వాళ్లంతా రగిలిపోతున్నారు జగన్.. ?

ఒక్కో నాయకుడికి ఒక్కో ఆలోచన ఉంటుంది. అది అమలు చేయడం ద్వారా వారే సృష్టికర్తలుగా పేరు తెచ్చుకుంటారు. ఆ విధంగా ఆలోచిస్తే వైఎస్సార్ కి ఆరోగ్యశ్రీ, రైతులకు [more]

Update: 2021-06-13 14:30 GMT

ఒక్కో నాయకుడికి ఒక్కో ఆలోచన ఉంటుంది. అది అమలు చేయడం ద్వారా వారే సృష్టికర్తలుగా పేరు తెచ్చుకుంటారు. ఆ విధంగా ఆలోచిస్తే వైఎస్సార్ కి ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ మాదిరిగా జగన్ కి గ్రామ సచివాలయాలు మానసపుత్రికగా ఉంది. ప్రజల వద్దకు పాలన అని ఎన్టీయార్, చంద్రబాబు ఎంతలా అన్నా కూడా సిసలైన పాలన జనాలకు చేరుతోంది మాత్రం గ్రామ సచివాలయాల ద్వారానే. ఏర్పాటు అయి దాదాపుగా రెండేళ్లు అవుతున్న సచివాలయాల మీద జనాలలో మంచి అభిప్రాయమే ఉంది. కానీ ఈ భారాన్ని మోస్తున్న ఉద్యోగులు మాత్రం గాడిద చాకిరి బాబోయ్ అనేస్తున్నారుట.

ఉపాధి అనుకుంటే…..?

జగన్ పాదయాత్ర సందర్భంగా గ్రామ సచివాలయాలను జనం ముందు చర్చకు పెట్టారు. అలాగే ఆ ఊరి యువకులకు అక్కడే ఉపాధి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అన్నట్లుగానే చేశారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు, మరో లక్షన్నర మంది సచివాలయ సిబ్బందితో నాలుగు లక్షల మంది దాకా నిరుద్యోగులకు జగన్ ఉపాధి కల్పించారు. అంతవరకూ బాగానే ఉన్నా తమ జీతాలు పెంచమని కోరిన వాలంటీర్లకు ఇది గౌరవ సేవ మాత్రమే అంటూ పక్కన పెట్టేశారు. అది వారిలో అసంతృప్తి రాజేస్తోంది. ఇక సచివాలయ సిబ్బందికి 15 వేల రూపాయల జీతం మాత్రమే వస్తోంది. దానికి ఎదుగూ బొదుగూ అసలు లేనేలేదు.

బండ పడేస్తున్నారుగా…?

గ్రామ సచివాలయాలు ఎలా తయారయ్యాయి అంటే లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క పనీ చేయరు. అన్ని బాధ్యతలను సచివాలయాల మీదనే పడేస్తున్నారు. మునిసిపల్, రెవిన్యూ సహా మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల పనులనూ సచివాలయాలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. దాంతో చాకిరి ఎక్కువ అయిపోతోంది అని సిబ్బంది మండిపోతున్నారు. అదే సమయంలో పై నుంచి వచ్చే ఆదేశాలను సచివాలయాల‌కు బదలాయించి లక్షలు తీసుకునే అసలైన ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదేమని అడిగేందుకు సచివాలయ సిబ్బందికి ధైర్యం లేదు, పైగా వారిది పర్మనెంట్ ఉద్యోగం కానే కాదు. దాంతో కిక్కురుమనలేక చేయాల్సి వస్తోందిట.

బద్ధలవుతుందా ..?

జగన్ ఇష్టపడి నియమించిన సచివాలయ వ్యవస్థ రెండేళ్లలోనే పక్క దారి పడుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయా వార్డుల వరకే పరిమితం అయిన పనులను చేయడానికి సచివాలయ వ్యవస్థను రూపకల్పన చేశారు. కానీ అది రూట్ మారింది. మునిసిపాలిటీలో పనిచేసే కీలక విభాగాల ఉద్యోగులు ఇపుడు ఏ బాధ్యతా లేకుండా తయారు అయ్యారు. అలాగే రెవిన్యూ ఆఫీస్ లో కీలకమైన పౌర సరఫరాల శాఖ సహా అనేక విభాగాలకు పనిలేదు. ఉన్నా వారు చేయడంలేదు. మొత్తం భారాన్ని చిరుద్యోగుల మీదనే నెట్టేస్తున్నారు. కరోనా వంటి పెను విపత్తు వేళ గొడ్డు చాకిరియే చేయాల్సి వస్తోందని సచివాలయ ఉద్యోగులు మండుతున్నారు అంటే అది ఎపుడో ఒకపుడు రగిలి బద్ధలయ్యేదే అంటున్నారు. వీటికి తోడు రాజకీయ నాయకులు సైతం సచివాలయ వ్యవస్థను వాడేసుకుంటున్నారుమ్ ఆడేసుకుంటున్నారు. మొత్తానికి ఏదో ఒక రోజు బడబాగ్ని మండి జగన్ ముందే అగ్ని జ్వాలలు చిమ్మే రోజులు వస్తాయని అంటున్నారు. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్ వారి విధివిధాలను సరిగ్గా డిజైన్ చేయడంలో చూపుతున్న అశ్రద్ధ కారణంగానే వారిని ఆల్ ఇన్ వన్ గా వాడేసుకుంటున్నారు అన్న విమర్శ అయితే ఉంది.

Tags:    

Similar News