జగన్ కాకపోయి ఉంటేనా ?

జగన్ ఈ జన్మలో సీఎం కాడు అన్న దగ్గర నుంచి 151 సీట్లతో గెలిచి రెండేళ్ల పాటు సీఎం గా ఉండడం అంటే మాటలు కాదు. అది [more]

Update: 2021-05-31 05:00 GMT

జగన్ ఈ జన్మలో సీఎం కాడు అన్న దగ్గర నుంచి 151 సీట్లతో గెలిచి రెండేళ్ల పాటు సీఎం గా ఉండడం అంటే మాటలు కాదు. అది కూడా మీడియా బలంతో వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో దిట్ట అయిన చంద్రబాబు ప్రత్యర్ధిగా ఉండగా జగన్ ఏలుబడి సాగడం కంటే పెద్ద సవాల్ లేదు. మరో వైపు చూస్తే జగన్ కి ఖాళీ ఖజానా వెక్కిరింపు అదనపు భారంగా ఉంది. ఇక రెండేళ్ల పాటు వరసగా వచ్చి పడిన కరోనా మహమ్మారి అతి పెద్ద శాపమే అయింది. ఇవన్నీ ఇలా ఉండగా కూడా జగన్ తన హామీలను 95 శాతానికి పైగా నెరవేర్చడం అంటే చిన్న విషయం కానే కాదు. ఎటు చూసినా సహకరించని వాతావరణంలో ఒక విధంగా జగన్ ఎదురీదాడనే చెప్పాలి.

అద్వితీయమేనా ?

జగన్ రెండేళ్ల పాలనలో మెరుపులు ఉన్నాయి. మరకలు ఉన్నాయి. ప్రజలకు ఏ రకమైన విపత్కర సమయంలో అయినా పధకాలను అందచేయడంలో జగన్ నూరు మార్కులు కొట్టేశారు. అలాగే అనేక విప్లవాత్మకమైన మార్పులను పాలనతో తీసుకురావడంలోనూ ఆయనే మేటి అనిపించుకున్నారు. అయితే కోర్టు కేసుల విషయంలో మాత్రం ఎపుడూ మొట్టికాయలే ఈ ప్రభుత్వానికి దక్కాయి. తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షను నిలబడతాయా అన్న ఆలోచన లేకుండా దూకుడు చేయడం వల్లనే ఇలా జరిగుతోంది అన్న భావన మాత్రం అందరిలో ఉంది. ఏది ఏమైనా జగన్ పాలన బాగానే ఉంది అనే వారే ఈ రోజుకూ మెజారిటీ ఉండడం ఊరటను ఇచ్చే విషయమే అనుకోవాలి.

వేయి గుండెలా…?

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. జగన్ ఉన్న ప్లేస్ లో మరొకరు కనుక ఉండి ఉంటే ఈ పాటికి ప్రభుత్వం కుప్పకూలడమో మరోటో జరిగిపోయేది. జగన్ కి ఒక్క గుండె కాదు వేయి గుండెలు ఉన్నాయేమో అని అంతా భావించేలా ఆయన ప్రత్యర్ధుల మీద పోరాడుతున్నారు అనిపిస్తుంది. జగన్ కి ఎటు చూసినా శత్రువులే ఉన్నారు. ఆయన తండ్రి వైఎస్సార్ నుంచి వచ్చిన వారసత్వ శత్రుత్వంతో పాటు తాను పెంచుకున్న శత్రువులు, తన దూకుడు మూలంగా ఏర్పడిన వారూ ఇలా అన్ని వైపులు నుంచి ఆయన మీద‌ కత్తులు దూసేవారే ఉన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో జగన్ వీరిని ధీటుగానే ఎదుర్కోవడంలోనే జనాల నుంచి మరింత పాజిటివిటీని సంపాదిస్తున్నారు .

అగ్ని పొరాటమే …?

జగన్ కి ముందు మూడేళ్ళ పాలన ఉంది. నిజానికి ఇంతవరకూ సాఫీగా పాలన సాగాలి. ఏ కొత్త ప్రభుత్వం అయినా తొలి రెండేళ్ళూ రిలాక్స్ గా ఉండి తరువాత వ్యూహాలకు పదును పెడుతుంది. కానీ జగన్ కి మాత్రం ఆ శాంతి లేకుండా పోయింది. ఒక విధంగా అదే మంచిదని జగన్ తన పోరాట పటిమని మరింతగా పెంచుకుంటున్నారు. ఇపుడు అది ఆయనకు ఇంకా కావాల్సి ఉంటుంది. జగన్ ని దెబ్బ తీసేందుకు రాజకీయ ప్రత్యర్ధులు కాచుకుని కూర్చుకున్నారు. అన్ని కళ్ళూ ఆ వైపే చూస్తున్నాయి. ఏ మాత్రం తడబడినా కూడా విచ్చు కత్తులు తీసేందుకు రెడీగా ఉన్నారు. జగన్ ఒక విధంగా చుట్టూ మంటలను పెట్టుకుని యుద్ధం చేస్తున్నారు. అవి అంతకంతకు పెరుగుతున్నాయి. అయినా సమరం చేయడం తప్పదు, అలుపు వచ్చినా అలా పోరు సాగించాల్సిందే. ఈ మూడేళ్ల తరువాత మరోసారి జనం నుంచి విజయం అందుకుంటేనే జగన్ రిలాక్స్ అయినట్లు లెక్క.

Tags:    

Similar News