అంతటి సక్సెస్ రిపీట్ అవుతుందా…. ?

జగన్ రాజకీయ జీవితం అక్షరాలా పుష్కర కాలం. నాడు నల్ల కాలువ వద్ద జగన్ తొలిసారిగా జనాలను ఉద్దేశించి మాట్లాడినపుడు ఉమ్మడి ఏపీ అంతా ఆసక్తిగా చూసింది. [more]

Update: 2021-06-01 08:00 GMT

జగన్ రాజకీయ జీవితం అక్షరాలా పుష్కర కాలం. నాడు నల్ల కాలువ వద్ద జగన్ తొలిసారిగా జనాలను ఉద్దేశించి మాట్లాడినపుడు ఉమ్మడి ఏపీ అంతా ఆసక్తిగా చూసింది. ఆ మీదట ఓదార్పు యాత్రలతో జగన్ రాష్ట్రాన్ని పట్టుకుని తిరిగినపుడు కొత్త నాయకుడు దొరికాడు అంటూ సంబరపడింది. 2014 ముందు దాకా జగన్ చేసిన పోరాటాలు, జైలు జీవితాన్ని చూసిన జనం ధీరోదాత్తుడు అంటూ కీర్తించింది. 2014 నుంచి 2019 మధ్య ప్రతిపక్ష నేతగా చంద్రబాబును ఎదుర్కొంటూ సాగించిన సమరాన్ని చూసి చిచ్చరపిడుగే అనుకుంది. పాదయాత్రలో జగన్ ని చూసిన మీదట మరో వైఎస్సార్ అంటూ కీర్తించింది.

అన్నీ అయిపోయాయా…?

జగన్ రెండేళ్ల పాలన పూర్తి అయింది. జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక తాను చేయాల్సినవి అన్నీ చేశారు. తన శక్తియుక్తులు ఉన్నంతమేరకు ప్రజల అవసరాలకు తగినట్లుగా స్పందిస్తున్నారు. తన‌ ఆలోచనలకు తగిన విధంగా పాలనను సాగిస్తున్నారు. జగన్ పధకాలు లెక్కకు మిక్కిలిగా మితిమీరిపోయి ఒక దశలో ఆ తీపే చేదుగా మారుతోంది. జగన్ ఇస్తున్నాడు, తీసుకుంటున్నామన్న ధోరణిలోకి జనాలు వచ్చేశారు. మరికొందరు అయితే మేము కట్టే పన్నుల నుంచే కదా పధకాలు ఇస్తోంది అంటూ అసలైన హక్కుదారుల మన్న తీరున గట్టిగా చెప్పుకుంటున్నారు.

రెండవ వైపు….?

జగన్ పధకాల గురించి వైసీపీ అదే పనిగా చెప్పే మాట ఒకటి ఉంది. సంతృప్త స్థాయిలో వీటిని అందించామని. సరే బాగుంది.ఆ సంతృప్తి జనాలకు వచ్చేసిందా. ఆ తరువాత సంగతేంటి అన్నదే ఇపుడు చూడాలి. నిజానికి జనాలు ఎపుడూ దేవుడు ఎదురైనా కూడా కొత్త వరాలు అదే పనిగా కోరుతూనే ఉంటారు. ఇచ్చిన వాటితో వారు ఏనాడూ సరిపెట్టుకోరు. మరి అలా కనుక చూసుకుంటే జగన్ నుంచి ఇంకా ప్రజలు ఏవేవో ఆశిస్తున్నారేనే అనుకోవాలి. మరి జగన్ ఇక మీదట ఏం చేయగలరు, ఎంతవరకూ వారి ఆశలను తీర్చగలరు అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.

చూసేసిన సినిమా…?

ఈ తరం జనాన్ని నిరంతరం వెంట తిప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. పైగా సామాజిక మాధ్యమాల పుణ్యామని విపరీత‌మైన అనవసరమైన చైతన్యాన్ని తెచ్చేసుకుంటున్న జనాల కళ్లకు అన్ని కాలాలూ తానొక్కడే నాయకుడిగా కనిపించడం అంటే ఎవరికైనా కష్టమే. 2019లో వైసీపీ సినిమా మీద బోలెడు అంచనాలు ఉన్నాయి. అవి ఆకాశాన్ని తాకాయి. అందుకే వచ్చిన రిజల్ట్ కూడా బిగ్ సౌండ్ చేసింది. మరి 2024లో అదే సినిమాతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి అంతటి సక్సెస్ రిపీట్ అవుతుందా. జగన్ మీద మోజు అదే స్థాయిలో ఉంటుందా ఇది వైసీపీ లో సంగతేమో కానీ రాజకీయ మేధావులో మాత్రం చర్చగా ఉంది. 2024 నాటికి వైసీపీ అంచనాలు పెంచేలా జగన్ చేయాలంటే మరిన్ని మెరుపులు మెరిపించాలి. క్రికెటర్ ధోనీలా మెరుపు షాట్లు చాలానే కొట్టాలి. మరి జగన్ అలా చేయగలడా. మరింతమంది కొత్త ఓటర్లు కూడా జమ అవుతున్న ఆ ఎన్నికల్లో పాత ఒక రోత అన్నట్లుగా వైసీపీ మీద క్రేజ్ తగ్గితే సంగతేంటి అన్నది కూడా ఆ పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి. మొత్తానికి జగన్ గుప్పిట విప్పేశారు. గుట్టూ చెప్పేశారు. ఆ మీదట ఇంకా ఏదో ఉందనీ, ఉంటుందని ఆసక్తిని అర్జంటుగా కలగచేయకపోతే 2024 ఎన్నికలు వైసీపీకి కత్తి మీద సామే అంటున్నారు.

Tags:    

Similar News