జగన్ మైలేజ్ ని అవి పెంచనున్నాయా ?

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగానే కాదు అన్ని రంగాల్లో విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రం. అలాంటి ఎపి కి కరోనా వంటి విపత్తు మరింత చేటు తెచ్చిపెట్టింది. విద్యా, ఆరోగ్య [more]

Update: 2021-05-31 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగానే కాదు అన్ని రంగాల్లో విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రం. అలాంటి ఎపి కి కరోనా వంటి విపత్తు మరింత చేటు తెచ్చిపెట్టింది. విద్యా, ఆరోగ్య రంగాలపై పూర్తిగా హైదరాబాద్ పై ఆధారపడి రీతిలో గత పాలకుల పాలన సాగిన నేపథ్యంలో ప్రస్తుత ఉపద్రవంలో జగన్ సర్కార్ కి వైద్యం పేదలకు అందించడం కత్తిమీద సాములాగే మారింది. ఫలితంగా వైద్య రంగాన్ని తక్షణం బలోపేతం చేయాలిసిన తరుణం ఆసన్నమైందన్న సంకేతాలు కళ్లెదుటే అందరికి కనిపించాయి. తెలుగు రాష్ట్రం అందునా ఉమ్మడి రాజధానిగా మరో మూడేళ్ళు అవకాశం ఉన్నా భాగ్యనగరానికి వైద్యం కోసం రోగులు వెళ్లలేని దుస్థితి సగటు ఆంధ్రుడికి అవమానంగానే తోచింది. ఇవన్నీ లెక్కలేసుకున్న యువముఖ్యమంత్రి జగన్ సత్వర చర్యలు చేపట్టడమే ఇప్పడు చర్చనీయంగా మారింది.

హెల్త్ హబ్ లు సక్సెస్ కావాలంటే …?

అన్ని జిల్లాలు కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టి, సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రుల నిర్మాణం మూడేళ్ళ కాలపరిధిలో పూర్తి కావాలి. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంతో ఈ లక్ష్యం నెరవేరి ఒకేసారి 16 ప్రాంతాల్లో హెల్త్ హబ్ లు నిర్మించాలి. ఇది ఇప్పుడు జగన్ సర్కార్ పెట్టుకున్న టార్గెట్. దీనితో బాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కళాశాల నిర్మించాలని జగన్ గతంలోనే సంకల్పించారు. వీటి నిర్మాణానికి ఇప్పుడు శరవేగంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి. కనీసం 100 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేవారికి భూమిని ఉచితంగా అందించేందుకు సీఎం ముందుకు వచ్చారు. వారు మూడేళ్ళ కాలంలో ఈ ఆసుపత్రులను నిర్మించాలి. ఐదు ఎకరాల నుంచి 50 ఎకరాల విస్తీర్ణం లో భూమిని సమీకరించాలని కూడా జగన్ రెవెన్యూ శాఖ కు టార్గెట్ పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్ని ఆయన అనుకున్నట్లు జరిగితే బ్రహ్మాండమైన హెల్త్ హబ్ లు ఎపి అంతా ఏర్పడతాయి. వైద్యం కోసం హైదరాబాద్ చెన్నయి, బెంగుళూర్ లకు రోగులు క్యూ కట్టాలిసిన వెతలు తప్పుతాయి.

కార్పొరేట్ చేతిలో పడితే …

పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యంతో హెల్త్ హబ్ ల ఏర్పాటు కు కార్యాచరణ బాగానే ఉన్నా ఇలా ఏర్పడే ఆసుపత్రులు ఎంతవరకు పేదలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నది చర్చనీయం అవుతుంది. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవారు లాభాలు ఆశించకుండా నిస్వార్ధంగా ప్రజలకు వైద్య సేవలు ఏమేరకు అందిస్తారు అన్నది ప్రశ్న గా మిగులుతుంది. ప్రభుత్వ సొమ్ముతో సోకులు చేసి ప్రజల నుంచి డబ్బులు గుంజితే సామాన్యులకు ఒరిగేది ఏమిటన్న సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ అస్త్రంతో జగన్ పేదలకు చౌకైన కార్పొరేట్ వైద్యం అందించేందుకే ఈ ప్రయత్నం అన్న వాదన అధికారపార్టీ నుంచి ఉంది. ఈ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రుల మాటెలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ లను మరింతగా తీర్చిదిద్దితే చిన్నా చితక ఆరోగ్య సమస్యలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు వెళ్ళలిసిన బాధలు తప్పుతాయంటున్నారు. కేరళ లో పటిష్ట వైద్య ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటే ఎలాంటి విపత్కర ఆరోగ్య సంక్షోభాలు ఎదురైనా గెట్టేక్కేస్తామని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ సర్కార్ ప్రజా ఆరోగ్య విషయంలో వేసిన అడుగును మాత్త్రం అంతా ప్రశంసిస్తూనే హెల్త్ హబ్ లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండటం సర్కార్ పరిగణలోనికి తీసుకుని సరైన దిశగా ముందుకు వెళ్ళలిసిన అవసరం ఉంది.

Tags:    

Similar News