రం జాతీయ భావనను పక్కన పెట్టి రాష్ట్రాలను ఎగదోస్తోంది. దీనికి విసిగే చాలా మంది గొంతు పెంచుతున్నారు. దీంతో అందరి దృష్టి జగన్ మీద ఉంది. జగన్ తన మీద విపక్షాలు ఎక్కుపెడుతున్న లేఖాస్త్రాలను ఎలా ఎదుర్కొంటాలో చూడాలి. అదే సమయంలో ఆయన ఏ గట్టున ఉంటారో కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా వత్తిడి పెరుగుతోంది.

Tags:    

Similar News