ముప్పాతిక సమయం ముగిసినట్లేగా… ?

కరోనా వచ్చి మొత్తం సీన్ మార్చేసింది. ఒక ఏడాది కాదు రెండేళ్ళుగా అది ఎక్కడా కాలు కదపనీయడంలేదు. ఇక మరో వైపు మూడవ వేవ్ ముప్పు కూడా [more]

Update: 2021-06-13 02:00 GMT

కరోనా వచ్చి మొత్తం సీన్ మార్చేసింది. ఒక ఏడాది కాదు రెండేళ్ళుగా అది ఎక్కడా కాలు కదపనీయడంలేదు. ఇక మరో వైపు మూడవ వేవ్ ముప్పు కూడా అని అంటున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందో కానీ మంత్రులతో పాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి మాత్రం కాలం అంతా కరోనాతో ఖర్చు అయిపోతోంది అన్నది నిజం. పదవి ఏది అయినా కాగితం మీద రాసుకుంటే సరిపోదు కదా ఆ దర్జా అనుభవించాలి అంటే జనాల్లో ఉండాలి. దర్పం చూపించాలి అంటే ఆర్భాటం చేయాలి. కానీ కరోనా మొత్తం మూసేసి తాళం వేసేసింది.

గోల్డెన్ పీరియడ్ అంతా …?

మంత్రి అంటే ఆ వైభోగమే వేరు. కానీ వైసీపీ నేతలకు ఆ అవకాశం అసలు రాలేదు. 2019 జూన్ 8న పాతిక మంది మంత్రులను జగన్ తమ క్యాబినెట్ లోకి తీసుకున్నాడు. వారు గట్టిగా ఎనిమిది నెలలు అయినా జనాల్లోకి వెళ్ళాలో లేదో తెలియదు. ఆ కొత్తదనం అలా ఉండగానే 2020 మార్చి నుంచి కరోనా రక్కసి ఏపీ మీద పడి పీడించేసింది. దాంతో గత ఏడాది క్యాలండర్ మొత్తం కరిగిపోయింది. ఇక 2021లో అయినా బాగుంటుంది అని ఆలోచిస్తే అది కూడా లేకుండా సెకండ్ వేవ్ ఫుల్ గా కమ్మేసింది. దాంతో ఇపుడు మంత్రులలో ఒకేటే ఆవేదన గా ఉందిట. మేము మంత్రులమై ఏం బావుకున్నామని. తాము మినిస్టర్లమని బోర్డులు తగిలించుకోవడం తప్ప చేసేది కూడా ఏమీ లేకుండా పోయిందని తెగ ఫీల్ అవుతున్నారుట.

ఆ వరమిస్తారా…?

ఇక చూస్తూండగానే జగన్ పెట్టిన నియమం ప్రకారం రెండున్నరేళ్ళకు మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం దగ్గరపడుతోంది. తాము మంత్రులుగా ఇంకా కుర్చీలలో సరిగ్గా కూర్చోలేదని, అందువల్ల కొన్నాళ్ల పాటు తమకే అవకాశం ఇవ్వాలని పాతిక మంది మంత్రులలో అత్యధికులు కోరుతున్నారుట. విస్తరణను వాయిదా వేసి తమనే ఉంచాలని కూడా విన్నవించుకుంటున్నారుట. కరోనా కారణనా వ్యాపారాలు నష్టపోయిన వారికి ఇతర ప్రయోజనాలు దెబ్బ తిన్న వారికీ నష్టపరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం మంత్రులకు కూడా కరోనా వల్ల నష్టపోయిన కాలాన్ని లెక్కేసి అన్నాళ్ళూ మంత్రులుగా కొనసాగించాలన్న వింత డిమాండ్ కూడా పెడుతున్నారుట.

ఎక్స్ టెన్షన్ కావాలిట….

ఇదే తీరున ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ఆలోచనలు ఉన్నాయాట. వారి పదవీకాలం కూడా తొందరలో ముగుస్తోంది. తాము ఈ రెండేళ్లలో ఏం సాధించామని దిగిపోవడానికి వారు గుర్రుమంటున్నారుట. ఓ వైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనాతో తిరుమల గిరులకు కళ తగ్గిందని అంటున్నారు. ఇక బోర్డు అమలు చేయాల్సిన నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయని కూడా వారు అంటున్నారు. మరో వైపు తాము ప్రత్యక్షంగా కూడా బోర్డు మీటింగులో పాల్గొన్న సందర్భాలు కరోనా కారణంగా అసలు లేవు అని మధనపడుతున్నారు. కరోనా నేపధ్యాన్ని గమనంలోకి తీసుకుని ప్రభుత్వం తమ పదవులకు మరి కొంత కాలం ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని, టెన్షన్ తగ్గించాలని వారు కోరుతున్నారుట. మరి జగన్ వీటి మీద ఏమంటారో చూడాలి.

Tags:    

Similar News